ఆరు నెలల్లో పరిష్కరించాం | Problem solved in the six months | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో పరిష్కరించాం

Published Tue, Oct 6 2015 1:36 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

ఆరు నెలల్లో పరిష్కరించాం - Sakshi

ఆరు నెలల్లో పరిష్కరించాం

విద్యుత్ సమస్యపై మంత్రి జగదీశ్‌రెడ్డి
♦ విపక్షాలు లోపాలే వెతుకుతున్నాయని విమర్శ
♦ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎక్కువ విద్యుత్ ఇస్తున్నామని వెల్లడి
♦ డిస్కంలకు రూ.4 వేల కోట్ల రాయితీలిచ్చాం
♦ ‘సీలేరు’ కోసమే ఏపీలో ఏడు మండలాల విలీనం
♦ రాష్ట్రానికి విద్యుత్ రాకుండా బాబు కుట్రలు చేశారని మండిపాటు
 
 సాక్షి, హైదరాబాద్: రాత్రింబవళ్లు పని చేసి 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, నిరంతర సమీక్షలు, శ్రద్ధతోపాటు జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం సీఎండీల కృషితో ఇది సాధ్యమైందన్నారు. ఇంత చేసినా ప్రభుత్వాన్ని విపక్షాలు ప్రశంసించాల్సింది పోయి విమర్శలకు దిగుతున్నాయని, లోపాలు వెతికి నెపం నెట్టేం దుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వరినాట్లు వేయొద్దని సీఎం పిలుపునివ్వడం వల్లే విద్యుత్ సరఫరాలో రాష్ట్రం గట్టెక్కిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

2013-14తో పోలిస్తే తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014-15, 2015-16లో అధిక విద్యుత్ సరఫరా చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఉచిత విద్యుత్ కోసం గతంలో ఎన్నడూ డిస్కం లకు ఇచ్చిన రాయితీలు రూ.3 వేల కోట్లకు మించలేదని, 2015-16లో తాము రూ.4 వేల కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై సోమవారం శాసనసభ స్వల్పకాల చర్చలో మంత్రి జగదీశ్ రెడ్డి  ప్రసంగం చేశారు.  పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన 53.89 శాతం విద్యుత్ వాటాను ఇవ్వకుండా ఏపీ సీఎం ఇబ్బంది పెట్టారని, సీలేరు, కృష్ణపట్నం, సాంప్రదాయేతర ఇంధన ప్లాంట్ల నుంచి రావాల్సిన 1,559 మెగావాట్లకు గండి కొట్టారన్నారు. సీలేరు జల విద్యుత్కేంద్రం కోసమే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీ సర్కారు వీలినం చేసుకుందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.

 విద్యుత్‌పై లక్ష కోట్ల పెట్టుబడులు
 ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ విద్యుత్ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పటి వరకు కేవలం 2,282 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను మాత్రమే నిర్మించారన్నారు. తాము మాత్రం 2018-19 నాటికి రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 24,272 మెగావాట్లకు పెంచే దిశగా కొత్త ప్లాంట్లను నిర్మిస్తున్నామని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ విద్యుత్ రంగంలో ఉత్పత్తి, సరఫరా, పంపిణీ ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామన్నారు. మణుగూరు, దామరచర్ల, కొత్తగూడెంలలో తలపెట్టిన ప్లాంట్లకు పర్యావరణ, అటవీ అనుమతులు రికార్డు స్థాయిలో లభించాయన్నారు.

ఈ ప్లాంట్లకు బొగ్గు గనుల కోసం అన్వేషిస్తున్నామన్నారు. పునర్విభజన చట్టం హామీ ప్రకారం రామగుండంలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ ఏర్పాటు కానుందన్నారు. విద్యుదుత్పత్తి జరగకపోయినా రూ.వేల కోట్లను తమ వాళ్లకు కట్టబెట్టేలా గత పాలకుల హయాంలో పీపీఏలు జరిగేవన్నారు. తాము మాత్రం ప్రభుత్వ రంగంలోనే కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టామని, బీహెచ్‌ఈఎల్‌కు బాధ్యతలు అప్పగించామన్నారు. 2016 డిసెంబర్ నాటికి 3,300 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి పంటలకు పగలే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసి తీరుతామని ఆయన వివరించారు.
 
 విపక్షాలు లేకుండానే..
 విపక్ష సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో ఎంఐఎం మినహా ఇతర విపక్షాలు లేకుండానే సభలో విద్యుత్ అంశంపై ప్రభుత్వం చర్చ జరిపింది. తొలుత టీఆర్‌ఎస్ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, ఎన్.సత్యనారాయణ, వేముల వీరేశం మాట్లాడుతూ.. గత పాలకులు విద్యుత్ రంగంలో తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించారన్నారు. తెలంగాణలో బొగ్గు, నీళ్లు, నిధులతో ఏపీలో విద్యుత్ ప్లాంట్లను నిర్మించుకున్నారని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. విద్యుత్ కోసం ఏపీపై తెలంగాణ ఆధారపడేలా కుట్రలు చేశారని సత్యనారాయణ ఆరోపించారు. గత నాలుగు నెలలుగా పాతబస్తీలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయని ఎంఐఎం సభ్యుడు అహమ్మద్ పాషాఖాద్రి ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా.. త్వరలో నగర ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు.
 
 మిగులు విద్యుత్‌పై మండలి ప్రశంస
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే చీకట్లో మగ్గిపోవాల్సిందే అంటూ హేళన చేసిన వలస పాలకులకు కళ్లు బైర్లు కమ్మేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర విద్యుత్ అందిస్తున్నారని  శాసనమండలి అభిప్రాయపడింది. మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తయారు చేసేందుకు సీఎం నిరంతర కృషి చేస్తున్నారని టీఆర్‌ఎస్ సభ్యులు అభిప్రాయపడ్డారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ విద్యుత్ అంశంపై చర్చకు అవకాశం ఇచ్చారు.

సభలో మంత్రులు మినహా 12 మంది టీఆర్‌ఎస్ సభ్యుల్లో 10మంది మాట్లాడారు. సభ్యులు జనార్దన్, డి. రాజేశ్వర్‌రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డి, సలీం, రాములు నాయక్, వెంకటేశ్వర్లు, గంగాధర్ గౌడ్‌లు మాట్లాడుతూ మూడేళ్లలో 24వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ఆయన చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈచర్చ అనంతరం మండలి చైర్మన్ స్వామిగౌడ్ సభను వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement