నేనున్నానని.. | KCR Bastis trip in warngal | Sakshi
Sakshi News home page

నేనున్నానని..

Published Fri, Jan 9 2015 1:09 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

నేనున్నానని.. - Sakshi

నేనున్నానని..

బస్తీల్లో పర్యటించిన సీఎం కేసీఆర్  2.50 గంటలు జనంతో మమేకం..
ప్రజలతో నేరుగా మాటామంతీ  కష్టాలు విని చలించిన ముఖ్యమంత్రి
ప్రజలకు హామీలు.. అధికారులకు వార్నింగ్‌లు..


హన్మకొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మురికివాడల్లో పర్యటించారు. లక్ష్మీపురంలో సాయంత్రం 5:05 గంటలకు మొదలైన సీఎం కేసీఆర్ పర్యటన రాత్రి 7:45 గంటలకు గిరిప్రసాద్‌నగర్‌లో ముగిసింది. దాదాపు 2.50 గంటలు ప్రజల మధ్య గడిపారు. కేసీఆర్ బస్తీవాసులను సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా తమ ఇళ్లకు రావడంతో ఆసరా పింఛన్‌రాని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మురికివాడల్లో పేదల దుస్థితిని చూసి చలించారు. అధికారులను మందలిస్తూ.. రేపటిలోగా సమస్యలు పరిష్కారం కా వాలని ఆదేశించారు. పరిష్కారం కాకుంటే మరో రోజు వరంగల్‌లోనే ఉంటానంటూ హుకుం జారీ చేశారు. జేసీ, ఆర్డీవో, అధికార యంత్రాంగం అంతా ప్రజల ఇళ్లకు వద్దకు వెళ్లి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. అవసరమైతే నలుగురు తహసీల్దార్లను అదనంగా నియమిస్తామని చెప్పారు. దళితులు, దళిత క్రైస్తవులు, సర్దార్జీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

బస్తీ ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి..

లక్ష్మీపురంలోని పేదలతో మాట్లాడిన తర్వాత ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘లక్ష్మీపురంలో యాభై గజాల దూరం నడిచానో లేదో పదిహేను పదహారు మంది వచ్చి పింఛన్లు రావట్లేదంటూ చెప్పారు. ఈ బస్తీలో ఒక్క మనిషి పట్టేంత ఇరుకు సందులు ఉన్నాయి. కింద పడితే కాలు విరిగే మురికి కాల్వలు ఉన్నాయి. దర్వాజ మీద ఓ కర్ర పెట్టి దానిపైన కప్పు వేసి అందులో ఉంటున్నారు. ఓ ఇంటికి పోతే.. నా మీదే కూలుతుందేమోనని భయపడ్డాను. బస్తీల్లో ఉండే ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా ఇళ్లు నిర్మించి ఇస్తా. ఈ వాడలో 90 శాతం మంది దళితులు ఉన్నారు. వీరితోపాటు మైనార్టీలు, బీసీలు ఉన్నారు. మీ అందరికీ రెండు బెడ్‌రూంలు, ఒక హాలు, ఒక కిచెన్, రెండు టాయిలెట్లు ఉండే ఇళ్లు నిర్మిస్తా. శుక్రవారం ఉదయం మీ అందరి ఇళ్ల దగ్గరికి అధికారులు వస్తరు. ఇంటి ఎదుట యజమానిని నిలబెట్ట్టి ఫొటో తీస్తరు. ఆ తర్వాత కమిటీ వేసి.. ఇళ్లు కట్టించి.. మీ పేరు మీద రిజిష్ట్రేషన్ చేసి ఇస్తరు. దీనికి మీరు నాలుగు నెలలు ఓపిక పట్టాలి. మీ ఇళ్లు, జాగ ఖాళీ చేసి వేరే దగ్గర ఉండాలి.

మిగిలిన మురికవాడల ప్రజలు కంగారు పడొద్దు. అందరి ఇళ్లకు వస్తా. అందరి పరిస్థితిని తెలుసుకుంటా’ అని చెప్పారు. శుక్రవారం సాయంత్రం వరకు జిల్లాలోనే ఉంటా. నేను చెప్పిన పని కాకుంటే రాత్రి కూడా ఈడనే ఉంటా. మాట ఇచ్చినంటే నెరవేర్చాలే.. లేదంటే తలతెగి కిందపడాలే’ అని భరోసా ఇచ్చారు. పది రోజుల్లో వచ్చి ఈ కాలనీ శంకుస్థాపన చేస్తా.. నాలుగైదు నెలల్లో వచ్చి ప్రారంభిస్తాని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ిసీఎం తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆరూరి రమేష్, శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ గంగాధర కిషన్, డీఐజి మల్లారెడ్డి, జేసీ పౌసమిబసు, కమషనర్ సువర్ణపండాదాస్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్, టీఆర్‌ఎస్ నేతలు కొండా మురళీధర్‌రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సహోదర్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, నాగూర్ల వెంకటేశ్వర్లు ఉన్నారు.
 
సమస్యలు తెలుసుకుంటూ..

సీఎం లక్ష్మీపురం, శాకరాసికుంట, గిరిప్రసాద్‌నగర్‌లలో పర్యటిస్తున్నప్పుడు ఎల్.భాగ్యమ్మ అనే మహిళ మంగళహారతితో స్వాగతం పలికి, నుదుట తిలకం దిద్దింది. అనంతరం లక్ష్మీపురం కాలనీలో అంబి కొమురమ్మ ఇంటికి వెళ్లారు. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నావమ్మా? ఏందీ నీ సమస్య? అని సీఎం అడిగారు. కొమురమ్మ మాట్లాడుతూ నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ వృద్ధాప్య పింఛను వస్తలేదు. నువ్వేం భయపడకు. నేనున్నాను. నీకు పింఛన్ వస్తది అన్నా రు. ఆ తర్వాత సీఎం లచ్చమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె భర్త సమ్ములు మాట్లాడుతూ.. శారీరక వికలాంగుడైనా నాకు పింఛను రాలేందంటూ చెప్పాడు. అక్కడి నుంచి బయటకు రాగానే అంబిసారమ్మ, అంబి సరోజన, గుండెకారి రాజలింగంలు సారూ.. మాకు పింఛను రావట్లేందంటూ సీఎంకు విన్నవించారు. తన భర్త చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ ప త్రం సీఎంకు చూపెడుతూ.. ఇప్పటికీ 3 సార్లు దరఖా స్తు చేసుకున్నా నాకు ఫించను రావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో సీఎం ‘వీరికి పింఛన్లు ఎం దుకు రావడం లేదు’ అంటూ అక్కడే ఉన్న వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ జి.సువర్ణపండాదాస్‌ను ప్రశ్నించారు. కమిషనర్ వివరాల కోసం తన చేతిలో ఉన్న టాబ్‌లో వెతికి.. ‘దరఖాస్తు ఇర్రెగ్యులర్‌గా ఉం ది’ అందుకే పింఛను రాలేదంటూ సమాధానం ఇచ్చారు. ‘మొగుడు సచ్చిపోయిండని సర్టిఫికెట్ చూపెడతాంటే.. ఆన్‌లైన్.. అప్‌లోడ్.. అంటూ ప్రజలను చంపుతున్నారు’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుట కనబడుతున్న మనుషులను చూసి పెన్షన్ ఇయ్యొచ్చు కదా? ఆ టాబ్‌లెందుకు.. పీకడానికా అంటూ కమిషనర్‌ను మందలించారు.

ఎందుకీ అప్‌లోడు.. డౌన్‌లోడులు

పింఛన్ రావడం లేదని ఫిర్యాదులు రావడంతో.. ‘ప్రజలు సఫర్ అయితల్లు.. ఏం కలెక్టర్ ఇదేం పద్ధతి’ అంటూ కిషన్‌ను సీఎం ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో జరిగిన పొరపాట్ల వల్ల జాప్యం అవుతోందని ఈ విషయాన్ని సెర్ఫ్ సీఈవోకు తెలిపానని కలెక్టర్ చెప్పారు. వెంటనే సీఈవోతో సీఎం ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘ఎన్ని సార్లు చెప్పాలయ్యా నీకు. అప్.. డౌన్‌లోడు ఎవరిక్కావాలి. అకౌంట్స్ సరిగ్గా ఉన్నాయా? లేవా? నిధులు రాకడపోకడకే ఇవి పనిచేస్తరుు. బుక్కులు పెట్టి పింఛన్లు ఇయ్యమన్న. వందసార్లు చెప్పినా.. రేపు నువ్వు వరంగల్‌రా.  

కలెక్టరా.. నేనా తేల్చుకుంటా..

శాకరాసికుంటలో సీఎం మాట్లాడుతూ ‘అధికారులు రేపు మీ ఇంటికి వస్తరు. జేసీ ఆధ్వర్యంలో మీ ఇళ్లిళ్లు తిరుగతరు. ఎమ్మెల్యే సురేఖ  ఉంటరు. మీకు రేషన్‌కార్డులు, పింఛన్లు, జాగ సమస్యలు ఏమున్నా ఎల్లుం డిలోపు పరిష్కారం చూపిస్తరు. లేకపోతే కలెక్టరా? నే నా తేల్చుకుంటా. ఈ స్టేజీ తీయ్యొద్దు’అని అన్నారు.

ఆ రోడ్డేంది కమిషనర్..

లక్ష్మీపురం దారిలో కబేలా ఎదుట  రోడ్డుపై సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు గుంతలో మురుగునీరు, బురద ఎగిసి సీఎం వాహనంపై పడింది. లక్ష్మీపురంలో సీఎం కాన్వాయ్ దిగగానే ‘కమిషనర్ ఎదురుగా వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి.. నేను మున్సిపల్ కమిషనర్ అంటూ పరిచయం చేసుకున్నారు.. సీఎం స్పందిస్తూ ‘ఆ రోడ్డు ఏంది, ఆ గుంతలేంది? ఆ నీళ్లేంది? ఏం పని చేస్తున్నావ్. అది కూడా చూసుకోవా’ అంటూ మందలించారు. పక్కనే ఉన్న తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ కల్పించుకుని ‘ఆయన పనితీరు అలాగే ఉంటుంది’ అని అన్నారు.
 
‘పింఛన్లు, ఇళ్ల జాగలు, కల్యాణలక్ష్మి సాయం అన్ని ఇస్తా.. మీరు చెప్పిన సమస్యలు తీర్చిన తర్వాతే వరంగల్ విడిచి వెళ్తా.. రేపు సమస్యలు పరిష్కారమవుతారుు. కాకుంటే నేనో.. అధికారులో తేల్చుకుంటా..’
  - ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement