డిచ్‌పల్లి: సామాజిక పింఛన్ లబ్ధిదారుల జాబి తాలో భారీగా కోతలు పడ్డాయి. గతం కన్నా 61,479 పింఛన్లు తగ్గిపోయాయి. ఇందులో అర్హులు కూడా ఉండటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన మార్గదర్శకాల మేరకే తాము లబ్ధిదారులను ఎంపిక చేశామని అధికారులు పేర్కొం టున్నారు. అర్హులందరికీ ఆసరా పింఛన్లు, ఆహార భద్రత కార్డులు ఇస్తామని, ఎవరూ అందోళన చెందవద్దని సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో మొత్తం 2,58,713 మందికి పింఛన్లు అందజేశారు.
వీరిలో 1,52,563 మంది వృద్ధులు, 74,61 2 మంది వితంతువులు, 29,634 మంది వికలాంగులు, 1,143 మంది చేనేత కార్మికులు, 761 మంది గీత కార్మికులు ఉన్నారు. వీరందరికీ రూ. 6,06,32,800 అందజేశారు. అధికారులు ఈ నెల మొదటివారంలో విడుదల చేసిన పింఛను జాబితాలో మొత్తం 1,97,234 మంది లబ్ధిదారులున్నారు. వీరందరి కోసం రెండు నెలలకు కలిపి రూ. 44 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ, గతంలో కన్నా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. కొత్త జాబితా ప్రకారం వృద్ధులు 91,127 మంది, వితంతువులు 83,924 మంది, వికలా ంగులు 20,753 మంది, చేనేత కార్మికులు 605 మంది, గీత కార్మికులు 825 మంది అర్హత పొందారు.
పండుటాకులు తగ్గి.. వితంతువులు పెరిగి
గతంలో 60 ఏళ్లు దాటినవారికి వృద్ధాప్య పింఛన్లు ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వయస్సును 65 సంవత్సరాలకు పెంచడంతో ఏకంగా 61,436 వృద్ధా ప్య పింఛన్లు తగ్గిపోయాయి. వితంతువుల సంఖ్య మాత్రం మరో 9,321 పెరిగి 83,924కు చేరింది. గతంలో 29,634 మంది వికలాంగులకు పింఛన్లు అందగా, కొత్త జా బితాలో వారి సంఖ్య 8,881 తగ్గి 20,753కు పడిపోయింది. గతంలో 1,143 ఉన్న చే నేత కార్మికుల పింఛన్లు ఈసారి 605 కు తగ్గితే, 761 ఉన్న గీత కార్మికుల సంఖ్య ఈ సారి 825కు చేరింది. తొలగింపునకు గురయినవారిలో అనర్హులు ఎక్కువ మందే ఉన్నారు. అర్హుల పేర్లూ కొత్త జాబితాలో గల్లంతయ్యాయి.
దీంతో వారంతా ఆందోళన చెందుతూ గ్రామాలలో నిరసనలు, ధర్నాలకు దిగుతున్నారు. పింఛన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈ పరిస్థితి తప్పడం లేదు. పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారుల నిలదీతలు సర్వ సాధారణమైపోయాయి. శనివారం జక్రాన్‌పల్లి మండలంలో నిజామాబాద్ ఏంపీ కల్వకుంట్ల కవిత వాహనాన్ని సైతం అ డ్డగించి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిరసన తెలిపారు. అర్హులు ఎలాంటి అందోళన చెందవద్దని, మరోసారి దరఖాస్తు చేసుకుంటే, పరిశీలన జరిపి పింఛను వచ్చేలా చూస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు వారికి నచ్చజెబుతున్నారు.
దరఖాస్తుల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు, సదరం సర్టిఫికెట్ల వివరాలు, ఆధార్ కార్డు నంబరు తప్పుగా నమోదు చేయడం తదితర సమస్యలతో కొందరు లబ్ధిదారుల పేర్లు జాబితాలో రాకుండా పోయాయని అధికారులు చెబుతున్నారు. త్వ రలో పింఛను లబ్ధిదారులకు సంబంధించి రెండో జాబితా వస్తుందని, అందులో జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల మంది పేర్లు ఉండే అవకాశాలున్నాయంటున్నారు.
లబ్ధిదారులు తగ్గారు
Published Mon, Dec 15 2014 2:21 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement
Advertisement