
అనుమానాలు అక్కర్లేదు
విద్యుత్ ఒప్పందాలపై జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. పవర్ ఫీవర్ పట్టుకున్న కొందరు వ్యక్తులు చేస్తున్న విమర్శల గురించి ప్రజలకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం శాసన సభలో బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపే సందర్భంగా సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. విద్యుత్ కొనుగోళ్లు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత ్వంతో ఒప్పందం, భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
రాష్ట్ర ప్రజల అవసరాలకోసం విద్యుత్‌ను కొనుగోలు చేసి అందిస్తున్నామని, ఎక్కువ ధరలకు ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేసిన విద్యుత్‌లో యూనిట్‌కు అధిక ధర చెల్లించింది ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీకేనని చెప్పారు. ఇతర సంస్థలనుంచి గరిష్టంగా యూనిట్‌కు రూ.5.99 చొప్పున కొనుగోలు చేయగా, ఎన్టీపీసీ నుంచి మాత్రం రూ. 6.80కి తీసుకున్నట్లు తెలిపారు. ఎన్‌సీసీ థర్మల్ పవర్‌నుంచి 8 సంవత ్సరాల కోసం యూనిట్ ధర రూ. 4.15 చొప్పున కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొన్నట్లు జగదీశ్‌రెడ్డి చెప్పారు. అదే పక్కన ఏపీ ప్రభుత్వం రూ. 4.20 యూనిట్ చొప్పున 20 ఏళ్లకు ఒప్పందం చేసుకుందన్నారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కొందరు తప్పు డు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దేశంలో అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉన్నా, ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు లైన్లు లేని పరిస్థితి ఉందని, ఉత్తర, దక్షిణ గ్రిడ్ అనుసంధానం కోసం లైన్ అవసరం ఉందని, అందుకోసం దీర్ఘకాలిక ఒప్పందం కోసం వెళ్లినట్లు చెప్పారు. బీహెచ్‌ఈఎల్ సంస్థ 270 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కొనుగోలు చేస్తే నష్టం లేదని అందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘కుడా’ ద్వారా పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
మూసీ అభివృద్ధి, సుందరీకరణ కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ లక్షాయాభైవేల కోట్ల రూపాయలతో పూర్తవుతాయని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో రూ. 35 వేల కోట్ల వరకు కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు. గడువులోగా వీటిని పూర్తి చేస్తామన్నారు. జానారెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రేవంత్‌రెడ్డిలు మంత్రుల వివరణకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. ప్రజలకు నిజాలు తెలిసేం దుకే తాను ప్రశ్నిస్తున్నానే తప్ప రాజకీయ కోణంలో కాదని జానారెడ్డి సభకు తెలిపారు.