గజ్వేల్: అర్హులందరికీ ‘ఆహార భద్రత’ కార్డులను అందిస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పలు కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పీఎన్‌ఆర్ గార్డెన్స్‌లో ‘ఆహార భద్రత’పథకం కింద లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు.
అంతకుముందు పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ ‘ఆహార భద్రత’ పథకంపై పచ్చ పార్టీ నాయకులు కార్డులను తొలగిస్తున్నరంటూ చేస్తున్న దుష్పప్రచారం నమ్మవద్దని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ ఉనికి కోల్పోతుందనే భయంతోనే వారు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని టీడీపీ నాయకులనుద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేషన్ కార్డులపై 20కిలోల బియ్యం సీలింగ్‌ను ఎత్తేసి ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. హాస్టల్ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తనలాగే నాణ్యమైన భోజనం తినాలనే సంకల్పంతో సీఎం సన్న బియ్యం అందిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించగలిగితే వారు చదువులో రాణించే అవకాశముందని పేర్కొన్నారు. కేసీఆర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు.
భవిష్యత్తులో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ, గజ్వేల్ తహశీల్దార్ బాల్‌రెడ్డి, ఎంపీపీ అధ్యక్షుడు చిన్న మల్లయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు రజిత, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, కౌన్సిలర్లు బోస్, నరేందర్‌రావు, సంతోషిణి, టీఆర్‌ఎస్ నాయకులు ఆకుల దేవేందర్, బెండ మధు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆహార భద్రత
Published Fri, Jan 2 2015 1:36 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement