
త్వరలో అసెంబ్లీకి ఎస్టీ రిజర్వేషన్ బిల్లు
గిరిజనులకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే బిల్లును త్వరలోనే అసెంబ్లీ ముందుకు తెస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే బిల్లును త్వరలోనే అసెంబ్లీ ముందుకు తెస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. రిజర్వేషన్ల అమలు కోసం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిషన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, దళిత, గిరిజ నుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం తరఫున జగదీశ్‌రెడ్డి ప్రకటన చేశారు.
దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల్లో చదువుకున్న విద్యార్థులను కాంట్రా క్టర్లుగా చేయాలన్న ఆలోచనతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు తెస్తున్నామని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని వెల్లడించారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని తండాలను గ్రామ పంచాయతీలుగా మారు స్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.