బీడీ కార్మికులకు భరోసా
- నెలకు రూ.1,000 పింఛన్
- వచ్చే నెల నుంచి ‘ఆసరా’ అమలు
- మార్చి ఒకటో తారీఖున పంపిణీ
- ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి వంతున జీవన భృతి ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో లేకున్నా.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
శనివారం సచివాలయంలో సీఎం కేసీఆర్ కార్మిక శాఖ అధికారులు, సంబంధిత మంత్రులతో బీడీ కార్మికుల సమస్యలపై సమీక్ష జరిపారు. అనంతరం మంత్రులు నాయిని, హరీశ్‌రావు విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి నుంచి జీవనభృతి అమలు చేస్తామని, మార్చి 1న పంపిణీ చేస్తామని చెప్పారు. బీడీ కార్మికులకు సంబంధించిన వివరాల సేకరణకు, ఎవరెవరికి జీవనభృతి ఇవ్వాలని అధ్యయనానికి పూనం మాలకొండయ్య అధ్వర్యంలో కమిటీని నియమించినట్లు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పర్యటించి ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.
18ఏళ్లలోపు పిల్లలపై అధ్యయనం
ఈ పరిశ్రమలో వేలాది మంది బాల కార్మికులు ఉన్నారని.. ఇదే ఆధారంగా బతుకుతున్నారని.. వీరికి ‘ఆసరా’ ఎలా అందించాలి..? మరేదైనా ప్రత్యామ్నాయముందా..? అనేది ఈ కమిటీ చర్చించి అధ్యయనం చేస్తుందని చెప్పారు. 18 ఏళ్లలోపు పిల్లలను ఏ విధంగా ఆదుకోవాలి.. వారి కుటుంబాలకు ఎలాంటి సాయం అందించాలి..? అనేది కమిటీ సిఫారసు చేస్తుందన్నారు. అధికారుల కమిటీతో పాటు కార్మిక శాఖ, ప్రావిడెంట్ ఫండ్ విభాగం, ప్రభుత్వం కలిసికట్టుగా ఈ నెలంతా కసరత్తు చేసి సమగ్ర నివేదిక సిద్ధం చేస్తుందని చెప్పారు. సంబంధిత మార్గదర్శకాలన్నీ పూనం మాలకొండయ్య కమిటీ ఖరారు చేస్తుందని తెలిపారు.
ఈ నిర్ణయంతో లక్షలాది బీడీ కార్మికుల కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు. ఇది పేద ప్రజల ప్రభుత్వమని.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపించుకున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం ఈ కార్మికులకు జీవన భృతి ఇస్తామని ప్రకటించారని.. అందులో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని.. ఈలోగా కొందరు జీవన భృతి ఇవ్వటం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఆందోళనలు చేస్తున్నారని మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్మికుల కష్టాలన్నీ సీఎంకి తెలుసునని.. గతంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన సిద్ధిపేట నియోజకవర్గంలో చాలా మంది బీడి కార్మికులున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.