సినిమా: అమ్మ లక్షణాలు సహజంగానే ఆమెలో ఉన్నాయి అని మహిళా దర్శకురాలు ప్రియదర్శిని అన్నారు. ఈమె ఎవరి గురించి చెబుతున్నారో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అవును దర్శకురాలు ప్రియదర్శిని చెబుతున్నది నటి నిత్యామీనన్ గురించే. నవ దర్శకురాలైన ప్రియదర్శిని దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత నటీమణి జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జయలలిత పాత్రకు నటి నిత్యామీనన్‌ను ఎంపిక చేసుకున్న సంగతి విదితమే. దీనికి ది ఐరన్ లేడీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఇదంతా జరిగి చాలా రోజులైంది. దీంతో ఈ చిత్రంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో దర్శకురాలు ప్రియదర్శిని స్పందిస్తూ శనివారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ది ఐరన్‌లేడీ చిత్రం గురించి పలువురు పలు విధాలుగా ప్రశ్నిస్తున్నారు. వారందరికి వాస్తవాలను తెలియజేయాలని భావించాను. ఈ చిత్రం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పరిపూర్ణ జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. నిజ జీవిత అంశాలను పూర్తిగా చర్చించిన తరువాతనే జయలలిత పాత్రలో నటి నిత్యామీనన్ సరిగ్గా నప్పుతారని ఆమెను ఆ పాత్రకు ఎంపిక చేశాం, జయలలితలోని సహజమైన లక్షణాలన్నీ నిత్యామీనన్‌లో ఉన్నాయి.
పురట్చి తలైవి అమ్మ మాదిరిగానే నిత్యామీనన్ ఆరు భాషల్లో సరళంగా మాట్లాడగలరు. తను చిన్నతనంలోనే భరతనాట్యం, క్రీడలు పరిచయం కలిగి ఉన్నారు. అంతే కాదు సంగీతంలోనూ ప్రతిభ కలిగిన నటి. జీవిత చరిత్రను తెరకెక్కించడం సవాలే. అదేవిధంగా బయోపిక్‌లతో పలు సమస్యలు, చర్చలు, విమర్శలు ఉన్నా, అమ్మ జీవిత చరిత్రను యథార్థంగా ఎలాంటి మార్పులు చేయకుండా తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కథను తెరకెక్కించడంలో దర్శకురాలిగా సవాళ్లు అధికమే. ప్రజలు అంగీకరించేలా, అలరించేలా ఒక మంచి చిత్రాన్ని రూపొందించే బాధ్యతను తీసుకున్నాం. సర్ రిచర్డ్ ఆటంబరో గాంధీ బయోపిక్‌ను తెరకెక్కించడానికి 18 ఏళ్ల సమయాన్ని ఖర్చు చేశారు. ఒక ఉన్నతమైన చిత్రాన్ని రూపొందించడానికి అంత సమయం అవసరం అవుతుందన్న విషయంలో మేమూ దృఢంగా ఉన్నాం. ఈ చిత్రంలో సగం విజయం సరైన కథాపాత్రలను ఎంపిక చేయడంలోనే ఉంది. ఈ విషయంలో రాజీకి చోటు ఉండదు. అలా కాంప్రమైజ్ అయితే మీరు కచ్చితంగా అంగీకరించరన్నది మాకు తెలుసు.అందుకే యథార్థం మీరకుండా పూర్తి స్వేచ్ఛతో ఈ చిత్రాన్ని మీ ముందుంచాలని భావించాం, చిత్రంలో మూడు ప్రధాన పాత్రలు పోషించనున్న నటీనటుల కాల్‌షీట్స్ కోసం వేచి ఉన్నాం. ఈ విషయాన్ని మీ ముందుంచడం సంతోషంగా ఉంది. ఈ ఆదరణతో అసాధ్యాన్ని సాధ్యం చేస్తాం. అని ది ఐరన్ లేడీ చిత్ర రూపకల్పనకు పూనుకున్న నవ దర్శకురాలు ప్రియదర్శిని పేర్కొన్నారు.
అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి
Published Mon, Nov 4 2019 8:23 AM | Last Updated on Mon, Nov 4 2019 8:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment