సినిమా: ప్రేమలో ఓటమి కారణంగానే అలాంటి ఏహ్యభావం కలిగిందని చెప్పింది నటి నిత్యామీనన్. తనకు అనిపించింది చెప్పడానికి మొహమాట పడడం కానీ, భయపడడం కానీ తెలియని నటి ఈ సంచలన నటి. అయితే జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. బహుభాషానటిగా రాణిస్తున్న నిత్యామీనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. అవేంటో చూద్దాం.
ప్ర: మాతృభాష(మలయాళం)లో నటనకు చాలా గ్యాప్ వచ్చినట్లుందే?
జ:మలయాళ చిత్రాలు కాదనుకుని ఇతర భాషా చిత్రాల్లో నటించడం లేదు. తమిళం, తెలుగు భాషల్లో వచ్చిన అవకాశాలను ఒప్పుకుని చేస్తున్నప్పుడు వాటిని పూర్తి చేయడానికి ఏడాదికి పైగా పట్టే అవకాశం ఉంటుంది. దీంతో మలయాళంలో అవకాశాలను అంగీకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. నాకు 6 భాషలు తెలుసు. ఇంకా మరిన్ని భాషలను నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంది. అలా బెంగాలీ భాషను నేర్చుకుంటున్నాను.
ప్ర: ఒక తరుణంలో మీకు నటనపై విరక్తి కలిగిందనే ప్రచారం జరిగింది. దీని గురించి?
జ:నిజం చెప్పాలంటే నేను ఇష్టపడి ఈ రంగంలోకి రాలేదు. పత్రికారంగంలోకి రావాలని ఆశ పడ్డాను. అలాంటిది ప్లస్‌టూ చదువుతున్న సమయంలో వేసవి సెలవుల్లో ఉన్నప్పుడు దర్శకుడు కేబీ.కుమరన్ ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంలో నటించడానికి పిలిచారు. షూటింగ్ లండన్‌లో అని చెప్పడంతో ఆ మహానగరాన్ని చూడాలన్న ఆసక్తితో నటించడానికి అంగీకరించాను. ప్రస్తుతం ఖాళీ సమయాల్లో సినిమా కథలు రాసుకుంటున్నాను. అలా రెండు కథలను రెడీ చేశాను.
ప్ర:మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మహిళా సంఘంలో మీరు సభ్యులుగా ఉన్నట్లు లేదే?
జ:సినీ పరిశ్రమలో మహిళలకంటూ ఒక సంఘం అవసరం లేదని నేను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. అయితే అలాంటి సంఘాలు కోరుకునేవారికి అది అవసరం అవుతుంది. అయితే నా రూటు సపరేట్. ఇంతకు ముందు మలయాళ చిత్ర పరిశ్రమలో నాకు ఎదురైన సమస్యలను నేను పరిష్కరించుకున్నాను. అది నా గుణం. అదేవిధంగా కొన్ని చేదు అనుభవాల కారణంగా షూటింగ్‌ల నుంచి బయటకు వచ్చినట్లు జరిగిన ప్రచారంలోనూ నిజం లేదు. కథలు నచ్చి చేస్తున్నప్పుడు షూటింగ్ నుంచి బయటకెళ్లాల్సిన అవసరం ఏముంటుంది. మీటూ అనేది సినిమాలో మాత్రమే కాదు. అయితే సినీమా వాళ్లు సెలబ్రిటీలు కావడంతో అలాంటి వాటిని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.
ప్ర:సాధారణంగా మీరు ఏకాంతం కోరుకుంటారట?
జ: అలా అనేం లేదు. అందరి మధ్య ఉండడంతో పాటు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాను. నేను ఆస్తికురాలిని. మనకు పైన ఒక శక్తి ఉంటుందని నమ్ముతాను. సంగీతం అంటే ఇష్టం. సంగీతంలో శిక్షణ పొందాను కూడా. అయినా సినిమాల్లో పాడే అదృష్టం కలగలేదు.
ప్ర:మీ గురించి ప్రచారం అయ్యే వదంతుల గురించి?
జ: వదంతుల గురించి నేను పట్టించుకోవడం లేదు. ఇతరులకు వేదన కలిగించేవారు అందుకు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. తొలి ప్రేమలో నేను విసిగి పోయాను. అలా ప్రేమలో ఓడిపోయాను. అందుకే కొంతకాలం మగవాళ్లను అసహ్యించుకున్నాను. ఆ తరువాత ప్రేమ జోలికే పోలేదు. ఒక తెలుగు నటుడి కుటుంబ జీవితంలో చిచ్చుకు నేనే కారణం అని ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆ నటుడు నేను కలిసి నటించిన చిత్రం విడుదల కావడంతోనే అలాంటి వదంతులు ప్రచారం అయ్యాయి. అప్పుడు నేను చాలా బాధకు గురయ్యాను. నన్ను బాధకు గురి చేసిన వారు సంతోషించి ఉండవచ్చు. అయితే అప్పుడు నాపై వచ్చిన ప్రేమ వదంతులు నిజం కాదని ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఆ నటుడు వివాహ రద్దు పొంది చాలా కాలమైంది. అప్పటి వదంతుల్లో నిజం ఉంటే ఇప్పుడు ఆ నటుడు నేను పెళ్లి చేసుకునేవారం కదా! నా లోకం నాకు మాత్రమే సొంతం. పెళ్లి కోసం ఎవరినో ఒకరిని జీవిత భాగస్వామిని చేసుకోను. నాకు సరైన వాడు తారస పడినప్పుడు పెళ్లి చేసుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment