lakshmipuram
-
Palasa: లక్ష్మీపురంలో ప్రతి ఇంటిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి
పలాస: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం.. పలాస మండలంలోని ఓ చిన్న గ్రామం. జాతీయ రహదారికి అతి సమీపంలోని పచ్చని పొలాల మధ్య కొలువుదీరి ఉంటుందీ ఊరు. 356 గడపలు ఉన్న ఈ పల్లెకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి ఇంటిలోనూ ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపిస్తాడు. అందులో అధిక శాతం మంది ఉపాధ్యాయులే. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా ఈ ఊరి వారు చక్కగా రాణించారు. ఈ గ్రామానికి చెందిన వ్యక్తులు ఒకసారి ఎమ్మెల్యేగా, సమితి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఊరిలో 90 శాతం మంది అక్షరాస్యులు కావడం గమనార్హం. కేవలం అక్షరాస్యులుగానే కాకుండా చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉన్నత ఉద్యోగాలు సాధించడం విశేషం. ఒకరికి మించి ఒకరు ఉపాధ్యాయ రంగంలో అత్యధిక శాతం ఉద్యోగులు కాగా గ్రూప్ వన్ అధికారులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, ఎన్ఆర్ఐలు, ఆర్మీలోనూ ఈ ఊరి వారు ఉద్యోగులుగా ఉన్నారు. ఆర్డీవో స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఈ గ్రామంలో మొత్తం 1213 మంది జనాభా ఉన్నారు. 356 ఇళ్లు ఉన్నాయి. గ్రామంలో అన్నీ పక్కా భవనాలతో అన్ని వీధుల్లో కూడా సిమెంటు రోడ్లతో ఊరిని చూడచక్కగా తీర్చిదిద్దుకున్నారు. గతమెంతో ఘనం.. ఈ గ్రామానికి సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. పలాస మండలం తర్లాకోట జమిందారీ పాలనలో ఈ గ్రామంలోనే మస్తాదారు ఉండేవాడు. భూమి శిస్తు వసూలు చేసి జమిందారుకు ఇచ్చేవాడు. ఇక్కడ మస్తాదారు ఉండటంతో తరచుగా తర్లాకోట జమీందారు వచ్చి వెళ్తుండేవాడని గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్లు చెబుతున్నారు. అలా రాకపోకలు ఎక్కువగా సాగడంతో ఈ గ్రామంలోనే జమీందారు క్యాంపు కోర్టు కూడా నిర్వహించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామంలో ముందుగా సవర లక్ష్మయ్య అనే గిరిజన కుటుంబం ఉండేదని, అతని పేరు వల్లనే లక్ష్మీపురం అని నామకరణం చెందిందని ఇక్కడి వారు చెబుతుంటారు. ఈ గ్రామంలోని దువ్వాడ వంశానికి చెందిన ఒక ధనిక రైతు కుటుంబంతో తర్లాకోట జమీందారుకు మిత్తరికం కూడా ఉండేదని, తర్లాకోట జమీన్లో లక్ష్మీపురం గ్రామానికి ఈ విధంగా ఒక ప్రత్యేకత ఉండేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. మా ఇంటిలో ఇద్దరం ఉద్యోగస్తులమే మాకు వ్యవసాయ భూములు ఉన్నాయి. సుమారు 10 ఎకరా లు ఉంది. అయినా మా కుటుంబంలో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. నేను ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేశాను. మా అన్నయ్య సత్యనారాయణ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నేనే స్వయంగా వ్యవసాయం చేస్తున్నాను. – బమ్మిడి వాసుదేవరావు, రిటైర్డ్ టీచర్, లక్ష్మీపురం,పలాస మండలం ఉపాధ్యాయుల ఊరు మా గ్రామంలో అత్యధిక స్థాయిలో ఉపాధ్యాయులు ఉన్నారు. నేను కూడా ఉపాధ్యాయ కొలువు సంపాదించేవాడిని. ముందుగా వేరే రంగంలో స్థిర పడిపోవడం వల్ల అటువైపు వెళ్ల లేకపోయాను. ఇప్పుడు జనరేషన్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలవైపే మక్కువ చూపుతున్నారు. పోటీ పడి చదువుతున్నారు. వ్యవసాయ భూములు ఉన్నా ఉద్యోగాలే చేస్తున్నారు. మా గ్రామంలో ఇంటికి ఒకరు, ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు. – అల్లు రమణ, ఎంఏబీపీఈడీ, లక్ష్మీపురం, పలాస మండలం స్వయం కృషితోనే ఉద్యోగాలు మా గ్రామంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారంటే దానికి కారణం స్వయం కృషి, పట్టుదల, పోటీ తత్వం ప్రధాన కారణం. వివిధ ప్రభుత్వ శాఖల్లోని అన్ని రంగాల్లో కూడా మా గ్రామానికి చెందిన వారు ఉన్నారు. నేను కూడా ముందుగా గ్రూప్ వన్‌కి ఎంపికయ్యాను. అడిషనల్ ఎస్పీగా విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్నాను. క్రమ శిక్షణతో విద్యను అభ్యసిస్తే ప్రభుత్వ ఉద్యోగం చాలా సులభంగా వస్తుందని మా గ్రామమే దానికి ఒక ఉదాహరణ. – బమ్మిడి శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్) విశాఖ -
అనుకోని ఆతిథ్యం
తిరిగే కాలిని తిరగనియ్యకుండా చేసింది కరోనా వచ్చి! ఫ్రాన్స్‌లోని తులూస్ నగరంలో ఉంటాడు పొల్లారెజ్ ప్యాట్రీస్ (40). మోటార్ మెకానిక్ ఆయన. భార్య విర్జినీ, కూతుళ్లు ఒఫేలీ, లోలా, కొడుకు టామ్.. ఇదీ అతడి ఫ్యామిలీ. అయితే ప్రస్తుతం వాళ్లు ఫ్రాన్స్‌లో లేరు. యు.పి. మహారాజ్‌గంజ్‌లోని లక్ష్మీపురంలో ఉన్నారు! సొంత వెహికల్లో ప్రపంచ పర్యటనకు బయల్దేరిన ఈ కుటుంబం.. టూర్ పూర్తి కాకుండానే ఇండియాలో ఉండిపోవలసి వచ్చింది. లాక్డౌన్లో చిక్కుకుపోయిన ఈ కుటుంబాన్ని లక్ష్మీపురం గ్రామస్తులు మూడువారాలుగా ఆదరిస్తున్నారు. ఆత్మీయ ఆతిథ్యం ఇస్తున్నారు. కావలసినవన్నీ సమకూరుస్తున్నారు. గత డిసెంబర్లో వీరి యాత్ర మొదలైంది. ఫిబ్రవరిలో పాకిస్తాన్ నుంచి వాఘా బోర్డర్ గుండా ఇండియాకు వచ్చారు. ఇక్కడ కొన్ని నగరాలు పర్యటించి, నేపాల్ వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా.. లాక్‌డౌన్‌తో వీళ్ల ప్రయాణానికి బ్రేక్ పడింది. -
షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో అపశ్రుతి
-
చెదరని స్మృతి
► గంగ అంటే ప్రీతి ►పెరుమాళ్ అంటే భక్తిభావం ►శివయ్య సన్నిధిలో రాహుకేతు పూజలు ►ఆమె పూర్వీకులది కుప్పం సమీపంలోని లక్ష్మీపురం నటిగా రెండు దశాబ్దాలు.. తమిళనాడు రాజకీయాల్లో మూడు దశాబ్దాలు ఏలి.. చరిత్రలో నిలిచిన జయలలితకు జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. ఆమెకు పెరుమాళ్ అంటే మెండైన భక్తి. తెలుగు ప్రజలన్నా అంతులేని అభిమానం. అలాంటి అభిమాన ధ్రువతార ఇక లేరని తెలియడంతో జిల్లాలోని ఆమె అభిమానులు, ప్రజల్లో విషాద ఛాయలు అలుముకున్నారుు. ఆమె మరణించిన సందర్భంగా జిల్లాతో ఆమెకున్న అనుబంధం మననం చేసుకున్నారు. విషాద సాగరంలో మునిగిపోయారు. సాక్షి, తిరుమల:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరన్న వార్త జిల్లావాసుల్ని తీవ్రంగా కలచివేసింది. జిల్లా అంతటా విషాద ఛాయలు అలుముకున్నారుు. ఆమె అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. సినీనటీగా, అన్నాడీఎంకే అధినేత్రిగా రాజకీయాల్లో ఎదురులేని శక్తిగా ఎదిగిన ‘అమ్మ’తో తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న చిత్తూరు జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ‘అమ్మ’ పూర్వీకులది కుప్పం సమీపంలోని లక్ష్మీపురం జయలలిత పూర్వీకులది కుప్పం నియోగజవర్గం సమీపంలోని లక్ష్మీపురం. ఆమె ముత్తాత ఎల్ఎస్ రాజు సీనియర్ అడ్వకేట్‌గా పనిచేశారు. జనంలో ఆయనకు మంచి పేరుంది. లక్ష్మీపురం గ్రామంలో భారీ భవంతి ఉండేది. జయలలిత తల్లి సంధ్యతో కలసి జయలలిత బాల్యంలో పలుమార్లు లక్ష్మీపురం సందర్శించారట. ఆ జ్ఞాపకాలను స్థానికులు నేడు కూడా గుర్తు చేసుకుంటుంటారు. పూర్వీకులు నిర్మించిన భవంతి స్థానిక వరదరాజస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. పాత జ్ఞాపకాలకు చిహ్నంగా ఉన్న ఆ భవంతి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. పెరుమాళ్ దర్శనం కోసం పలుసార్లు తిరుమలకు.. పెరుమాళ్ (శ్రీవేంకటేశ్వర స్వామి) అంటే జయలలితకు ఎనలేని భక్తి భావం. తాను సినీరంగంలో ఉన్నప్పుడు, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలోనూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే, ఆలయ అర్చకులతోనూ, పెదజియ్యర్లతోనూ ఆప్యాయంగా పలుకరించేవారు. ఇటు తమిళం, ఆంగ్లభాషలతోపాటు తెలుగుభాషను అనర్గళంగా, మృదువుగా మాట్లాడుతూ చిరునవ్వులు చిందించేవారు. మే 24వ తేదీ 2010లో చివరిసారిగా తిరుమల వచ్చారు. శివయ్య సన్నిధిలో రాహుకేతు పూజలు రాహుకేతు పూజలకు ప్రసిద్ధి పొందిన శ్రీకాళహస్తిక్షేత్రాన్ని పలుసార్లు జయలలిత సందర్శించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం రాహుకేతు పూజలు చేసి, వాయులింగేశ్వరుడిని దర్శించుకుని వెళ్లేవారు. నాటి జ్ఞాపకాలను నేడు అర్చకులు, ఆలయ సిబ్బంది గుర్తు చేసుకోవటం గమనార్హం. గంగతో అమ్మకు మరింత అభిమానం చెన్నై మహా నగరంలోని జనం గొంతు తడిపిన తెలుగుగంగ అంటే జయలలితకు ఎనలేని ప్రీతి. ఈ జలాలు చిత్తూరు జిల్లా మీదుగానే తమిళనాడులోకి ప్రవేశిస్తారుు. గంగ సరఫరాగా ఒప్పందాలు, తాగునీటి అవసరాలపై ఆమె ముఖ్యమంత్రిగాను, ప్రతిపక్ష హోదాలోనూ ఆయా కాలాల్లో రాష్ట్ర ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతూ పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో తొలి నుంచీ మరింత సాన్నిహిత్యంగా మెలిగేవారు -
యువకుడి దుర్మరణం
ఏలూరు అర్బన్ : బైకుపై స్నేహితునితో కలిసి ఇంటికి వెళ్తున్న యువకుడు ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళం రాము (26) అనే యువకుడు స్నేహితుడు శివాజీతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి బైక్‌పై ఏలూరు నుంచి లక్ష్మీపురం బయలుదేరాడు. మార్గమధ్యలో తంగెళ్లమూడి ప్రాంతంలోని జేఎంజే స్కూల్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో రాము అక్కడికక్కడే మృతి చెందగా శివాజీ గాయాలపాలయ్యాడు. ఏలూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని, మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శనివారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
లారీఢీకొని సైక్లిస్టు దుర్మరణం
జీలుగుమిల్లి : మండలంలోని లక్ష్మీపురం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన సేతుకూరి రామారావు(55) వ్యవసాయ పనులు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావు అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఇరపం భాస్కరరావు తెలిపారు. మృతుడు రామారావు భార్య గతంలోనే మృతి చెందగా.. వ్యవాయ కూలీ పనులు చేసుకుంటూ కుమారుడి వద్ద ఉంటున్నాడు. -
బాలిక గర్భం విలువ రూ.4 లక్షలు?
గ్రామ పెద్దల సమక్షంలో రాజీ చోడవరం టౌన్: ఒక బాలిక గర్భం తీయించుకోడానికి గ్రామ పెద్దలు రూ. 4 లక్షలు విలువ కట్టిన సంఘటన మండలంలోని లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని బీసీ కులానికి చెందిన బాలిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమెతో అదే గ్రామానికి చెందిన ఓసీ కులానికి చెందిన తాపీ మేస్త్రీ కొంత కాలంగా ప్రేమ వ్యవహారం సాగించి ఆమె గర్భం దాల్చేందుకు కారకుడయ్యాడు. తాపీ మేస్త్రీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలిక నెల రోజులుగా పాఠశాలకు వెళ్లక పోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించి బాధిత బాలికకు రూ. 3 లక్షలు, గ్రామానికి రూ.50 వేలు, ఇతర అన్ని శాఖలకు రూ.25వేలు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. బాలికకు శనివారం మాడుగులలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిల్లో గర్భం కూడా తీయించినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
అయ్యో కొడుకా...
పాఠశాల బస్సు కింద దూరి ఎంపీటీసీ సభ్యుడి కుమారుడు మృతి కన్నీరుమున్నీరు అయిన తల్లిదండ్రులు..కుటుంబ సభ్యులు మందస మండలం లక్ష్మీపురంలో విషాదం మందస: మందస మండలం బేతాళపురం పంచాయతీ లక్ష్మీపురంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. బేతాళపురంఎంపీటీసీ సభ్యుడు కారి ఈశ్వరరావు రెండో కుమారుడు బస్సు కింద దూరి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు..గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వివరాలు.. లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు కారి ఈశ్వరరావు, అనూషలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దీక్షిత్ కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతున్నాడు. రెండో కుమారుడు రేవంత్. వయసు రెండున్నరేళ్లు. రోజులాగే తల్లి అనూష గురువారం ఉదయం పెద్ద కుమారుడు దీక్షిత్‌ని ఇంటి వద్ద పాఠశాల బస్సు ఎక్కించింది. అక్కడే ఉన్న చిన్న కుమారుడు రేవంత్ నడుచుకుంటూ బస్సు కిందకు వెళ్లిపోయాడు. ఇది గమనించని బస్సు డ్రైవర్ బస్సు ను లాగించాడు. ఇంతలో బస్సు కిం ద నుంచి పెద్దాగా ఏడుపు వినిపించింది. అంతా గట్టిగా అరవడంతో బస్సును తక్షణమే ఆపేశాడు. అనూష ఇంటి వద్ద రేవంత్‌ను చూడగా లేకపోవడంతో బస్సు కిందకు చూసింది. రేవంత్ బస్సుకింద తలకు గాయం అయి ఉండడం గమనించి కేక పెట్టింది. బాలుడిని బయటకు తీసి చూడగా చెవి, ముక్కు నుంచి రక్తం స్రవించడంతో వెంటనే కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రేవంత్ అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. చిన్నారి మృతితో అతని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. బంధువులు.. గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన డీఎస్పీ దేవ ప్రసాద్, ఎస్ఐ వి.రవివర్మ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేశారు కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే: ఎంపీటీసీ సభ్యుడు ఈశ్వరరావు కుమారుడు మృతి వార్త తెలిసిన పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ హుటాహుటిన లక్ష్మీపురం చేరుకున్నారు. చనిపోయిన చిన్నారి వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు కన్నీరు పెట్టుకున్నారు. ఈశ్వరరావు ఇంటికి వచ్చినపుటు తన వద్దకు వచ్చి చేతులు పట్టుకుని ఆడుకునేవాడని గుర్తు చేసుకున్నారు. -
వివాహ వేడుకకు వెళుతూ..
ద్వారకాతిరుమల : పెళ్లిబృందం ప్రయాణిస్తున్న ట్రక్ ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది గాయాలపాల య్యారు. వీరిలో 9 మందికి తీవ్ర గాయూలు కాగా మి గిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురం వద్ద గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. దెందులూరు మండలం కొవ్వలికి చెందిన పెళ్లి బృందం సభ్యులు సుమారు 20 మంది గురువారం రాత్రి ఆటోలో బయలుదేరి ద్వారకాతిరుమల వెళ్తున్నారు. మార్గమధ్యలో సంఘటనా స్థలం వద్ద వీరి ఆటో ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న సుద్దలోడు లారీని వేగంగా ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయూణిస్తున్న డ్రైవర్‌తో సహా 14 మందికి గాయూలయ్యూరుు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపు మార్జిన్లోకి తిప్పడంతో ఘెర ప్రమాదం తప్పింది. రెండు 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొవ్వలికి చెందిన బళ్ల సత్యన్నారాయణకు కుడి కాలు, వడిగిన అనిల్‌కు ఎడమ కాలు విరిగింది. కె.ప్రసాద్, బొప్పన గణేష్, డి.గణేష్, డి.గంగరాజు, దెందులూరుకు చెందిన కె.అశోక్, వి.పవన్ మన్మధరావు, కేఎన్ పురానికి చెందిన బి.వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయూలయ్యూరుు. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని ఏలూరు వీఆర్ ఎస్సై కర్రి సతీష్‌కుమార్, స్థానిక పోలీస్ సిబ్బంది పరిశీలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
నేనున్నానని..
బస్తీల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ 2.50 గంటలు జనంతో మమేకం.. ప్రజలతో నేరుగా మాటామంతీ కష్టాలు విని చలించిన ముఖ్యమంత్రి ప్రజలకు హామీలు.. అధికారులకు వార్నింగ్‌లు.. హన్మకొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మురికివాడల్లో పర్యటించారు. లక్ష్మీపురంలో సాయంత్రం 5:05 గంటలకు మొదలైన సీఎం కేసీఆర్ పర్యటన రాత్రి 7:45 గంటలకు గిరిప్రసాద్‌నగర్‌లో ముగిసింది. దాదాపు 2.50 గంటలు ప్రజల మధ్య గడిపారు. కేసీఆర్ బస్తీవాసులను సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా తమ ఇళ్లకు రావడంతో ఆసరా పింఛన్‌రాని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మురికివాడల్లో పేదల దుస్థితిని చూసి చలించారు. అధికారులను మందలిస్తూ.. రేపటిలోగా సమస్యలు పరిష్కారం కా వాలని ఆదేశించారు. పరిష్కారం కాకుంటే మరో రోజు వరంగల్‌లోనే ఉంటానంటూ హుకుం జారీ చేశారు. జేసీ, ఆర్డీవో, అధికార యంత్రాంగం అంతా ప్రజల ఇళ్లకు వద్దకు వెళ్లి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. అవసరమైతే నలుగురు తహసీల్దార్లను అదనంగా నియమిస్తామని చెప్పారు. దళితులు, దళిత క్రైస్తవులు, సర్దార్జీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బస్తీ ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి.. లక్ష్మీపురంలోని పేదలతో మాట్లాడిన తర్వాత ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘లక్ష్మీపురంలో యాభై గజాల దూరం నడిచానో లేదో పదిహేను పదహారు మంది వచ్చి పింఛన్లు రావట్లేదంటూ చెప్పారు. ఈ బస్తీలో ఒక్క మనిషి పట్టేంత ఇరుకు సందులు ఉన్నాయి. కింద పడితే కాలు విరిగే మురికి కాల్వలు ఉన్నాయి. దర్వాజ మీద ఓ కర్ర పెట్టి దానిపైన కప్పు వేసి అందులో ఉంటున్నారు. ఓ ఇంటికి పోతే.. నా మీదే కూలుతుందేమోనని భయపడ్డాను. బస్తీల్లో ఉండే ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా ఇళ్లు నిర్మించి ఇస్తా. ఈ వాడలో 90 శాతం మంది దళితులు ఉన్నారు. వీరితోపాటు మైనార్టీలు, బీసీలు ఉన్నారు. మీ అందరికీ రెండు బెడ్రూంలు, ఒక హాలు, ఒక కిచెన్, రెండు టాయిలెట్లు ఉండే ఇళ్లు నిర్మిస్తా. శుక్రవారం ఉదయం మీ అందరి ఇళ్ల దగ్గరికి అధికారులు వస్తరు. ఇంటి ఎదుట యజమానిని నిలబెట్ట్టి ఫొటో తీస్తరు. ఆ తర్వాత కమిటీ వేసి.. ఇళ్లు కట్టించి.. మీ పేరు మీద రిజిష్ట్రేషన్ చేసి ఇస్తరు. దీనికి మీరు నాలుగు నెలలు ఓపిక పట్టాలి. మీ ఇళ్లు, జాగ ఖాళీ చేసి వేరే దగ్గర ఉండాలి. మిగిలిన మురికవాడల ప్రజలు కంగారు పడొద్దు. అందరి ఇళ్లకు వస్తా. అందరి పరిస్థితిని తెలుసుకుంటా’ అని చెప్పారు. శుక్రవారం సాయంత్రం వరకు జిల్లాలోనే ఉంటా. నేను చెప్పిన పని కాకుంటే రాత్రి కూడా ఈడనే ఉంటా. మాట ఇచ్చినంటే నెరవేర్చాలే.. లేదంటే తలతెగి కిందపడాలే’ అని భరోసా ఇచ్చారు. పది రోజుల్లో వచ్చి ఈ కాలనీ శంకుస్థాపన చేస్తా.. నాలుగైదు నెలల్లో వచ్చి ప్రారంభిస్తాని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ిసీఎం తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆరూరి రమేష్, శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ గంగాధర కిషన్, డీఐజి మల్లారెడ్డి, జేసీ పౌసమిబసు, కమషనర్ సువర్ణపండాదాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్, టీఆర్ఎస్ నేతలు కొండా మురళీధర్‌రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సహోదర్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, నాగూర్ల వెంకటేశ్వర్లు ఉన్నారు. సమస్యలు తెలుసుకుంటూ.. సీఎం లక్ష్మీపురం, శాకరాసికుంట, గిరిప్రసాద్నగర్లలో పర్యటిస్తున్నప్పుడు ఎల్.భాగ్యమ్మ అనే మహిళ మంగళహారతితో స్వాగతం పలికి, నుదుట తిలకం దిద్దింది. అనంతరం లక్ష్మీపురం కాలనీలో అంబి కొమురమ్మ ఇంటికి వెళ్లారు. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నావమ్మా? ఏందీ నీ సమస్య? అని సీఎం అడిగారు. కొమురమ్మ మాట్లాడుతూ నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ వృద్ధాప్య పింఛను వస్తలేదు. నువ్వేం భయపడకు. నేనున్నాను. నీకు పింఛన్ వస్తది అన్నా రు. ఆ తర్వాత సీఎం లచ్చమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె భర్త సమ్ములు మాట్లాడుతూ.. శారీరక వికలాంగుడైనా నాకు పింఛను రాలేందంటూ చెప్పాడు. అక్కడి నుంచి బయటకు రాగానే అంబిసారమ్మ, అంబి సరోజన, గుండెకారి రాజలింగంలు సారూ.. మాకు పింఛను రావట్లేందంటూ సీఎంకు విన్నవించారు. తన భర్త చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ ప త్రం సీఎంకు చూపెడుతూ.. ఇప్పటికీ 3 సార్లు దరఖా స్తు చేసుకున్నా నాకు ఫించను రావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో సీఎం ‘వీరికి పింఛన్లు ఎం దుకు రావడం లేదు’ అంటూ అక్కడే ఉన్న వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ జి.సువర్ణపండాదాస్ను ప్రశ్నించారు. కమిషనర్ వివరాల కోసం తన చేతిలో ఉన్న టాబ్లో వెతికి.. ‘దరఖాస్తు ఇర్రెగ్యులర్గా ఉం ది’ అందుకే పింఛను రాలేదంటూ సమాధానం ఇచ్చారు. ‘మొగుడు సచ్చిపోయిండని సర్టిఫికెట్ చూపెడతాంటే.. ఆన్లైన్.. అప్లోడ్.. అంటూ ప్రజలను చంపుతున్నారు’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుట కనబడుతున్న మనుషులను చూసి పెన్షన్ ఇయ్యొచ్చు కదా? ఆ టాబ్లెందుకు.. పీకడానికా అంటూ కమిషనర్‌ను మందలించారు. ఎందుకీ అప్లోడు.. డౌన్లోడులు పింఛన్ రావడం లేదని ఫిర్యాదులు రావడంతో.. ‘ప్రజలు సఫర్ అయితల్లు.. ఏం కలెక్టర్ ఇదేం పద్ధతి’ అంటూ కిషన్‌ను సీఎం ప్రశ్నించారు. ఆన్లైన్లో జరిగిన పొరపాట్ల వల్ల జాప్యం అవుతోందని ఈ విషయాన్ని సెర్ఫ్ సీఈవోకు తెలిపానని కలెక్టర్ చెప్పారు. వెంటనే సీఈవోతో సీఎం ఫోన్లో మాట్లాడుతూ.. ‘ఎన్ని సార్లు చెప్పాలయ్యా నీకు. అప్.. డౌన్లోడు ఎవరిక్కావాలి. అకౌంట్స్ సరిగ్గా ఉన్నాయా? లేవా? నిధులు రాకడపోకడకే ఇవి పనిచేస్తరుు. బుక్కులు పెట్టి పింఛన్లు ఇయ్యమన్న. వందసార్లు చెప్పినా.. రేపు నువ్వు వరంగల్రా. కలెక్టరా.. నేనా తేల్చుకుంటా.. శాకరాసికుంటలో సీఎం మాట్లాడుతూ ‘అధికారులు రేపు మీ ఇంటికి వస్తరు. జేసీ ఆధ్వర్యంలో మీ ఇళ్లిళ్లు తిరుగతరు. ఎమ్మెల్యే సురేఖ ఉంటరు. మీకు రేషన్‌కార్డులు, పింఛన్లు, జాగ సమస్యలు ఏమున్నా ఎల్లుం డిలోపు పరిష్కారం చూపిస్తరు. లేకపోతే కలెక్టరా? నే నా తేల్చుకుంటా. ఈ స్టేజీ తీయ్యొద్దు’అని అన్నారు. ఆ రోడ్డేంది కమిషనర్.. లక్ష్మీపురం దారిలో కబేలా ఎదుట రోడ్డుపై సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు గుంతలో మురుగునీరు, బురద ఎగిసి సీఎం వాహనంపై పడింది. లక్ష్మీపురంలో సీఎం కాన్వాయ్ దిగగానే ‘కమిషనర్ ఎదురుగా వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి.. నేను మున్సిపల్ కమిషనర్ అంటూ పరిచయం చేసుకున్నారు.. సీఎం స్పందిస్తూ ‘ఆ రోడ్డు ఏంది, ఆ గుంతలేంది? ఆ నీళ్లేంది? ఏం పని చేస్తున్నావ్. అది కూడా చూసుకోవా’ అంటూ మందలించారు. పక్కనే ఉన్న తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ కల్పించుకుని ‘ఆయన పనితీరు అలాగే ఉంటుంది’ అని అన్నారు. ‘పింఛన్లు, ఇళ్ల జాగలు, కల్యాణలక్ష్మి సాయం అన్ని ఇస్తా.. మీరు చెప్పిన సమస్యలు తీర్చిన తర్వాతే వరంగల్ విడిచి వెళ్తా.. రేపు సమస్యలు పరిష్కారమవుతారుు. కాకుంటే నేనో.. అధికారులో తేల్చుకుంటా..’ - ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా -
చితికిపోయిన వలస బతుకులు
ఉన్న ఊళ్లో ఉపాధి కరువై.. బతుకు భారమై.. పొట్ట కూటి కోసం వందల కిలోమీటర్లు దాటి వెళ్లిన వారు.. బతుకుపోరులో సమిథలయ్యారు. చిన్న పిల్లలను కుటుంబ సభ్యుల వద్ద విడిచి వెళ్లి.. మృత్యుకుహరంలో కూరుకుపోయారు. నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకున్న వారి కలలు కల్లలయ్యాయి. పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఆశయం శిథిలాల కింద చిక్కుకుంది. రెండు రోజుల నుంచి ఏమయ్యారో తెలియక.. ఫోన్ మోగితే ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న భయాందోళతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటున్నారు. తమ తల్లి దండ్రుల యోగ క్షేమాలు తెలియక చిన్నారులు బిత్తర చూపులు చూస్తున్నారు. విషాద వీచిక హిరమండలం (లక్ష్మీపురం) : చెన్నై ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న గొట్ట, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన ఆరుగురూ.. నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఉన్న ఊళ్లో ఉపాధి కరువై..నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు వెళ్లి..విగతజీవులైన మీసాల శ్రీను, కుమార్తె భవానీ, కొంగరాపు శ్రీను, భార్య కృష్ణవేణి, సారవకోట మం డలం పాయకవలసకు చెందిన శ్రీను బావమరిది ముద్ద శ్రీను, లక్ష్మీపురానికి చెందిన పెసైక్కి జ్యోతిలది ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. సంక్రాంతి అనంతరం వెళ్లి.. గొట్ట గ్రామానికి చెందిన మీసాల శ్రీను కుటుంబం ఈ ఏడాది సంక్రాంతి అనంతరం చెన్నై వెళ్లింది. పెళ్లీడుకొచ్చిన కుమార్తె కళ్లెదుటే కనిపిస్తుండడంతో..నాలుగు పైసలు వెనకేసుకుందామనుకున్న వారి ఆశలు అడియాసలయ్యారు. భారీ భవంతి కూలడంతో తండ్రీ కూతుళ్లు చిక్కుకున్నారు. శ్రీను భార్య వరలక్ష్మి ఇటీవల గ్రామానికి వచ్చి..శనివారమే చెన్నై బయల్దేరింది. మార్గమధ్యలో ఉండగానే..భర్త, కుమార్తె శిథి లాల కింద ఉండిపోయారన్న విషయం తెలియడంతో..ముందుకెళ్లే ధైర్యం చెయ్యలేక పుట్టెడు దుఃఖంతో విజయవాడ నుంచి వెనుదిరిగింది. కుమారుడు లోకేష్ మాత్రం తండ్రి, చెల్లెలు కోసం సంఘటన స్థలంలో రోదిస్తున్నాడు. భార్యాభర్తలు.. అదే గ్రామానికి చెందిన కొంగరాపు శ్రీనుది విషాద గాథ. పిల్లలు సుస్మిత, సాయిలను వృద్ధులైన తల్లిదండ్రులు తులసమ్మ, రాములు వద్ద ఉంచి..నలభై రోజుల క్రితమే కూలిపని కోసం భార్య కృష్ణవేణి, సారవకోట మండలం పాయకవలసకు చెందిన బావమరిది ముద్ద శ్రీనుతో కలిసి చెన్నై వెళ్లాడు. భవన ప్రమాదంలో ముగ్గురూ చిక్కుకున్నారు. కృష్ణవేణి చిన్న సోదరుడు శ్యామలరావు పాముకాటుతో పదేళ్ల క్రితమే చనిపోవడంతో కన్నబిడ్డలెవరూ దక్కకుండా పోయరంటూ ఆమె తల్లి..విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పిల్లలను వదిలి వెళ్లి.. ఈ దారుణంలో బలైన జ్యోతిది మరో గాథ. పిల్లలు శ్రీను, మౌనికలను కుటుంబ సభ్యుల వద్ద ఉంచి..భర్త సింహాచలంతో కలిసి ఉపాధి కోసం ఇటీవలే.. చెన్నైకి వెళ్లింది. భర్త సిం హాచలం టీ తాగేందుకు బయటకు వచ్చి..తి రిగి వెళ్లేసరికి జ్యోతి భవన శిథిలాల కింది చిక్కుకుంది. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన సింహాచలం అక్కడే కుప్ప కూలిపోయాడు. మనుమలు తల్లి ప్రేమకు దూరమయ్యారంటూ.. ఆమె అత్త విలపిస్తోంది. చెన్నై వెళ్లిన అధికారులు పాలకొండ రూరల్: చెన్నై మాంగాడు బహుళ అంతస్తుల భవనాలు ఆకస్మికంగా కూలిపోవడం..అక్కడ పాలకొండ డివిజన్‌కు చెందిన పలువురు శిథిలాల కింద చిక్కుకోవడంతో అధికారులు హుటాహుటిన చెన్నైకి బయల్దేరారు. వారి క్షేమ సమాచారం తెలుసుకుని, అవసరమైన సేవలు అందించేందుకు పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్‌తో పాటు రాజాం తహశీల్దార్ జె.రామారావు, హిరమండలం ఆర్ఐ శంకరరావు ఒక బృందంగా చెన్నైకి వెళ్లారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు శిథిలాల కింద చిక్కుకున్న వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు తన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆర్డీవో తేజ్ భరత్ తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు 08941-260144 నంబర్‌కు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చన్నారు. భామిని మండలానికి చెందిన ఇద్దరు, కొత్తూరులో ముగ్గురు, హిరమండలంలో ఐదుగురు, పాలకొండలో ఒక కుటుంబానికి చెందిన బాధితులున్నట్లు ఇప్పటి వరకు తమకు సమాచారమందిందన్నారు. కంట్రోల్ రూమ్ ఇన్చార్జిగా కార్యాలయ ఉపగణాంక అధికారి ఇ.లిల్లీ పుష్పనాథం వ్యవహరిస్తున్నారు. ఆలస్యంగా..! శ్రీకాకుళం: పొట్ట కూటి కోసం చెన్నై వెళ్లి.. బహుళ అంతస్తుల భవంతి కూలిన ప్రమాదంలో జిల్లా వాసులు చిక్కుకున్నా అధికారు లు ఆలస్యంగా స్పందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో పాలకొండకు చెందిన ఐదుగురు, హిరమండలం గొట్ట గ్రామానికి చెందిన ఐదుగురు, లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒకరు, కొత్తూరు మండలం ఇరాపాడు వాసులు ముగ్గురు, భామిని మండలం కొరమకు చెందిన ఇద్దరు, లక్ష్మీనర్సుపేట మండలానికి చెందిన ఇద్దరు, నరసన్నపేట మండలం బాలసీమకు చెందిన ఒకరు శిథి లాల కింద చిక్కుకున్నట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారమందింది. ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా..అధికారులు ఆల స్యంగా స్పందించడంపై బాధితుల బంధువులు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. పొరుగు జిల్లా విజయనగరం బాధితుల కోసం అక్కడి కలెక్టర్ స్పందించినా.. మన వారికి పట్టకపోవడమేమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాధితుల సంఖ్య పాలకొండ డివిజన్లో ఎక్కువగా ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీవో తేజ్ భరత్ రాజాం తహశీల్దార్, హిరమండలం ఆర్ఐతో కలిసి చెన్నై బయల్దేరారు. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు ప్రమాదంపై బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నెంబర్లు: 18004256625, 08942-225361, 9652838191కేటాయించారు. చెన్నైకి వెళ్లిన బంధువులు కొందరు బాధితుల బంధువులు శనివారం రాత్రే చెన్నై బయలుదేరి వెళ్లారు. అధికారులు కూడా కచ్చితమైన సమాచారం ఇవ్వక పో యినా.. సేకరించిన వివరాలు ప్రకారం 19 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.మన అధికారులు మాత్రం ఎంచక్కా..తమిళనాడు అధికారులు ఏమీ చెప్పడం లేదని వారిపైకి తోసేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌ను సంప్రదించామని,సహాయక చర్యలు చేపట్టేందుకు సహకరించాలని కోరామని పేర్కొన్నారు. కొరమలో విషాదం భామిని (కొరమ): కొరమకు చెందిన దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. చెన్నైలో భవనం కూలి దాసరి రాము(35), కుమారి(29) శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం ఆర్ఐ పైడి కూర్మారావు, వీఆర్ వో కె.కృష్ణారావు, వీఆర్వోల సంఘ అధ్యక్షుడు కె.సన్యాసిరా వు తదితరులు బాధిత కుటుం బాన్ని పరామర్శించి, ఓదార్చా రు. వీరు ఈ ఏడాది జనవరిలో ఇక్కడి నుంచి వలస వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. వీరితో పాటు వెళ్లిన మరో నలుగురు క్షేమంగా ఉన్నట్లు ఇక్కడి వారికి సమాచారమందింది. -
బీజేపీ కార్యాలయంలో సంబరాలు
లక్ష్మీపురం, న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవడంపై బ్రాడీపేటలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పొట్రు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితుల్లో ఉందని, మోడీ ఒక్కరే ఈ పరిస్థితిని అధిగమించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని అన్నారు. సంబరాల్లో పార్టీ జోనల్ ఇన్చార్జి ఆర్.లక్ష్మీపతి, వి.పాండురంగ విఠల్, పి.రవిశంకర్, నల్లబోలు విష్ణు, నూతక్కి దశరథ్, మురళి, రాము, డి.గోపాలరావు, సి.హెచ్.హృషికేష్, రాజేష్‌నాయుడు, పేరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్బన్ కార్యాలయంలో అరండల్‌పేటలోని బీజేపీ అర్బన్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు గులాములు చల్లుకుని, స్వీట్లు పంచుకొనిఆనందాన్ని వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున డప్పులు, మంగళవాయిద్యాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి జూపూడి రంగరాజు, నగర అధ్యక్షుడు ఆలూరు కోటేశ్వరరావు సహా డ్యాన్సులతో ఆకర్షించారు. సంబరాల్లో పార్టీ నాయకులు మండూరి అమర్‌బాబు, ఉడతా పవన్‌కుమార్, అప్పిశెట్టి రంగారావు, పాలపాటి రవికుమార్, వెలగలేటి గంగాధర్, బొల్లాప్రగడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం
లక్ష్మీపురం(గుంటూరు), న్యూస్‌లైన్ :ప్రజాస్వామ్య విలువలు పెంపొం దించడంలో మీడియా పాత్ర కీలకమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక కన్నావారితోటలోని కేకేఆర్ ప్లాజాలో శనివారం ఏపీయూడబ్ల్యుజే రూపొందిం చిన 2014 మీడియా డైరీని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కన్నా మాట్లాడుతూ మీడియాలో పోటీతత్వం పెరిగి ందనీ, ఆ పోటీతత్వంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మరో ముఖ్యఅతిథి జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం మీడియా కృషి చేయాలనీ, సమస్యలను వెలికి తీయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉం దని చెప్పారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇం డియా సభ్యులు కె.అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో పోరాడుతున్నామని చెప్పారు. సభ కు అధ్యక్షత వహించిన యూనియన్ జిల్లా అధ్యక్షుడు పుల్లగూర భక్తవత్సలరావు మాట్లాడుతూ జిల్లాలోని జర్పలిస్టుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.సోమసుందర్, ఉపాధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, అంబటి ఆంజ నేయులు, ప్రెస్ అకాడమీ మాజీ గవర్నింగ్ సభ్యుడు నిమ్మరాజు చలపతిరా వు, డీపీఆర్వో పి.మనోరంజన్, వైఎస్సా ర్ సీపీ వాణిజ్యవిభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, యూని యన్ కౌన్సిల్ రాష్ట్ర సభ్యు డు దండా గోపి, కార్యదర్శి చింతాడ రమేష్, యూ నియన్ మాజీ అధ్యక్షుడు కె.వి.భాస్కర్‌రెడ్డి, యడ్ల సునీల్ తదితరులు పాల్గొన్నారు. సభానంతరం సీని యర్ జర్నలిస్టు వెంకటేశ్వరరావును యూని యన్ నాయకులు ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులు ఆయనకు ఆర్థిక సాయం చేశారు. -
ఉలిక్కిపడిన గుంటూరు నగరం
గుంటూరు,న్యూస్‌లైన్: నగరంలోని పోష్ ఏరియాగా గుర్తింపు పొందిన లక్ష్మీపురంలోని రెండు ప్రైవేటు బ్యాంకు ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరస చోరీలకు ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటలలోపు పక్కా ప్లానింగ్‌తో ఇవి జరుగుతున్నాయి. ఐదు నెలల్లో రూ.30 లక్షలను దొంగలు దోచుకున్నారు. దీంతో ఒంటరిగా బ్యాంకుకు వెళ్లడానికి ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. బ్యాంకుల వద్ద పోలీస్ వ్యవస్థ నిఘా పెంచకపోవడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరిగిన సంఘటనతో పోలీస్ వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం సడలుతోంది. బుధవారం లక్ష్మీపురంలోని ఐసీఐసీఐ బ్యాంకులో రూ.14.50 లక్షలు డ్రా చేసుకుని వెళ్లుతున్న పిన్నెటి శివకుమారిని వెంబడించి మరీ చోరీకి పాల్పడ్డారు. బందావన్గార్డెన్స్కు చెందిన శివకుమారి నవభారత్నగర్లోని ఓ స్థలం కొనుగోలుకు సంబంధించి రిజిస్టేషన్ పనిపై నగదును డ్రా చేసుకుని చెల్లెలి కుమారుడు సుధీర్‌తో కలిసి మధ్యాహ్నం 1.10 గంటలకు ద్విచక్రవాహనంపై వెళ్తుతుండగా గుర్తు తెలియని ఇద్దరు యువకులు వారిని అనుసరించి బ్యాగ్‌ను బలవంతంగా లాక్కుని వెళ్ళటంతో బైక్‌పై నుంచి పడి శివకుమారికి స్వల్పగాయాలయ్యాయి. నిందితులిద్దరూ 25సంవత్సరాలు లోపు వయసు వారై ఉండవచ్చని, ఒకరు రోజ్ కలర్ టీషర్టు వేసుకున్నారని పోలీసులకు బాధితులు తెలిపారు. ప్రై వేటు బ్యాంకు ఖాతాదారులే లక్ష్యంగా చోరీలు లక్ష్మీపురంలోని ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. బుధవారం జరిగిన చోరీతోపాటు ఐదు నెలల క్రితం ఫిరంగిపురానికి చెందిన వెంట్రుకల వ్యాపారి జగన్నాధం శ్రీనివాసరావు వద్ద నుంచి రూ.3.30 లక్షలు ఇదే విధంగా బైక్‌పై వెంబడించి లాక్కుపోయారు. సెప్టెంబరులో మరో వ్యక్తి వద్ద రూ.5లక్షలు, నెలలో బ్రాడిపేటకు చెందిన ఎరువుల వ్యాపారి వద్ద నుంచి నాలుగు లక్షలు చోరీ చేశారు. ఇప్పటికి ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారుల నుంచి మూడు సార్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారుల నుంచి రెండు సార్లు దోచుకుపోయారు. ఛత్తీస్‌గఢ్ గ్యాంగ్‌లపై అనుమానాలు నగరంలో బ్యాంకు ఖాతాదారుల లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నది ఛత్తీస్‌గఢ్ గ్యాంగ్‌గా అనుమానాలు ఉన్నాయని వెస్ట్ డీఎస్పీ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితులను గుర్తిస్తానని శివకుమారి చెల్లెలి కుమారుడు సుధీర్ చెప్పటంతో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.10గంటలు వరకు బ్యాంకులోని సీసీ కెమెరాల్లో ఫుటేజ్ పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు కూడా ఖాతాదారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. దర్యాప్తులో అరండల్‌పేట సీఐ ఆళహరి శ్రీనివాసరావు, పట్టాభిపురం సీఐ బి.రాజశేఖర్ తదితరులున్నారు. -
మహిళపై దాడి: రూ.14 లక్షల చోరీ
మహిళపై దాడి చేసి ఆమె వద్ద ఉన్న రూ.14 లక్షల నగదును దుండగులు అపహరించుకుపోయిన సంఘటన బుధవారం గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. ఆ దాడిలో మహిళ గాయపడింది.అయితే ఆ మహిళ వెంటనే బ్యాంక్ అధికారులను ఫిర్యాదు చేసింది. దాంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన బ్యాంక్‌కు చేరుకున్నారు. దుండగులకు సంబంధించిన వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మీపురంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఎదురుగా ఆ ఘటన చోటు చేసుకుంది.