ఆత్మవిశ్వాసం పెంచుతాం
♦ అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అణగారిన వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందించడంతోపాటు... సమాజంలో వెనుకబడి ఉన్నామనే భావనను వారిలోంచి దూరం చేసేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి జి.జగదీశ్‌రెడ్డి చెప్పారు. దళితులకు భూపంపిణీలో ఈ ఏడాది వేగం పెంచుతామని తెలిపారు. అణగారిన వర్గాల్లో ఏర్పడిన ఆత్మన్యూనతాభావాన్ని దూరం చేసి అన్ని రంగాల్లో ఇతరులతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ రంగంలో తీసుకోబోయే చర్యలు, పలు ఇతర అంశాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సంక్షేమ రంగంలోని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ల పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేలా అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులను ప్రవేశపెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు.
స్పష్టమైన కార్యాచరణతో ముందుకు..
విద్యార్థులు పీజీ పూర్తిచేసేలోగా నచ్చిన వృత్తి, ఉద్యోగం లేదా ఇతర రంగంలో స్థిరపడేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగమే కావాలనే ఆలోచన నుంచి బయటపడేలా చేస్తామన్నారు. చదువు పూర్తయ్యేలోగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, కాలేజీ నుంచి బయటపడే నాటికి పూర్తిస్థాయి నైపుణ్యాన్ని సంతరించుకునేలా చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ దృష్టి అంతా ప్రధానంగా దానిపైనే ఉందని తెలిపారు. విద్యను అభ్యసించేందుకు అర్హులైన వారుంటే ఎక్కువ ఖర్చయినా భరించేందుకు వెనుకాడవద్దని... అర్హత లేని వారికి ఇచ్చి దుర్వినియోగం చేయవద్దని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారని చెప్పారు. ‘‘పరిశ్రమల శాఖ ద్వారా రూ.కోటి వరకు కూడా రుణాలిచ్చి దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేది సీఎం ఆలోచన. ఆ పారిశ్రామికవేత్తలు సమాజానికి రోల్‌మోడల్ గా నిలవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తాము ఎవరికన్నా తక్కువ కాదనే భావనను కలిగించి, వారిలోని భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని నింపే కృషి జరుగుతోంది. సమాజంలో అసలైన మార్పునకు అదే పునాది’’ అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
భూపంపిణీకి ఆటంకాలు తొలిగాయి
దళితులకు భూపంపిణీకి ఉన్న ఆటంకాలు తొలిగిపోయాయని, ఈ ఏడాది గణనీయమైన సంఖ్యలో భూములు ఇస్తామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఎస్సీలకు భూమి కొనుగోలు, అభివృద్ధి విషయంలో ఈ ఏడాది కచ్చితంగా వేగం పెంచుతామన్నారు. పథకం దుర్వినియోగం కాకూడదని ఉన్నతాధికారులు పెట్టిన నిబంధనల వల్ల ఇప్పటివరకు కిందిస్థాయి అధికారుల్లో అయోమయం నెలకొందని, ఇప్పుడు దానిని అధిగమించామని పేర్కొన్నారు. వినియోగంలో ఉన్న భూమి, నీటి వసతి ఉన్న భూమి అని చూడకుండా... సాగు కు అనువుగా ఉన్న భూమి ఉంటే చాలు పంపిణీ కోసం తీసుకోవాలని అధికారులను ఆదే శించామని తెలిపారు. నీటి వసతి, భూమి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దన్నారు. ఇక తాజా బడ్జెట్(2016-17)లో నిర్దేశించిన లక్ష్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేసే అవకాశం ఉందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి నిజంగా ఎంత ఆదాయం వస్తుందనేది ఈ ఏడాదే అర్థమైందని... ప్రభుత్వ ఆదాయం, సవాళ్లు ఏయే రంగాల్లో ఉన్నాయో 90శాతం పైగా అవగాహన ఏర్పడిందని తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకుని వాస్తవ దృక్పథంతో పెట్టిన బడ్జెట్ ఇదని, సీఎం ఆలోచనలు ఏమిటనేది అన్నిస్థాయిల్లో అధికారులకు అర్థమైంది కాబట్టి ఈ ఏడాది లక్ష్యాలు చేరుకోగలుగుతామని చెప్పారు.