ఉలిక్కిపడిన గుంటూరు నగరం
Published Thu, Nov 14 2013 1:41 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు,న్యూస్‌లైన్: నగరంలోని పోష్ ఏరియాగా గుర్తింపు పొందిన లక్ష్మీపురంలోని రెండు ప్రైవేటు బ్యాంకు ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరస చోరీలకు ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటలలోపు పక్కా ప్లానింగ్‌తో ఇవి జరుగుతున్నాయి. ఐదు నెలల్లో రూ.30 లక్షలను దొంగలు దోచుకున్నారు. దీంతో ఒంటరిగా బ్యాంకుకు వెళ్లడానికి ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. బ్యాంకుల వద్ద పోలీస్ వ్యవస్థ నిఘా పెంచకపోవడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరిగిన సంఘటనతో పోలీస్ వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం సడలుతోంది.
బుధవారం లక్ష్మీపురంలోని ఐసీఐసీఐ బ్యాంకులో రూ.14.50 లక్షలు డ్రా చేసుకుని వెళ్లుతున్న పిన్నెటి శివకుమారిని వెంబడించి మరీ చోరీకి పాల్పడ్డారు. బందావన్‌గార్డెన్స్‌కు చెందిన శివకుమారి నవభారత్‌నగర్‌లోని ఓ స్థలం కొనుగోలుకు సంబంధించి రిజిస్టేషన్ పనిపై నగదును డ్రా చేసుకుని చెల్లెలి కుమారుడు సుధీర్‌తో కలిసి మధ్యాహ్నం 1.10 గంటలకు ద్విచక్రవాహనంపై వెళ్తుతుండగా గుర్తు తెలియని ఇద్దరు యువకులు వారిని అనుసరించి బ్యాగ్‌ను బలవంతంగా లాక్కుని వెళ్ళటంతో బైక్‌పై నుంచి పడి శివకుమారికి స్వల్పగాయాలయ్యాయి. నిందితులిద్దరూ 25సంవత్సరాలు లోపు వయసు వారై ఉండవచ్చని, ఒకరు రోజ్ కలర్ టీషర్టు వేసుకున్నారని పోలీసులకు బాధితులు తెలిపారు.
ప్రై వేటు బ్యాంకు ఖాతాదారులే లక్ష్యంగా చోరీలు
లక్ష్మీపురంలోని ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. బుధవారం జరిగిన చోరీతోపాటు ఐదు నెలల క్రితం ఫిరంగిపురానికి చెందిన వెంట్రుకల వ్యాపారి జగన్నాధం శ్రీనివాసరావు వద్ద నుంచి రూ.3.30 లక్షలు ఇదే విధంగా బైక్‌పై వెంబడించి లాక్కుపోయారు. సెప్టెంబరులో మరో వ్యక్తి వద్ద రూ.5లక్షలు, నెలలో బ్రాడిపేటకు చెందిన ఎరువుల వ్యాపారి వద్ద నుంచి నాలుగు లక్షలు చోరీ చేశారు. ఇప్పటికి ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారుల నుంచి మూడు సార్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారుల నుంచి రెండు సార్లు దోచుకుపోయారు.
ఛత్తీస్‌గఢ్ గ్యాంగ్‌లపై అనుమానాలు
నగరంలో బ్యాంకు ఖాతాదారుల లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నది ఛత్తీస్‌గఢ్ గ్యాంగ్‌గా అనుమానాలు ఉన్నాయని వెస్ట్ డీఎస్పీ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితులను గుర్తిస్తానని శివకుమారి చెల్లెలి కుమారుడు సుధీర్ చెప్పటంతో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.10గంటలు వరకు బ్యాంకులోని సీసీ కెమెరాల్లో ఫుటేజ్ పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు కూడా ఖాతాదారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. దర్యాప్తులో అరండల్‌పేట సీఐ ఆళహరి శ్రీనివాసరావు, పట్టాభిపురం సీఐ బి.రాజశేఖర్ తదితరులున్నారు.
Advertisement
Advertisement