సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని చర్యలు చేపడతామని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలపై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా టెట్‌ను నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే 2 టెట్‌ల వ్యాలిడిటీ ముగిసిపోయిందని, జూన్ గడిస్తే మరో టెట్ వ్యాలిడిటీ ముగిసిపోతుందని, ఇక టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో అనాథ పిల్లలు అనే వారే ఉండకూడదని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పాఠశాలల్లో డ్రాపవుట్స్, ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ లేకుండా చూడాలన్నారు. బడి మానేసే వారు ఎందుకు మానేశారో తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలుగా ఉండటానికి వీల్లేదని, ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుంటుందన్నారు. గురుకులాల్లో సీట్లు లేకపోయినా అలాంటి వారిని చేర్చుకునేలా సీఎం కేసీఆర్‌తో చర్చించి ప్రత్యేక ప్రవేశాలకు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రమాణాల పెంపునకు కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. మన విద్యార్థులు ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడేలా తీర్చిదిద్దాలన్నదే కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామకాలకు చర్యలు చేపడతామన్నారు. ఇతర దేశాలతో పోల్చినా మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:17 ఉందన్నారు.
నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు..
నాలుగేళ్లలో పరీక్షల నిర్వహణలో మార్పులు తెచ్చామని, ఈసారీ పరీక్షలను పక్కాగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందనారు. ఈసారి సీఎం కేసీఆర్ ప్రాధాన్య అంశాల్లో విద్య కూడా ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే మంత్రులు, ఎంఎల్‌ఏల కాలేజీలను మూసేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తప్పవన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యను అందించాలని, అందుకు అవసరమైన మార్పులను సిలబస్‌లో తీసుకురావాలని అన్నారు. నాలుగేళ్లలో చేపట్టిన సంస్కరణల వల్ల ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు పెరిగాయన్నారు. ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలపై స్పందిస్తూ అవి కాలేజీల వారీగానే ప్రవేశాలు ఉంటాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.ప్రైవేటు వర్సిటీల చట్టం తెచ్చామని, నిబంధనలను రూపొందించి ప్రైవేటు వర్సిటీలకు అనుమతిస్తామన్నారు. ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లలో తప్పుల విషయంలో స్పందిస్తూ ఎవరైనా విద్యార్థులకు నష్టం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామన్నారు. డిగ్రీలు పూర్తయ్యాక కూడా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే చర్యలు తప్పవన్నారు.
మీడియంపై లోతుగా పరిశీలన
తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకుంటుండగా, ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్న వాదనలు ఉన్నాయని, దీనిపై ఉన్నతస్థాయిలో మరింత లోతుగా చర్చించాల్సి ఉందన్నారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి మరోసారి సమావేశం నిర్వహించి తగిన చర్యలు చేపడతామన్నారు. మహిళా యూనివర్సిటీ విషయంలో తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులే కేటాయించామని, అయితే అవి విద్యాశాఖ పేరుతో రానుందున అలా భావిస్తున్నారన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి పాఠశాలకు మంచి నీటి కనెక్షన్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌కుమార్, ఉన్నత విద్యా మండలి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment