
ఆశల కొలువు
డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సంకాంత్రి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయొచ్చన్న విద్యాశాఖ మంత్రి ప్రకటన ఆశలు రేపింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సంకాంత్రి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయొచ్చన్న విద్యాశాఖ మంత్రి ప్రకటన ఆశలు రేపింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
నల్లగొండ అర్బన్ : ‘‘రేషనలైజేషన్ పూర్తి చేసి సంక్రాంతి తర్వాత డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. వచ్చే విద్యాసంవత్సరం నాటికి భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తాం’’
- విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి
రేషనలైజేషన్ తర్వాత టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే తప్ప భర్తీ ప్రక్రియ ప్రశ్నార్థకం కాగలదనే విశ్లేషణలతో డీలాపడ్డ నిరుద్యోగులకు విద్యాశాఖమంత్రి ప్రకటనతో ఒకింత ఆశలను పదిలం చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కెరీర్ ప్రారంభించడానికి వీలు కల్పించే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ కోసం జిల్లాలో ఉద్యోగార్థులు ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నారు. 2012 ఆగస్టులో జరిగిన డీఎస్సీ తర్వాత రెండున్నరేళ్లుగా అదిగో, ఇదిగో నోటిఫికేషన్ విడుదల అంటూ దోబూచులాడటం తప్ప ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడింది. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వెలువడవచ్చునని సమాచారంతో ఆశలు చిగురించాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కోచింగ్ సెంటర్లు సైతం కొత్త బ్యాచ్‌లను ప్రారంభించాయి. మినీ సివిల్స్‌గా భావించే డీఎస్సీ పరీక్షకు వేలల్లో పోటీ ఉండే అవకాశం ఉంది.
జిల్లాలో 1,530 పోస్టులు ఖాళీ...
జిల్లా విద్యాశాఖ వారి వద్ద ఉన్న గణాంకాల ప్రకారం 2014 అక్టోబర్ 25వ తేదీ వరకు జిల్లాలో 1,530 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు కూడా ఉన్నాయి. అయితే వచ్చే 2015 జూన్ వరకు ఏర్పడే ఖాళీలను కూడా కలిపి నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ప్రకటించడాన్ని బట్టి ఖాళీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ఖాళీలు ఎస్జీటీ-1193, లాంగ్వేజ్ పండిట్లు హిందీ-35, ఉర్దూ-02, పీఈటీ - 34 ఉన్నాయి.
స్కూల్ అసిస్టెంట్లు 305 పోస్టులు ఖాళీ ...
స్కూల్ అసిస్టెంట్లు 305 ఖాళీలుండగా 70 శాతం నేరుగా (213 పోస్టులు), 30 శాతం (92 పోస్టులు) పదోన్నతిపై భర్తీ చేయనున్నారు. బయోసైన్స్ - 30, ఇంగ్లీష్ - 14, హిందీ - 13, తెలుగు - 22, మ్యాథ్స్ - 31, ఫిజికల్ సైన్స్ -12, సోషల్ -91 ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయవచ్చు. ఇవి కాకుండా క్రాఫ్ట్‌ఇన్‌స్ట్రక్టర్లు - 53, మ్యూజిక్ - 03, డ్రాయింగ్ మాస్టర్లు - 21 ఖాళీలున్నా వాటిని భర్తీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.
‘టెట్’పై రాని స్పష్టత...
ఈసారి టెట్, డీఎస్సీలకు కలిపే పరీక్ష నిర్వహిస్తారా...? లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 2012 డీఎస్సీలో 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులను ‘టెట్’ మెరిట్ ఆధారంగా భర్తీ చేశారు. టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహణపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో నేరుగా 100 మార్కులకు డీఎస్సీ నిర్వహించవచ్చునని భావిస్తున్నారు.