నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయలాన్, మావీరన్,ఇటీవల విడుదలైన అమరన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా మరో మూడు చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. అందులో ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి 'డాన్' చిత్రం ఫేమ్ సిబి.చక్రవర్తి డైరెక్షన్‌లో ఒక చిత్రం రానుంది. అదేవిధంగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తన 25వ చిత్రంలో శివకార్తీకేయన్ నటించడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. పురనానూరు పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.
కాగా ఈ చిత్ర షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా అందులో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో షూట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. అయితే, దర్శకురాలు సుధా కొంగర, నటుడు శివకార్తికేయన్ మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రోమో షూట్ రద్దు అయినట్లు సోషల్‌మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రోమో షూట్‌కు పూర్తి గడ్డంతో శివకార్తికేయన్ రావడం వల్ల సుధా కొంగర అభ్యంతరం చెప్పారట. గడ్డం తొలగించి రావాలని దర్శకురాలు సుధా కొంగర చెప్పడంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయట.
అయితే, కథ చెప్పినప్పుడు గడ్డంతోనే ఉండాలని చెప్పారు కదా అంటూ శివకార్తికేయన్ కాస్త అసహనం చెందారట. లైట్ బియార్డ్‌తో ఉండాలని చెబితే.. పరుత్తివీరన్‌లో కార్తీ మాదిరి ఉంటే ఎలా అని దర్శకురాలు సుధా కొంగర అనడంతో తన అభ్యంతరాన్ని తెలిపి షూటింగ్ స్పాట్ నుంచి శివకార్తికేయన్ వెళ్లిపోయినట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించి మళ్లీ త్వరలోనే ప్రోమో షూట్ నిర్వహించనున్నట్లు తెలిసింది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ద్వారా నటి శ్రీలీల కోలీవుడ్‌కు పరిచయం కానున్నారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. అదే విధంగా ఇందులో నటుడు జయంరవి ప్రతినాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment