కోలీవుడ్ నటుడు జయం రవి(Jayam Ravi) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రాలలో 'కాదలిక్క నేరమిల్లె' (ప్రేమకు సమయం లేదు) ఒకటి. నటి నిత్యామీనన్ (Nithya Menen) నాయకిగా నటించిన ఇందులో వినయ్, టీజే భాను తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈ నెల 14వ తేదీన తెరపైకి రానుంది.
శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నటి నిత్యామీనన్ మాట్లాడుతూ ఎవరు ఎలాంటి ఈగో లేకుండా పనిచేసిన చిత్రం ఇదని, ఇది రోమ్ కామ్ కథ కాదని, చాలా డ్రామాతో కూడిన చిత్రమని, దీన్ని దర్శకురాలు కృతిక చాలా అందంగా తెరపై ఆవిష్కరించారని చెప్పారు. ఈ చిత్రంలో నటించడం ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నటుడు జయం రవి మాట్లాడుతూ ఈ చిత్రానికి అట్టహాసమైన టైటిల్ లభించడం సంతోషకరమని తెలిపారు.
'కాదలిక్క నేరమిల్లె' (Kadhalikka Neramillai) చిత్రంలో నటి నిత్య మేనన్ పేరు తర్వాత తన పేరు వేయడం గురించి అడుగుతున్నారని, అందుకు తన కాన్ఫిడెన్సే కారణమని అన్నారు. సినీ జీవితంలో తాను చాలా విషయాలను బ్రేక్ చేశానని, ఇది మాత్రం ఎందుకు చేయకూడదు అని భావించానన్నారు. నటుడు షారుక్ ఖాన్‌ను చూసిన తర్వాత తానీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మహిళలు లేకుంటే ఈ ప్రపంచమే లేదన్నారు. వారు లేకపోతే మనం లేమన్నారు ఇకపై మహిళ దర్శకుల చిత్రాల్లో ఇలానే నటిస్తానని పేర్కొన్నారు.
తనకు ఇంతకుముందు చాలా గడ్డు కాలం వచ్చిందని, నటించిన చిత్రాలు ఏవీ బాగా ఆడలేదని, దీంతో తాను చేసిన తప్పేమిటి అని ఆలోచించానన్నారు. ఎలాంటి తప్పు చేయని తాను ఎందుకు కుంగిపోవాలని అనిపించిందన్నారు. ఆ తర్వాతే తాను నటించిన మూడు చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయన్నారు. కింద పడినా నిలబడక పోవడమే అపజయం అని, ఈ ఏడాది మళ్లీ ఇదే బాట పడతాననే నమ్మకాన్ని జయం రవి వ్యక్తం చేశారు. దర్శకుడు కె.బాలచందర్ పలు సాధారణ విషయాలను బ్రేక్ చేశారని, అదేవిధంగా ఈ జనరేషన్‌లో దర్శకురాలు కృతిక ఉదయనిధి చేస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment