సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పాలనలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఉనికి కోల్పోయిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత శాఖను రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీనియర్‌లైన దళిత శాసనసభ్యులు 15 మంది ఉన్నారని, అలాంటి వారిని పక్కనపెట్టి ఒక్కసారి ఎమ్మె ల్యేగా గెలిచిన జగదీశ్‌రెడ్డిని దళిత మంత్రిగా నియమించడంలో ఆంతర్యమేమిటన్నారు.
జగదీశ్‌రెడ్డిని తొలగించకుంటే ఉద్యమం
ఎస్సీ అభివృద్ధి శాఖకు ఏటా రూ. 15 వేల కోట్ల బడ్జెట్ ఉందని, అంతటి పెద్ద శాఖకు ప్రాతినిధ్యం వహించే జగదీశ్‌రెడ్డి డిల్లీ వెళ్లినప్పుడు కేవలం విద్యుత్ శాఖ మంత్రిగా చలామణి కావడం, అందుకు సంబంధించిన కేంద్ర మంత్రులు, అధికారులను మాత్రమే కలవడం జరుగుతుందని, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా వెళితే అతన్ని దళితుడు అనుకుంటారనే ఉద్దేశంతో అలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. వెంటనే జగదీశ్‌రెడ్డిని మంత్రిపదవి నుంచి తొలగించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎస్సీ అభివృద్ధి శాఖకు కేటాయించిన నిధులు పూర్తిగా దారి మళ్లుతున్నాయన్నారు. జనాభాలో కేవలం ఒకశాతం ఉన్న వెలమ సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం మెజారిటీ వర్గాలను అవమానించడమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment