శాసనమండలిలో సంక్షేమ పద్దులపై లఘు చర్చలో మంత్రులు
పూర్తిస్థాయిలో నిధులను ఖర్చు చేయాలని సభ్యుల సూచన
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలను అందించి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కేటాయించిన బడ్జెట్‌ను ఖర్చు చే సేందుకు చర్యలు చేపడతామని వివిధ సంక్షేమ శాఖల మంత్రులు తెలిపారు. శాసనమండలిలో సంక్షేమ పద్దులపై ఆదివారం జరిగిన లఘు చర్చలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని వక్ఫ్ భూములతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పి.సుధాకరరెడ్డి (కాంగ్రెస్), కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌లకు ఇస్తున్న రూ.51 వేలని రూ.75 వేలకు పెంచాలని ఫారుఖ్ హుస్సేన్ (కాంగ్రెస్) కోరారు.
కళ్యాణలక్ష్మికి ఇస్తున్న మొత్తాన్ని రూ.1.16 లక్షలకు పెంచాలని, ఎస్టీ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని రాములు నాయక్ (టీఆర్‌ఎస్) కోరారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతమున్న చట్టాలతోనే వాటిని రక్షించవచ్చునని అల్తాఫ్ రిజ్వీ (ఎంఐఎం) సూచించారు. ఏ కులమైనా, మతమైనా అభివృద్ధికి కొలమానం మంచి విద్య, శిక్షణ, ఆరోగ్యమని, ఈ దిశలో ఆయా వర్గాలను తీసుకెళ్లాలని రామచంద్రరావు (బీజేపీ) అన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను సక్రమంగా వ్యయం చేయని శాఖలు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ (కాంగ్రెస్) కోరారు.
రెండింతలు ఖర్చు చేశాం: ఎస్సీ అభివృద్ధి శాఖ జగదీశ్‌రెడ్డి
గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను రెండింతలు ఖర్చు చేశామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ‘సబ్‌ప్లాన్ కింద రూ.8,089 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.4,236 కోట్లు వ్యయం చేశాం. ఈ ఏడాది స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల ద్వారా 28 వేలమందికి రూ.283 కోట్ల రుణాలు అందించాం. తెలంగాణ ఏర్పడే నాటికే రూ.1,550 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయి. 2014-15లో రూ.2వేల కోట్లు ఇచ్చాం’ అని ఆయన వివరించారు.
కల్యాణలక్ష్మి కోసం రూ.300 కోట్లు
ఏప్రిల్ నుంచి బీసీలు, ఈబీసీల కళ్యాణలక్ష్మిని ప్రారంభిస్తున్నామని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న చెప్పారు. 26 సంచార జాతుల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నామని. ప్రస్తుత బడ్జెట్ రూ.2,170 కోట్లలో ఇప్పటివరకు రూ.1,250 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. విద్య, వైద్యంపై శ్రద్ధ తీసుకుంటున్నామని, 2015-16లో గిరిజన ఉపప్రణాళిక కింద రూ.2,664.33 కోట్లు విడుదల చేసి, వాటిని పూర్తిగా ఖర్చు చేశామని గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ చెప్పారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ఈ ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు.
సంక్షేమ నిధులన్నీ ఖర్చు చేస్తాం
Published Mon, Mar 28 2016 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM
Advertisement
Advertisement