అయలాన్, మావీరన్ చిత్ర వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్‌కు తాజాగా అమరన్ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఆయన, సాయిపల్లవి నటన పలువురి ప్రశంసలను అందుకుంది. కాగా ప్రస్తుతం శివకార్తికేయన్ తన 23వ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. అదేవిధంగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో 24వ చిత్రాన్ని చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్ హీరోగా నటించే 25వ చిత్రానికి మహిళా దర్శకురాలు సుధా కొంగర కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు.
వాస్తవానికి ఈ చిత్రంలో సూర్య కథానాయకుడిగా నటించాల్సి ఉంది. దీనికి పురనానూరు అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వల్ల సూర్య ఈ చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ను ఎంపిక చేశారు. ఇందులో నటుడు జయంరవి ప్రతినాయకుడిగా నటించనుండడం విశేషం. అదేవిధంగా మరో నటుడు అధర్వ ముఖ్యపాత్ర పోషించనున్నారు. నటి శ్రీలీల నాయకిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈమె ఈ చిత్రం ద్వారా నేరుగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారన్నమాట.
డాన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం 1965లో జరిగే చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలిసింది. కాగా ఇంతకుముందు దీనికి పురనానూరు అనే టైటిల్‌ను నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా పేరును మార్చినట్లు, 1965 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment