పదవులేవీ.. గుర్తింపేదీ..!
- టీఆర్‌ఎస్ వలస నేతల్లో అసంతృప్తి
- అధినేత దర్శనమే గగనమైందంటూ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: ‘‘నామినేటెడ్ పదవుల న్నారు. వాటి ముచ్చట అటుంచి పార్టీ పద వులకు కూడా దిక్కులేదు. మమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చిన నేతలకే దిక్కూ మొక్కు లేదు. మాకే కాదు, వారికి కూడా అధినేత అపాయిం ట్‌మెంటే దొరకడం లేదు. ‘పాత–కొత్త నేతల కలయిక’ నినాదం మాటలకే పరిమితమైంది. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు’’ – అధికార టీఆర్‌ఎస్‌లోకి పలు పార్టీల నుంచి వచ్చి చేరిన నేతల్లో పలువురి ఆవేదన ఇది. పట్టించుకునే వారు లేక, పదవుల్లేక, గుర్తింపూ లేక చివరికి అనామకంగా మిగిలి పోయామన్న నైరాశ్యం వారిలో వ్యక్తమవు తోంది.
బంగారు తెలంగాణ పునర్నిర్మాణం, రాజకీయ పునరేకీకరణ పేర కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చు కోవడం తెలిసిందే. తామొక్కరమే చేరితే గుర్తింపు ఉండదేమోననే భావనతో తమ అనుచరులు, స్థానిక సంస్థల ప్రజాప్రతి నిధుల్లోని అస్మదీయుల్ని కూడా టీఆర్‌ఎస్ లోకి వెంటతెచ్చుకున్నారు. వారిలో ముఖ్యుల నుకున్న వారికి నామినేటెడ్ పదవులిచ్చేలా టీఆర్‌ఎస్ పెద్దల నుంచి హామీ తీసుకుని మరీ చేరారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తిరగబడిందంటూ వారు వాపోతున్నారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికే ఎక్కువ పదవులు దక్కాయి.
వ్యవసాయ మార్కెట్ల పాలక మండళ్లలోనైతే కొత్తవారికి నామమాత్రంగా కూడా అవకాశం దక్కలేదు. దీనికి తోడు వలస వచ్చిన ఎమ్మెల్యేల్లో పలువురు తమకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శనం కూడా లభించడం లేదని వాపోతున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇదేమిటం టూ తమను పార్టీలోకి తీసుకొచ్చిన నేతలతో వాదులాటకు దిగుతున్నారు.
పార్టీ పదవులకూ చుక్కెదురే
తొలి నుంచీ టీఆర్‌ఎస్‌లో పనిచేసిన, ఎన్నిక ల్లో గెలుపు అనంతరం పలు పార్టీల నుంచి వచ్చి చేరిన ‘పాత–కొత్త’ నేతలు పాలూ నీళ్లలా కలిసిపోయి పని చేయాలని కేసీఆర్ ఒకటికి రెండుసార్లు పార్టీ వేదికలపై చెప్పారు. కానీ వారు కలిసిపోయిన దాఖలాలు మాత్రం లేవు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఈ పాత, కొత్త నేతల మధ్య ఒకరకమైన విభజన స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ కమిటీల నియామకం కోసం అధినాయకత్వం ప్రతిపాదనలు అడిగినప్పుడు కూడా మెజా రిటీ జిల్లాల్లో పలువురు మంత్రులు పాతవారి, తమ దగ్గరివారి పేర్లతోనే జాబితాలు పంపిం చారంటున్నారు.
వలస నేతలకు ప్రాధాన్య మివ్వలేదని, వారి అనుచరుల పేర్లను పక్కన పెట్టారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగిం ది. దాంతో ఇలా వలస వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో పలువురు తమ పాత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతోనే సాన్నిహిత్యం నెరుపు తున్నారని, అవకాశం చూసుకుని పాత గూటికి చేరుకునే ప్రయత్నాలూ చేస్తున్నారని టీఆర్‌ఎస్ వర్గాల్లో విన్పిస్తోంది. ముఖ్యంగా పాత వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల విషయంలో ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది.
తాజాగా నల్లగొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొంటున్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య పొసగడంలేదన్న ప్రచారం బాహాటం గానే జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మిన హా మిగతా జిల్లాల్లో ఈ అసంతృప్తి బాగానే ఉందని సమాచారం. అయితే కొందరు వలస ఎమ్మెల్యేలు తమ అనుచరుల నుంచి త్రీవమైన ఒత్తిడి ఉన్నా సముదాయిస్తూ సమయం కోసం వేచిచూస్తున్నారు. కనీసం పార్టీ పదవులిచ్చినా తమపై కొంత ఒత్తిడి తగ్గేదని వారంటున్నారు.