శివకార్తికేయన్‌కు 25వ చిత్రం
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌కు 100వ సినిమా
తమిళ్‌లో శ్రీలీలకు మొదటి సినిమా
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివ కార్తికేయన్. ఈయన ఇటీవల రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో హీరోగా నటించిన అమరన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సాయి పల్లవి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించారు. ప్రస్తుతం శివకార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
తాజాగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటి శ్రీలీల నాయకిగా నటించనున్నారు. ఇదే ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం. పుష్ప సినిమా తర్వాత ఆమెకు భారీగా ఛాన్స్‌లు పెరుగుతున్నాయి. అయితే, ఆమె సెలక్టెడ్ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందకు వెళ్తుంది. ఇందులో ప్రముఖ నటుడు జయం రవి కూడా ప్రధాన పాత్రను పోషించనున్నారు. మరో ముఖ్య పాత్రలో నటుడు అధర్వ పోషించనున్నారు.
డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఆయనకు 100వ చిత్రం కావడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రానికి రవి కె.చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీని గురించి నిర్మాత అధికారిక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో ఈ ఎస్.కె 25 చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని నిర్మాత ఆకాష్ భాస్కరన్ వ్యక్తం చేశారు.
ఇది పీరియడ్ కాల కథాంశంతో రూపొందుతున్న చిత్రం. దీనికి పురనానూరు అనే టైటిల్ ఇంతకుముందే ఖరారు చేశారు అన్నది గమనార్హం. ఈ చిత్రం రూ.150 కోట్ల బడ్జెట్లో రూపొందుతున్నట్లు సమాచారం. మల్టీ స్టార్స్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment