
ధనుష్ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడ్లీ కడై’(Idli Kadai) (ఇడ్లీ కొట్టు) సినిమా కోసం వేసిన సెట్ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటన అర్దరాత్రి జరిగినట్లు తెలుస్తోంది. తేని జిల్లా అండిపట్టిలో కొద్దిరోజులుగా సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే అక్కడ ధనుష్, నిత్యా మీనన్ మధ్య కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే, సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన కొన్ని పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

సుమారు 15 రోజులుగా ఆ ప్రాంతంలోనే చిత్రీకరణ జరుగుతుంది. ధనుష్ ఇడ్లీ షాప్ సన్నివేశాలకు సంబంధించిన సెట్‌ను అక్కడ వేశారు. మొదట అందులో నుంచే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయని తెలుస్తోంది. ఇడ్లీ కొట్టు చిత్రాన్ని ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ‘తిరు’ (2022) సినిమా తర్వాత ధనుష్–నిత్యా మీనన్ మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్ విజయ్, ప్రకాశ్‌రాజ్, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 1న ఈ మూవీ విడుదల కానున్నట్లు కొద్దిరోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు.