
ఓ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి రూ. 9 కోట్లు నష్టపరిహారం కోరుతూ చైన్నె హైకోర్టులో కోలీవుడ్ నటుడు రవిమోహన్ పిటిషన్ దాఖలు చేశారు. కోయంబత్తూర్‌కు చెందిన బాబీటచ్ గోల్డ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా నటుడు రవిమోహన్ హీరోగా రెండు చిత్రాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు గానూ ఆయనకు రూ.6 కోట్లు అడ్వాన్స్ కూడా చెల్లించింది. అయితే నటుడు రవిమోహన్ తమ సంస్థకు చిత్రాలను చేయకుండా ఇతర చిత్రాలను చేస్తున్నారని, ఈనేపథ్యంలో తామిచ్చిన అడ్వాన్స్‌ను వడ్డీతో సహా రూ.10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని చైన్నె సిటీ కోర్టులో ఆ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.
దీంతో నటుడు రవిమోహన్ కూడా చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను కేటాయించిన కాల్‌షీట్స్‌ను బాబీగోల్డ్ టచ్ యూనివర్శల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉపయోగించుకోలేదని అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను మరో చిత్రం చేసి ఆ సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇస్తానని చెప్పానట్లు అందులో పేర్కొన్నారు. అయితే వారం రోజుల్లోనే ఆ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని ఆ సంస్థ ఒత్తిడి చేసిందని పేర్కొన్నారు.
అదే విధంగా తాను కేటాయించిన కాల్‌షీట్స్‌ను ఉపయోగించుకోకుండా తన సమయాన్ని వృధా చేయడంతో తనకు నష్టం వాటిల్లిందన్నారు. వారి సినిమాకు ఒప్పుకున్నందున తాను మరో సినిమాకు కాల్షీట్స్ ఇవ్వలేకపోయానన్నారు. దీంతో వారే తనకు రూ. 9 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.