గ్రామాల్లో లక్షన్నర.. పట్టణాల్లో 2 లక్షలు | new system of food security will be started from next month | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో లక్షన్నర.. పట్టణాల్లో 2 లక్షలు

Published Sun, Nov 2 2014 1:28 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

గ్రామాల్లో లక్షన్నర.. పట్టణాల్లో 2 లక్షలు - Sakshi

గ్రామాల్లో లక్షన్నర.. పట్టణాల్లో 2 లక్షలు

ఏడున్నర ఎకరాల్లోపు మెట్ట, మూడున్నర ఎకరాల్లోపు తరి పొలం ఉన్నవారికీ రేషన్ కార్డులు
 ఒక్కొక్కరికి ఇచ్చే బియ్యం 4 నుంచి 6 కిలోలకు పెంపు
 కుటుంబానికి 20 కిలోల సీలింగ్ ఎత్తివేత..
  ఎందరుంటే అందరికీ 6 కిలోల చొప్పున బియ్యం
  రేషన్‌కార్డులు ఇక బియ్యం, నిత్యావసరాలకే పరిమితం
  నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల జారీ..
  వచ్చే నెల నుంచి కొత్త విధానం అమలు
  కేబినెట్ ఉపసంఘం సిఫార్సులకు సీఎం ఆమోదం: ఈటెల
 
 సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు పొందేందుకు పేదల ఆదాయ పరిమితిని భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తెల్ల రేషన్‌కార్డు పొందేందుకు వార్షిక ఆదాయ పరిమితి గ్రామాల్లో రూ. 60 వేలలోపు, పట్టణాల్లో రూ. 75 వేలుగా ఉండేది... దీనిని గ్రామాల్లో రూ. లక్షన్నరకు, పట్టణాల్లో రూ. 2 లక్షలకు పెంచారు. దీంతోపాటు కుటుంబంలో ఒక్కోవ్యక్తికి ఇచ్చే బియ్యం కోటాను కూడా ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఒక్కొక్కరికి ఇస్తున్న 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలకు పెంచారు. ఇక ఇప్పటివరకు కుటుంబంలో ఎంత మంది ఉన్నా గరిష్టంగా 20 కిలోల వరకు మాత్రమే బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సీలింగ్‌ను రద్దు చేశారు. కుటుంబంలో ఉన్నవారందరికీ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తారు. ఉదాహరణకు ఆరుగురు ఉంటే 6 కిలోల చొప్పున 36 కిలోలు ఇస్తారు. రేషన్‌కార్డులకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం శనివారం తమ నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించింది. అనంతరం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మంత్రులు నాయిని, జోగు రామన్నతో కలిసి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
 
 తాము చేసిన సిఫారసులన్నింటినీ సీఎం ఆమోదించారని ఆయన చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్నట్లుగానే రూపాయికి కిలో బియ్యం అందజేస్తామన్నారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని... కుటుంబంలో ఎందరున్నా 20 కిలోలకు మించి ఇవ్వకూడదనే సీలింగ్ పద్ధతిని ఎత్తివేశామని ఈటెల చెప్పారు. పిల్లలు హాస్టళ్లలో ఉన్నా, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం చేసే పిల్లలున్నా.. వారిని మినహాయించబోమని, వారితో కలిపి కుటుంబ సభ్యులందరికీ బియ్యం ఇస్తామని వెల్లడించారు. బియ్యంతో పాటు గోధుమలు, పంచదార, కందిపప్పు, అయోడిన్ ఉప్పు కూడా ఇస్తామన్నారు. రేషన్‌కార్డు మంజూరు చేయడానికి ఆదాయ పరిమితిని గ్రామాల్లో రూ. లక్షన్నరకు, పట్టణాల్లో రూ. రెండు లక్షలకు పెంచుతున్నామని ఈటెల తెలిపారు. పెన్షన్‌దారులకు కూడా ఇదే ఆదాయ పరిమితి వర్తిస్తుందన్నారు. ఏడున్నర ఎకరాలలోపు మెట్ట పొలం, మూడున్నర ఎకరాలలోపు తరి పొలం ఉన్నవారికి కార్డులు ఇస్తామన్నారు.
 
 డిసెంబర్ నుంచి కొత్త విధానం..
 
 ఆధార్‌కార్డులకు రేషన్‌కార్డులకు లింకు ఉన్నందున.. ఆధార్‌కార్డులు లేనివారికి ఎటువంటి ప్రత్యామ్నాయం కల్పించాలనే దానిపై అధికారులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేస్తామని ఈటెల తెలిపారు. ఏదైనా కారణాలతో బియ్యం కార్డు రాకుంటే మళ్లీ కార్డులు అందిస్తామని చెప్పారు. కార్డుల జారీ నిరంతర ప్రక్రియని స్పష్టం చేశారు. దీనిపై కొన్ని పార్టీలు, గిట్టని పత్రికల విషప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు, కార్లలో తిరిగేవారు, భవనాల్లో నివసించే వారికి కార్డులు ఇవ్వబోం. పేదలకు కార్డులు నిరాకరించినా, ధనికులకు కార్డు లిచ్చినా సంబంధిత అధికారిదే బాధ్యత. కొత్త రేషన్ కార్డులు గులాబీ రంగులో, తెలంగాణ లోగోతో, ప్రభుత్వ ముద్రతో ఉంటాయి. డిసెంబర్ నుంచి కొత్త రేషన్ అమల్లోకి వ స్తుంది..’’ అని ఈటెల తెలిపారు.
 
 డీలర్ల అవినీతికి చెక్
 
 రేషన్ డీలర్ల అక్రమాలను అరికడతామని.. ఇందుకోసం ఈ-పాస్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈటెల వివరించారు. జీపీఎస్ విధానం ద్వారా పనిచేసే ఈ పరికరాలతో.. ప్రతి కిలో బియ్యం పేదలకు చేరుతుందా లేదా? అనేది పర్యవేక్షించవచ్చని చెప్పారు. దీంతో బియ్యాన్ని బయట అమ్ముకోవడానికి చెక్ పడుతుందన్నారు. బ్రోకర్లకు బియ్యం చేరితే సహించబోమని, డీలర్ల లెసైన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. డీలర్లకు ప్రస్తుతం కిలో బియ్యంపై ఇస్తున్న 20 పైసల కమీషన్‌ను పెంచనున్నామని మంత్రి తెలిపారు. రైస్ మిల్లర్ల విషయంలోనూ త్వరలో ఒక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.
 
 రేషన్‌కార్డులు సరుకులకు మాత్రమే..
 
 తెల్ల రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులను వేరుగా మంజూరు చేస్తామని ఈటెల చెప్పారు. రేషన్‌కార్డులు బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల కోసమేనని... విద్యార్థుల ఫీజుకు, ఆరోగ్యశ్రీకి వీటితో సంబంధం ఉండదని వెల్లడించారు. సమగ్ర సర్వే ప్రభుత్వానికి డాక్యుమెంట్ వంటిదని, దాని ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. వితంతు, వృద్ధాప్య పింఛన్లను రూ. వెయ్యికి, వికలాంగులకు రూ. 1,500కు పెంచామన్నారు. చేనేత, కల్లుగీత కార్మికులు సొసైటీల్లో లేకపోయినా 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ ఇస్తామన్నారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement