ప్రగతిభవన్‌లో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో రాజీవ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బోదకాలుతో బాధపడుతున్న వారికి పింఛన్ అందజేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దాదాపు 47 వేల మంది బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు రూ.వెయ్యి పింఛన్ అందజేస్తామని, ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. జబ్బుల విషయంలో చికిత్స కంటే నివారణే మేలన్న మాటను ప్రభుత్వం ఆచరణలో పెట్టదలుచుకుందని, ఇందుకోసం ప్రజలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో వైద్యారోగ్యశాఖపై కేసీఆర్ సమీక్షించారు. ఇందులో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, ఉన్నతాధికారులు, పలువురు నేతలు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల, ఎంపీ కవిత చొరవతో..
తమ నియోజకవర్గాల్లో బోదకాలు బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారిని ఆదుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ కవిత ముఖ్యమంత్రికి విన్నవించారు. వారికి తగిన వైద్యం అందించాలని, బోదకాలు వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో బోదకాలు బాధితులకు పింఛన్ అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దాంతోపాటు వారికి అవసరమైన మందులు, ఇతర వైద్య సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి బోదకాలు బాధితులను గుర్తించాలని సూచించారు.
పేదల ముంగిట్లోకే వైద్యం
గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదల ముంగిట్లోకే వైద్యం చేరాలని, స్థానికంగానే వారికి వైద్య సేవలు అందాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ.. గ్రామాల్లో ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు.
మరోసారి జీతాలు పెంచుతాం
ఆశ వర్కర్లకు ఒకసారి జీతాలు పెంచామని, మరోసారి కూడా పెంచడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ ప్రకటించా రు. ఆశ వర్కర్లను విలేజ్ హెల్త్ అసిస్టెంట్లుగా గుర్తిస్తామని, సెకండ్ ఏఎన్‌ఎం జీతాలు కూడా పెంచుతామని తెలిపారు.
ప్రభుత్వాస్పత్రులకే కేసీఆర్ కిట్స్
కేసీఆర్ కిట్స్ పథకం అద్భుతంగా అమలవుతోందని, పేదలకు ఎంతో మేలు కలుగుతోందని కేసీఆర్ చెప్పారు. అదనపు భారం పడినా సరే వైద్యులు, సిబ్బంది ఓపిగ్గా విధులు నిర్వహిస్తున్నారని, వారికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తామని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కేసీఆర్ కిట్స్ పథకం వర్తింపచేయాలన్న వినతులు వస్తున్నాయని.. కానీ ప్రభుత్వాస్పత్రులను బాగు చేసుకుంటామే తప్ప, ప్రైవేటు ఆస్పత్రులకు ఈ పథకం వర్తింపచేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ప్రజలందరికీ వైద్య పరీక్షలు
అమెరికా వంటి దేశాల్లో ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటారని, రాష్ట్రంలోనూ అలాంటి ఆరోగ్య అవగాహన అలవాటు చేయించాలని సమీక్షలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘అవగాహన ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగిన వారు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలవారు, పేదలు ఏదైనా జబ్బు వచ్చినప్పుడే తప్ప ఆసుపత్రులకు వెళ్లరు. వైద్య పరీక్షలు చేయించుకోరు. దీనివల్ల చాలా వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించలేకపోతున్నారు. వ్యాధి తొలిదశలోనే గుర్తిస్తే నయం చేయడం తేలిక అవుతుంది. బోదకాలు కూడా అలాంటిదే. ఇకపై అలా జరగడానికి వీల్లేదు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే వైద్య పరీక్షలు చేయిస్తుంది. వ్యాధులేమైనా ఉంటే ప్రభుత్వపరంగానే చికిత్స, మందులు అందించే ఏర్పాట్లు చేస్తాం. ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదు..’’అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రులు మెరుగయ్యాయని, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ చర్యలను ప్రశంసించిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment