‘ఈ రోజు ప్రతిపక్షాలది పైచేయి అయినట్లుంది. క్లాస్ టీచరు లేడు.. హెడ్ మాస్టరు రాలేదు. అందుకే అధికారపక్షంతో ప్రతిపక్షపార్టీ ఆడుకున్నది.
సాక్షి, హైదరాబాద్: ‘ఈ రోజు ప్రతిపక్షాలది పైచేయి అయినట్లుంది. క్లాస్ టీచరు లేడు.. హెడ్ మాస్టరు రాలేదు. అందుకే అధికారపక్షంతో ప్రతిపక్షపార్టీ ఆడుకున్నది. సభలోని టీచర్లంటే ప్రతిపక్ష సభ్యులకు భయం లేనట్లుంది’ అని మంత్రి జగదీశ్‌రెడ్డితో విలేకరులు సరదాగా వ్యాఖ్యానించారు. ఆదివారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం బయటకు వచ్చిన జగదీశ్ విలేకరులతో కాసేపు సరదాగా ముచ్చటిం చారు. క్లాస్ టీచరంటే ఎవరు.. హెడ్ మాస్టరంటే ఎవరు అని ఆసక్తిగా ఆయన అడిగారు. మంత్రి హరీశ్‌రావు క్లాస్ టీచరైతే, సీఎం కేసీఆర్ హెడ్‌మాస్టర్ అని విలేకరులు సమాధానం ఇచ్చారు. కరువు, సాంఘిక సంక్షేమం పద్దులపై చర్చల సందర్భంగా ప్రతిపక్షం దూకుడుగా ఉన్నట్లు కనిపించిందని ఓ సీనియర్ విలేకరి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల దగ్గర విషయం లేకనే లొల్లి చేస్తున్నాయని కొట్టిపారేశారు.
వారికి కావాల్సింది సభ వాయిదానే..
అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం విపక్ష సభ్యులకు కష్టంగా ఉన్నట్లుందని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సభ ఎందుకు నడుపుతున్నారని విపక్షాలు అడుగుతున్న ట్లు పేర్కొన్నారు. సభ వాయిదా పడాలనే వారి కోరికను మన్నించామని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగంపై సీఎం కేసీఆర్ వివరణ ఇస్తూ కాంగ్రెస్ తీరును ఎలా ఎండగట్టారో అంతా చూశారని, మొన్నటి గాయాలకు ఇవాళ మందు పూసుకునే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. సభలో సీఎం ఉంటే ఇవన్నీ జరిగేవి కావన్నారు. ‘వాస్తవానికి సీఎల్పీ నేత జానారెడ్డి సరైన లైన్లనే ఉన్నరు. కానీ కాంగ్రెస్ నేతలే ఆయనను ముందల పడనిస్తలేరు’ అని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీదే గెలుపని పేర్కొన్నారు.