వంద శాతం వైకల్యమున్నా పింఛన్ ఇవ్వరా? | Pension disabilities to give one hundred percent? | Sakshi
Sakshi News home page

వంద శాతం వైకల్యమున్నా పింఛన్ ఇవ్వరా?

Published Tue, Nov 18 2014 3:56 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

వంద శాతం వైకల్యమున్నా పింఛన్ ఇవ్వరా? - Sakshi

‘సార్.. నా భర్త చనిపోయిండు. 19 ఏళ్ల బిడ్డ వికలాంగురాలు. నెలకు ఐదువందల పింఛన్ వచ్చేది. ఆ పింఛన్ సైతం తీసేస్తే ఎట్ల బతుకుతం. మేమేమన్న ఉన్నోళ్లమా. మేమేం పాపం చేసినం చెప్పండి..’ అంటూ హుస్నాబాద్‌కు చెందిన కంసాని అనసూర్య నగరపంచాయతీ కమిషనర్ మార్క సుధాకర్‌ను ప్రశ్నించారు. వంద శాతం వైకల్యం ఉన్న తన బిడ్డను రోడ్డుపై ఉంచి.. ‘ఈమె వికలాంగురాలు కాదా? ఇలాంటి వాళ్లకు పింఛన్ ఇయ్యరా. చెప్పండి సార్’ అంటూ నిలదీసింది. ఇలాగే హుస్నాబాద్ నగరపంచాయతీ ఎదుట వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సైతం భారీగా ఆందోళనకు దిగారు. వంటావార్పు చేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.        - హుస్నాబాద్
 
 హుస్నాబాద్ : పింఛన్‌కోసం పేదలు పోరుబాట పట్టారు. ఇన్నాళ్లూ అందుతున్న పింఛన్లను ఎందుకు తొలగించారో చెప్పాలంటూ అధికారులను నిలదీశారు. వితంతువులకూ అన్యాయం చేసిన కేసీఆర్‌కు తమ ఉసురు తగులుతుందంటూ ఆయన చిత్రపటాన్ని చెప్పులతో దండించారు. హుస్నాబాద్ నగరపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేసేవరకూ కదిలేది లేదంటూ అక్కడే వంటావార్పు చేశారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయకులు మద్దతు పలికారు.

హుస్నాబాద్‌లో గతంలో 1,735 మందికి పింఛన్లు అందేవి. కొత్తగా 2,810 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 849మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించి పింఛన్లు ఇచ్చారు. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆందోళనకు దిగారు. నగర పంచాయతీ కార్యాలయంలోని జాబితాలో పేర్లు లేకపోవడంతో రహదారిపై బైఠాయించారు.

 చాంబర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం
 తమకు అన్యాయం ఎందుకు చేశారో చెప్పాలం టూ చైర్మన్ సుద్దాల చంద్రయ్య చాంబర్‌లోకి చొచ్చుకెళ్లారు. తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఏళ్ల తరబడి పింఛన్ పొందుతున్నామని, అయినా తొలగించారని ఆగ్రహం వ్యక్తంచే శారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడినా వారు ససేమిరా అన్నారు. పింఛన్ తొలగించినోళ్లకు తమ ఉసురుతగులుతుందంటూ పాటలుపాడారు. సీఎం కేసీఆర్, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, నగర పంచాయతీ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 కార్యాలయం ఎదుట వంటావార్పు
 తమకు న్యాయం చేసేవరకూ ఇక్కడి నుంచి వెళ్లేదిలేదంటూ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. అక్కడే వంటలు వండి సహపంక్తి భోజనాలు చేశారు. వీరికి కాంగ్రెస్ నాయకులు ఆకుల వెంకట్, కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్, కోమటి సత్యనారాయణ, బొలిశెట్టి శివయ్య, గురాల లింగారెడ్డి, బొల్లి శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, మైదంశెట్టి వీరన్న, వార్డు కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, దండి లక్ష్మి, వాల సుప్రజ, పచ్చిమట్ల ప్రతిభ, చిత్తారి పద్మ, కోమటి స్వర్ణలత, బీజేపీ నాయకులు వేముల దేవేందర్‌రెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి, గుత్తికొండ విద్యాసాగర్, వరయోగుల అనంతస్వామి, కందుకూరి సతీష్, సీపీఐ నాయకులు కొయ్యడ సృజన్‌కుమార్, మాడిశెట్టి శ్రీధర్, టీడీపీ నాయకులు బోజు రవీందర్ మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. చైర్మన్ సుద్దాల చంద్రయ్య వచ్చి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అంతకుముందు పట్టణంలోని నాలుగో వార్డులో పింఛన్ల పంపిణీ కేంద్రం వద్ద అధికారులను నిర్బంధించారు.
 
 పింఛన్ల పంపిణీలో నిరసనలు
     పింఛన్లు ఇస్తే అర్హులందరికీ ఇవ్వాలని, లేదంటే వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లెలో స్థానికుడు కరివేద భూంరెడ్డి గ్రామ పంచాయతీకి తాళం వేశాడు. నేదునూర్, గొల్లపల్లి, వచ్చునూర్‌లో సైతం కొందరు అధికారులను ప్రశ్నించారు.
     అర్హుల జాబితా నుంచి తమ పేర్లు తొలగించడంపై రామగుండం మండలం బసంత్ నగర్ పరిధిలోని పాలకుర్తిలో 50 మంది వృద్ధులు గ్రామ పంచాయతీ భవనం ఎదుట ఆందోళన చేపట్టారు.  


     రాయికల్ మండలంలోని భూపతిపూర్‌లో పింఛన్ల పంపిణీకి వెళ్లిన ఎంపీడీవో గీతను వృద్ధులు అడ్డుకున్నారు.
     చొప్పదండి మండలంలోని పెద్దకూర్మపల్లిలో పింఛన్ల పంపిణీని గ్రామస్తులు అడ్డుకున్నారు.  47 మంది పింఛన్‌కు అర్హులని జాబితా విడుదల చేయగా నలుగురే లబ్ధిదారులని చెప్పడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పంపిణీ చేయకుండానే అధికారులు వెనక్కిమళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement