► గంగ అంటే ప్రీతి
►పెరుమాళ్ అంటే భక్తిభావం
►శివయ్య సన్నిధిలో రాహుకేతు పూజలు
►ఆమె పూర్వీకులది కుప్పం సమీపంలోని లక్ష్మీపురం
నటిగా రెండు దశాబ్దాలు.. తమిళనాడు రాజకీయాల్లో మూడు దశాబ్దాలు ఏలి.. చరిత్రలో నిలిచిన జయలలితకు జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. ఆమెకు పెరుమాళ్ అంటే మెండైన భక్తి. తెలుగు ప్రజలన్నా అంతులేని అభిమానం. అలాంటి అభిమాన ధ్రువతార ఇక లేరని తెలియడంతో జిల్లాలోని ఆమె అభిమానులు, ప్రజల్లో విషాద ఛాయలు అలుముకున్నారుు. ఆమె మరణించిన సందర్భంగా జిల్లాతో ఆమెకున్న అనుబంధం మననం చేసుకున్నారు. విషాద సాగరంలో మునిగిపోయారు.
సాక్షి, తిరుమల:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరన్న వార్త జిల్లావాసుల్ని తీవ్రంగా కలచివేసింది. జిల్లా అంతటా విషాద ఛాయలు అలుముకున్నారుు. ఆమె అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. సినీనటీగా, అన్నాడీఎంకే అధినేత్రిగా రాజకీయాల్లో ఎదురులేని శక్తిగా ఎదిగిన ‘అమ్మ’తో తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న చిత్తూరు జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉంది.
‘అమ్మ’ పూర్వీకులది
కుప్పం సమీపంలోని లక్ష్మీపురం జయలలిత పూర్వీకులది కుప్పం నియోగజవర్గం సమీపంలోని లక్ష్మీపురం. ఆమె ముత్తాత ఎల్‌ఎస్ రాజు సీనియర్ అడ్వకేట్‌గా పనిచేశారు. జనంలో ఆయనకు మంచి పేరుంది. లక్ష్మీపురం గ్రామంలో భారీ భవంతి ఉండేది. జయలలిత తల్లి సంధ్యతో కలసి జయలలిత బాల్యంలో పలుమార్లు లక్ష్మీపురం సందర్శించారట. ఆ జ్ఞాపకాలను స్థానికులు నేడు కూడా గుర్తు చేసుకుంటుంటారు. పూర్వీకులు నిర్మించిన భవంతి స్థానిక వరదరాజస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. పాత జ్ఞాపకాలకు చిహ్నంగా ఉన్న ఆ భవంతి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.
పెరుమాళ్ దర్శనం కోసం పలుసార్లు తిరుమలకు..
పెరుమాళ్ (శ్రీవేంకటేశ్వర స్వామి) అంటే జయలలితకు ఎనలేని భక్తి భావం. తాను సినీరంగంలో ఉన్నప్పుడు, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలోనూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే, ఆలయ అర్చకులతోనూ, పెదజియ్యర్లతోనూ ఆప్యాయంగా పలుకరించేవారు. ఇటు తమిళం, ఆంగ్లభాషలతోపాటు తెలుగుభాషను అనర్గళంగా, మృదువుగా మాట్లాడుతూ చిరునవ్వులు చిందించేవారు. మే 24వ తేదీ 2010లో చివరిసారిగా తిరుమల వచ్చారు.
శివయ్య సన్నిధిలో రాహుకేతు పూజలు
రాహుకేతు పూజలకు ప్రసిద్ధి పొందిన శ్రీకాళహస్తిక్షేత్రాన్ని పలుసార్లు జయలలిత సందర్శించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం రాహుకేతు పూజలు చేసి, వాయులింగేశ్వరుడిని దర్శించుకుని వెళ్లేవారు. నాటి జ్ఞాపకాలను నేడు అర్చకులు, ఆలయ సిబ్బంది గుర్తు చేసుకోవటం గమనార్హం.
గంగతో అమ్మకు మరింత అభిమానం
చెన్నై మహా నగరంలోని జనం గొంతు తడిపిన తెలుగుగంగ అంటే జయలలితకు ఎనలేని ప్రీతి. ఈ జలాలు చిత్తూరు జిల్లా మీదుగానే తమిళనాడులోకి ప్రవేశిస్తారుు. గంగ సరఫరాగా ఒప్పందాలు, తాగునీటి అవసరాలపై ఆమె ముఖ్యమంత్రిగాను, ప్రతిపక్ష హోదాలోనూ ఆయా కాలాల్లో రాష్ట్ర ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతూ పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో తొలి నుంచీ మరింత సాన్నిహిత్యంగా మెలిగేవారు
చెదరని స్మృతి
Published Wed, Dec 7 2016 4:37 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM
Advertisement
Advertisement