పండుటాకులు విలవిల  | 20 people died in one day while going for pension | Sakshi
Sakshi News home page

పండుటాకులు విలవిల 

Published Thu, Apr 4 2024 5:07 AM | Last Updated on Thu, Apr 4 2024 5:07 AM

20 people died in one day while going for pension - Sakshi

పింఛన్‌ కోసం సచివాలయాలకు వెళ్లొస్తూ ఒక్కరోజే 20 మంది మృత్యువాత 

వేసవి కావడంతో వడదెబ్బ, తీవ్ర అస్వస్థతకు గురవుతున్న వృద్ధులు 

చంద్రబాబు వల్లే తమకు ఈ అవస్థలు వచ్చాయని మండిపడుతున్న లబ్ధిదారులు 

తమ ఉసురు ఆయనకు తగులుతుందని శాపనార్థాలు.. చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతల డ్రామాలు 

పాలకొల్లు, పెనమలూరుల్లో టీడీపీ అభ్యర్థులు నిమ్మల, బోడె ఓవరాక్షన్‌ 

సాక్షి నెట్‌వర్క్‌: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిల కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ఎన్నికల సంఘంపై తమ అనుకూలురుతో ఒత్తిడి తెచ్చి పింఛన్ల పంపిణీ చేయనీయకుండా వలంటీర్లను ఈ ముగ్గురు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవ్వాతాతలు, ఇతర పింఛన్‌ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1నే లబ్దిదారులు ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్‌ అందిస్తుండగా ఈసారి టీడీపీ, జనసేన కుతంత్రాలతో సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం ఎండా కాలం కావడంతో వేసవి తాపానికి వడదెబ్బ కొట్టి మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 20 మంది పింఛన్‌ లబ్దిదారులు మృత్యువాత పడటం విషాదాన్ని నింపింది.

మృతుల కుటుంబీకులు చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఆయన వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టా­రు. చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతలు ఇప్పు­డు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు.  

ఒక్కరోజే 20 మంది మృత్యువాత 
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన ఎన్‌.రాజమ్మ (85) సచివాలయం వద్దకు నడిచి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో రాయి కాలుకు తగిలి ముందుకుపడి మృతి చెందింది. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లిలో టీడీపీ కుట్రలతో ఆందోళనకు గురైన దుగ్గిలమ్మ(70) అనే వృద్ధురాలు మృతిచెందింది. అలాగే గుండెపోటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మద్దులచెర్వులో చోటు చేసుకుంది. అదేవిధంగా కొండకమర్ల పంచాయతీ పోలేవాండ్లకొత్తపల్లిలో సన్నాయప్ప (73) తన భార్య పింఛన్‌ కోసం ఎండలో నడుచుకుంటూ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వడదెబ్బకు గురై మృతి చెందాడు.

సూళ్లూరుపేట సాయినగర్‌లో ఈశ్వరవాక లలితమ్మ (58) వితంతు పింఛను కోసం గాండ్లవీధి సచివాలయం వద్ద క్యూలో నిలబడి ముందుకు పడిపోయి ప్రాణాలు విడిచింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం ఎరికంబట్టు దళితవాడకు చెందిన అప్పాస్వామి(75) పెన్షన్‌ కోసం ఇంటి బయటే మంచంపై ఎదురు చూస్తూ ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై మరణించాడు. అలాగే చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన నన్నేసాహెబ్‌ (76) పింఛన్‌ కోసం వెళ్లి సచివాలయం వద్ద కుర్చిలో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన సచివాలయం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు నన్నేసాహెబ్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఘడియపూడి పునరావాస కాలనీలో బొమ్మల శేషయ్య (70) పింఛన్‌ కోసం సచివాలయానికి వెళ్లి ఇంటికి చేరుకుని భోజనం చేసి నీరసంగా పడుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేపడానికి ప్రయత్నించగా విగత జీవుడై ఉన్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లికి చెందిన బుర్ర శామ్యూలు (71) గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. అలాగే గుంటూరు జిల్లా కొల్లిపరలో దొప్పలపూడి బాబూరావు (62) వ్యవసాయ కూలీ. ఈ క్రమంలో పింఛన్‌ కోసం సచివాలయానికి వెళ్లిన బాబూరావు తిరిగొస్తూ ఇంటికి సమీపంలో కుప్పకూలిపోయి మరణించాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరుకు చెందిన సయ్యద్‌ ఖాదర్‌బాషా బోదకాలుతో బాధ పడుతున్నాడు.

ఈసారి సచివాలయం వద్ద ఇస్తారని తెలిసి కుమారుడి బైక్‌పై అక్కడకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక అస్వస్థతకు గురై మృతిచెందాడు. కాకినాడ జిల్లా తూరంగి పగడాలపేటకు చెందిన అడపా వీర్రాజు (67) పింఛన్‌ కోసం సచివాలయం వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో కళ్లు తిరగడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు వీర్రాజును ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. అలాగే ఏటిమొగ ప్రాంతానికి చెందిన పట్టా అప్పారావు(61) సమీపంలోని సచివాలయానికి వెళ్లాడు. ఎండ తీవ్రతతో సచివాలయం దగ్గరే స్పృహ తప్పాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఏటిమొగలోని రాజీవ్‌ గృహకల్ప సముదాయానికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు.

కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన పిల్లి నాగేశ్వరమ్మ (75) కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్న సచివాలయానికి కాలినడకన బయలుదేరింది. కొంత దూరం నడిచి ఆయాసంతో పడిపోయి మృత్యువాత పడింది. పల్నాడు జిల్లా దుర్గి మండల పరిధిలోని నెహ్రూనగర్‌ తండాకు చెందిన రమావత్‌ సాలిబాయి (70) పెన్షన్‌ కోసం ముటుకూరు 2 సచివాలయానికి ఆటోలో వెళ్తుండగా దారి మధ్యలో సొమ్మసిల్లి కుప్పకూలింది. ఆమెను ముటుకూరు పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.   

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దిగువతొట్లివారిపల్లె గ్రామానికి చెందిన టి. మంగమ్మ(68) ఇంట్లోనే ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలిపోయి మృతి చెందింది. పింఛన్‌ కోసం ఎండలో వెళ్లి వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాజుబాబు (48) పింఛన్‌ కోసం పంచాయతీ కార్యాలయానికి ఎండలో వెళ్లాడు. దీంతో వడదెబ్బకు గురికావడంతో ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందినట్లు ఆయన భార్య సీత తెలిపింది.

అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ వేలమామడికి చెందిన పాడి సొములు(65) పింఛన్‌ కోసం పెదకోట సచివాలయానికి నడుచుకుని వెళుతుండగా జాలడ గ్రామ సమీపంలో ఆయాసం రావడంతో కూర్చొన్నాడు. అదే సమయంలో సొమ్మసిల్లిపోవడంతో మృత్యువాత పడ్డాడు.   

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన పింఛన్‌ లబ్దిదారుడు పాతకోకిల పెద్దిరాజు (63) పింఛన్‌ ఇస్తున్నారని తెలిసి సచివాలయానికి బయలుదేరాడు. తీవ్ర ఉద్వేగానికి గురైన పెద్దిరాజు ఇల్లు దాటి వెళుతుండగా కొద్దిదూరంలో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.  

చేతులు విరిగి.. 
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట సచివాలయానికి పింఛన్‌ తీసుకునేందుకు వెళ్లిన పోలి తులసమ్మ అనే వృద్ధురాలు తిరిగి వస్తూ కింద పడటంతో చేయివిరిగింది. ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం వేంపాడుకు చెందిన గ్రంధి మరియమ్మ (71) పింఛను నగదు కోసం ముండ్లమూరు సచివాలయానికి వెళ్లింది. మండుటెండలో ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌ సెంటరుకు వచ్చింది. ఆటో ఎక్కే క్రమంలో ఎండధాటికి సొమ్మసిల్లి కింద పడిపోయింది.

ఈ క్రమంలో ఆమె మూతికి, పెదాలకు తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన పరుచూరి కృష్ణకుమారి (74) గుండెపోటుకు గురయ్యారు. చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పొన్న సుబ్బారావు అనే వృద్ధుడు పింఛను కోసం గ్రామ సచివాలయానికి వెళుతూ మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయారు.  

పింఛన్‌ తీసుకోవాలంటే 30 కి.మీ వెళ్లాల్సిందే  
టీడీపీ నేతల నిర్వాకంతో వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో గిరిజనులు అల్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చెన్నపాలెం గ్రామం గారపెంట పంచాయతీలో ఉండగా దాని సచివాలయం పుల్లలచెరువులో ఉంటుంది.

పుల్లలచెరువు నుంచి చెన్నపాలెం గిరిజనగూడెం వెళ్లాలంటే రానుపోను కలిపి 30 కి.మీ దూరం. ఇప్పటి వరకు వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్‌ ఇస్తున్నారు. ఈనెల వలంటీర్లు రాకపోవడంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు కూడా సచివాలయానికి వెళ్లి పింఛన్‌ తీసుకోవాల్సి వచ్చింది. మండుటెండలో అంతదూరం వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కల్పించారంటూ వృద్ధులు, వికలాంగులు టీడీపీ నేతలపై మండిపడ్డారు.  

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల డ్రామాలు  
ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డ్రామాలు మొదలుపెట్టారు. బుధవారం పట్టణంలోని సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్ల పంపిణీకి సంబంధించి టీడీపీ వల్ల ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి వృద్ధులను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

ఇలా ఎందుకు కూర్చోబెట్టారు అంటూ సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. సచివాలయం బయటకు వచ్చి పింఛన్‌దారులతో మాట్లాడుతూ ఇంకా పింఛన్‌ డబ్బులు రాలేదు కానీ టీడీపీ వల్లే పింఛన్లు ఇంటికి రావడం లేదని అంటున్నారన్నారు. ఎమ్మెల్యే నిమ్మల వెళ్లిపోయిన తర్వాత అక్కడున్న పింఛన్‌దారులంతా ఇంటికి పింఛన్లు రాకుండా ఈ టీడీపీ నాయకులే అడ్డుకున్నారని మండిపడ్డారు.  

చంద్రబాబు వైఖరిపై పింఛన్‌దారుల ధర్నా 
పింఛను పంపిణీ విధానంపై చంద్రబాబు వైఖరి పట్ల లబ్దిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడులో సచివాలయం వద్ద పింఛనుదారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రతి నెల వలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ల కార్యక్రమాన్ని అడ్డుకున్న చంద్రబాబు వైఖరి నశించాలని నినాదాలు చేశారు.  పాత పద్ధతిలో వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.  

కృష్ణా జిల్లా గంగూరులో ‘బోడె’ శవ రాజకీయం 
టీడీపీ, జనసేన కుట్రలతో ఈసారి పింఛన్‌ ఇవ్వటానికి వలంటీర్‌ లేకపోవటంతో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వెంపటి వజ్రమ్మ (80)గుండెపోటుకు గురై మరణించింది. గంగూరు ఏఆర్‌ నగర్‌ కాలనీలో ఉంటున్న వజ్రమ్మ గంగూరు 2 సచివాలయానికి పింఛన్‌ సొమ్ము కోసం వెళ్లగా బ్యాంకు నుంచి సొమ్ము రావాలని, సాయంత్రం పింఛన్‌ ఇస్తామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. సచివాలయం నుంచి ఇంటికి వచ్చిన కొద్ది క్షణాలకే గుండెపోటుకు గురై మృత్యువాత పడింది. మరోవైపు చేయాల్సిందంతా చేసి డ్రామాలకు టీడీపీ నేతలు తెరలేపారు.

వజ్రమ్మ మృతిని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు యత్నించగా స్థానిక మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపి తిప్పికొట్టారు. వజ్రమ్మ మృతి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జోగి రమేష్‌ బాధితురాలి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వజ్రమ్మకు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కాగా.. మంత్రి అక్కడ ఉన్న సమయంలోనే టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ కూడా తన అనుచరులతో రావటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సమయంలో టీడీపీ అభ్యర్థి బోడెప్రసాద్, అతని అనుచరులు కల్పించుకుని జగన్‌ పింఛన్‌ ఇవ్వకపోవటంతోనే వజ్రమ్మ మరణించిందంటూ ఆరోపించారు. బోడె ప్రసాద్‌ వ్యాఖ్యల పట్ల మహిళలు అభ్యంతరం తెలిపారు. వజ్రమ్మ మరణాన్ని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు చేసిన యత్నాన్ని లబ్ధిదారులే తిప్పికొట్టారు. వలంటీర్‌లు పింఛను ఇస్తే చంద్రబాబుకు బాధ ఏంటని బోడె ప్రసాద్‌ను మహిళలు, పింఛన్‌ లబ్ధిదారులు ప్రశ్నించారు.

జగనన్న పాలనలో ప్రతి నెల వేకువజామునే వలంటీర్‌లు ఇళ్లకు వచ్చి పింఛన్‌ ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు. వజ్రమ్మ అన్యాయంగా చనిపోయిందని, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారా అని నిలదీశారు. ఒక్కసారిగా మహిళలు తిరగబడటంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement