సాక్షి, హైదరాబాద్: ఆహారభద్రత కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హులైన కుటుంబాలకు ఈ కార్డుల జారీతో పాటు వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత కార్మికులకు పింఛన్లు మం జూ రు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మార్గదర్శకాలు ఇవీ...
ఆహారభద్రత కార్డుల కోసం లబ్ధిదారులు తమ పూర్తి వివరాలతో ఆయా మండలాల తహశీల్దార్లకు, పెన్షన్ల కోసం ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ విషయమై ఆయా గ్రామాల వీఆర్వోలు, గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారులు కరపత్రాలు, గోడపత్రికల ద్వారా విస్తృతమైన ప్రచారం కల్పించాలి. దరఖాస్తులను ఈనెల 15వరకు సేకరించాలి. ఆహారభద్రత కార్డుల జారీకి తహశీల్దారు, పెన్షన్ల మంజూరుకు ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
వెరిఫికేషన్ అధికారులు ఈ నెల 16 నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి 30 లోగా పూర్తిచేయాలి. వెరిఫికేషన్ సమయంలోనూ అధికారులు(అంతకు మునుపు దరఖాస్తు ఇవ్వని వారి నుంచి)దరఖాస్తులు స్వీకరించవచ్చు.
2.5ఎకరాల మాగాణి లేదా ఐదెకరాల మెట్ట భూమి లేదా రెండూ కలిపి ఐదెకరాలకు మించకూడదు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, ప్రభుత్వ పింఛన్లు, స్వాతంత్య్ర సమరయోధులుగా పిం ఛన్లు పొందేవారు, కార్లుఉన్నవాళ్లు వీటిని పొందేందుకు అనర్హులు.
వితంతువులు, వికలాంగులు మినహా కుటుంబంలో ఒకరికే(మహిళ ఉంటే) పింఛను పొందే అవకాశం. 65ఏళ్లు, ఆపై వయస్సు వారే వృద్ధాప్య పింఛనుకు అర్హులు.
లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంతా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జరుగనుంది. ఈనెల 15నుంచి వెరిఫికేషన్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.అవసరమైన మేరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, సూపర్‌వైజరీ అధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.
ఆహారభద్రత కార్డులు ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించినవే కానీ, ఏ ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇవి వర్తించవు. మరే ఇతర అవసరాలకు పనికిరావని పేర్కొన్నారు.