సాక్షి, హైదరాబాద్: నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు ఏకతాటి మీదకు రావడం పీతల కలయిక వంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి శానా సైదిరెడ్డితో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్‌లో కూడా మీడియాతో ముచ్చటించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఎన్ని పీతలు ఏకమైనా తమను ఏమీ చేయలేవని.. గెలిచేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ప్రస్తుత ఉప ఎన్నికను ముడిపెట్టొద్దని, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల తరహాలో ప్రజలు టీఆర్‌ఎస్ వెంట ఉంటారన్నారు. ‘హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే. ఎంత మెజార్టీ సాధిస్తామని పోలింగ్ తేదీ సమీపించినపుడు వెల్లడిస్తాం. కాంగ్రెస్‌తోనే మాకు అక్కడ పోటీ.. బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనుభవంతో తగు జాగ్రత్తలు తీసుకుంటాం.మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు’అని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
గెలుపు మాకు బూస్టప్..
హుజూర్‌నగర్ నియోజవర్గాన్ని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని, స్థానిక శాసనసభ్యుడి కృషి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జగదీశ్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లో తమ కార్యకర్తలను టీఆర్‌ఎస్ బెదిరింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలన్నారు. టీఆర్‌ఎస్ రాజకీయ గొడవలకు పూర్తి దూరంగా ఉంటుందని, 2014 తర్వాత హుజూర్‌నగర్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు లేదన్నారు. హుజూర్‌నగర్‌లో గెలుపుతో తమకు బూస్టప్ వస్తుందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పోటీ అంశంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.
సీఎంను కలిసిన సైదిరెడ్డి
హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి శానా సైదిరెడ్డి శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయం తెలుసుకున్న సైదిరెడ్డి మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. అనంతరం మంత్రితో పాటు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారం, సమన్వయంలో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవడంతో పాటు, అందరినీ కలుపుకొనివెళ్లి విజయం సాధించాలని సీఎం సూచించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment