దాహార్తి తీరింది..!
♦ బోరు అద్దెకు తీసుకుని నీటి సరఫరా
♦ మరో బోరుకు కూడా మరమ్మతులు
♦ రాజనాయక్ తండావాసుల్లో సంబరం
తుంగతుర్తి: పదేళ్లుగా తాగునీటి కోసం అల్లాడుతున్న ఆ తండా వాసుల దాహర్తి తీరింది. నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ఆ తండాకు పిల్లను కూడా ఎవరూ ఇవ్వడం లేదు. వారి ఆవేదనను వివరిస్తూ ‘పానీ చేనికన్.. ఛార్విన్ దేరేకొని’ శీర్షికన శనివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ క్రమంలో మంగళవారం తండాకు నీటి సరఫరా చేశారు. సూర్యాపేట జిల్లా లోని తిరుమలగిరి మండలం మారుమూల గ్రామమైన జలాల్‌పురం శివారు రాజనాయక్ తండాలో పదేళ్లుగా గిరిజనులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు.
తండాలో బోర్లు వేసినా నీరు పడకపోవడంతో కిలోమీటర్ల దూరం నడిచి వ్యవసాయ బావులు, బోర్ల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ సురేంద్రమోహన్.. నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరలో తండావాసుల నీటి కష్టాలు తీర్చాలని ఆదేశించారు.
దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సోమ, మంగళవారాల్లో తండాను సందర్శించి నీటి వనరులను సమీక్షించారు. తండాకు కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోరులో నీరు ఉండటంతో ఆ రైతును పిలిచి డబ్బులు చెల్లిస్తాం వేసవిలో నీటి సరఫరా చేయాలని కోరారు. అనంతరం తండా వెలుపల ఉన్న మరో బోరుకు మరమ్మతులు చేయడంతో కొద్దిగా నీరు వస్తోంది. ఈ రెండు బోర్లద్వారా తండాలోని ట్యాంక్‌ను నింపి మంగళవారం నీటిని సరఫరా చేశారు. నీటి సమస్య తీరడంలో ఆ తండావాసుల ఆనందానికి హద్దులు లేవు. నీటి సమస్య పరిష్కారానికి తోడ్పడిన సాక్షి దినపత్రికకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.
‘సాక్షి’కి కృతజ్ఞతలు
మా తండాకు 10 ఏళ్ల నుంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. సాక్షి పత్రిక వారు మా బాధలను తెలుసుకొని కథనాన్ని రాశారు. దీంతో అధికారులు స్పందించి మా తండాకు నీటిని సరఫరా చేశారు. సాక్షి పత్రికవారికి కృతజ్ఞతలు.
– మాలోతు హరిలాల్, రాజనాయక్ తండా
మాకు ఎంతో సంతోషంగా ఉంది
ఎన్నో సంవత్సరాలుగా నీటి కోసం ఇబ్బందులు పడ్డాం. వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించి, మా తండాకు నీటిని తెచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా. కిలోమీటర్ దూరం నడిచే బాధ తీరింది.
– మాలోతు బుజ్జి, రాజనాయక్ తండా