న్యాయవిచారణ కోసం మంత్రి పదవినుంచి తొలగించాలి
సూర్యాపేట : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జగదీష్‌రెడ్డిపై న్యాయ విచారణ కోసం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని కరీనంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్‌చేశారు. గురువారం సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసం ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడారు. అవినీతి రహిత పరిపాలన అందించడానికి హిట్లర్‌ను అని చెప్పిన సీఎం ఎలాంటి ఆరోపణలు రాకపోయినా దళితుడైన రాజయ్యను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జగదీష్‌రెడ్డిని ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈనెల 28న లోకాయుక్త విచారణకు హాజరై ఆధారాలను చూపించనున్నట్లు పేర్కొన్నారు.
మంత్రి తన పది నెలల కాలంలో ప్రజా వ్యతిరేకిగా ముద్రపడడం వల్లనే సూర్యాపేటలో కరపత్రాలు వెలువడడం, ల్యాండ్ మాఫియా, అవినీతి పరులకు అండగా నిలుస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి జగదీష్‌రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై సీఎం ఎందుకు న్యాయ విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో సబ్సిడీపై 129 ట్రాక్టర్లు రైతులకు అందించగా.. అందులో అధికార పార్టీకి చెందిన 94 మందికి ట్రాక్టర్లు ఇచ్చారని తెలిపారు. దీనిపై సీఎం, విజిలెన్స్‌కు లేఖలు రాసినా కూడా ఏ మాత్రం స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. తక్కువ ధర కలిగిన నాసిరకమైన ట్రాక్టర్లు తెచ్చి వాటికి రూ. 9 లక్షల ధరలుగా నిర్ణయించి రైతులకు అంటగడ్డం ఎంతవరకు సమంజసమన్నారు.
వాటర్ గ్రిడ్ పనుల్లో ఆంధ్రాకు చెందిన వారికి ఏ విధంగా కాంట్రాక్టర్లు ఇచ్చారని సీఎంను ప్రశ్నించారు. పొన్నంపై వేసిన పరువు నష్టం కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రికి హితవుపలికారు. పొన్నంకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, మంత్రి జగదీష్‌రెడ్డి చేసిన అవినీతిని నిరూపించడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ వారం రోజులుగా జిల్లాలో వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కోర్టుకు హాజరు కానున్న పొన్నం ప్రభాకర్‌కు పార్టీ పరంగా శాంతియుతంగా ఆహ్వానం పలికేందుకు ముందుగానే పోలీసులను అనుమతి కోరగా..
అనుమతులు ఇవ్వకుండా రాజకీయం చేయడం న్యాయమాఅని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, తూముల భుజంగరావు, తండు శ్రీనివాసయాదవ్, చకిలం రాజేశ్వరరావు, గోపగాని వెంకటనారాయణగౌడ్, రవిబాబు, అబ్దుల్హ్రీం, బైరు వెంకన్నగౌడ్, అమ్జద్‌షాహీన్‌బేగం, షేక్ బాషా, అంగిరేకుల నాగార్జున, అయూబ్‌ఖాన్, అబూబకర్‌సిద్దీఖ్, నగిరె పిచ్చమ్మ, మంజుల, సువర్ణ, అన్నపూర్ణ, కిషోర్‌బాబు, మధు తదితరులు పాల్గొన్నారు.