ఇల్లెందు: ఇప్పటి వరకు బాలింతలు, పసి పిల్లలకే కేసీఆర్ కిట్లు అందజేశారు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా, గురుకుల విద్యాలయాల విద్యార్థులకు కూడా కిట్లు అందజేస్తున్నారు. అయితే ఈ రెండు కిట్లకు ఏమాత్రం పొంతన లేదు. విద్యార్థులకు కాస్మొటిక్స్‌ను కేసీఆర్ కిట్ రూపంలో అందజేస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒక కిట్ చొప్పున అందజేస్తారు. బాలికలకు అందజేసే కిట్లలో సబ్బులు, షాంపూలు, పౌడర్, క్రీమ్, కొబ్బరినూనె, రబ్బర్ బ్యాండ్లు, మస్కిటో కాయిల్స్, టూత్‌పేస్టు, బొట్టుబిల్లలు, లిక్విడ్, దువ్వెన ఉంటాయి. బాలురకు ఇచ్చే కిట్లలో సబ్బులు, దువ్వెన, కొబ్బరి నూనె ఉన్నాయి. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 20, 600 మంది విద్యార్థులుండగా ఇందులో 12, 200 మంది బాలికలు, 8, 400 మంది బాలురు ఉన్నారు.
చెన్నెంగులగడ్డ, రొంపేడులో పంపిణీ...
ఇల్లెందు మండలంలోని చెన్నెంగులగడ్డ, రొంపేడు పాఠశాలల్లో శనివారం ఐటీడీఏ డీడీ సీహెచ్ రామ్మూర్తి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని అన్ని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ఈ నెలాఖరు నాటికి ప్రతి విద్యార్థికి అందజేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉంటూ చదువుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో చెన్నెంగులగడ్డ, రొంపేడు, ఇల్లెందు బాలికల ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎం, వార్డెన్‌లు సోమశేఖర్.హరాజ్య, సునిత, వెంకన్న, రూపాదేవి, రాకం శ్యామ్‌బాబు, అలివేలు మంగ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment