సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అవసరమయ్యే భూమిని ఈ నెలాఖరులోగా కొనుగోలు చేయాలని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సాగునీటి పారుదల అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి తన చాంబర్‌లో డిండి ఎత్తిపోతల పథకంపై జిల్లా ప్రజాప్రతినిధులు, ఇంజినీరింగ్ నిపుణులు, సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి 26 వేల ఎకరాలు అవసరం కాగా.. దీంట్లో నల్లగొండ జిల్లాలో 16 వేలు, మహబూబ్‌నగర్ జిల్లాలో పదివేల ఎకరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ మొత్తం భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు మొదట విడత రూ.100 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఐదు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంది. దీంట్లో మొదటి రిజర్వాయర్ సింగరాయపల్లి, రెండోది గొట్టిముక్కల, మూడో రిజర్వాయర్ అర్కపల్లి, నాలుగైదు రిజర్వాయర్లు కిష్టరాంపల్లి, సువర్ణగూడెంలో నిర్మిస్తారు. ఈ ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి 15 వే ల ఎకరాల భూమి అవసరం. దీంతో పాటు డిండి ఎత్తిపోతల నుంచి చౌటుప్పుల్ వరకు ప్రధాన కాల్వ 90 కి.మీ మేర తవ్వుతారు. దీనికి 11 వేల ఎకరాలు కావాల్సి ఉంది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.6,190 కోట్లు కాగా...పనులు చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్టు పూర్తిఅయితే 3.50 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుంది. దీంట్లో నల్లగొండ జిల్లాలో మూడు లక్షలు ఎకరాలు కాగా..మహబూబ్‌నగర్ జిల్లాలో 50 వేల ఎకరాలు ఉంది. మంత్రి నిర్వహించిన ఈ స మావేశంలో ఇరిగేషన్ నిపుణుడు, రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, ఎమ్మార్పీ ఎస్‌ఈ పురుషోత్తం రాజు, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, పల్లా రాజేశ్వరరెడ్డి, కర్నె ప్రభాకర్, జిల్లా నీటి పారుదల అధికారులు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.
‘డిండి’ భూసేకరణ వేగవంతం
Published Wed, Aug 5 2015 2:29 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement