గొల్లకురుమల సంక్షేమానికి పెద్దపీట
♦ గొల్లకురుమ యాదవ శంఖారావంలో హరీశ్‌రావు
♦ త్వరలో సబ్సిడీపై ఆవులు, బర్రెలు, మేకలు
♦ కేసీఆర్ మరో పదేళ్లు సీఎంగా ఉండాలని మల్లన్నను మొక్కండి
సాక్షి, మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అవుతోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గొల్లకురుమలకు బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లతో గొర్రె పిల్లలు ఇస్తామంటే కాంగ్రెస్ నాయకులు హేళన చేశారని మండిపడ్డారు. గొర్రె పిల్లలే కాదు సీఎం కేసీఆర్ త్వరలో గొల్లకురుమ యాదవులకు ఆవులు, బర్రెలు, మేకలు సబ్సిడీపై అందజేయనున్నట్లు ప్రకటించారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అఖిలభారత యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మురళీయాదవ్ ఆధ్వర్యంలో జరిగిన గొల్లకురుమ యాదవ శంఖారావ సభలో మంత్రి మాట్లాడారు.
కులవృత్తులను బలోపేతం చేస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌లో అన్ని కులవృత్తులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. మేకలు, గొర్రెలకు వైద్యం చేసేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గానికి సంచార అంబులెన్స్‌లు అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు. గొల్లకురుమల యాదవుల సంక్షేమానికి కృషి చేస్తున్న కేసీఆర్ కలకాలం ఆరోగ్యంగా ఉండాలని, మరో పదేళ్లు అధికారంలో ఉండాలని మల్లన్న, బీరప్ప దేవుళ్లను ప్రార్థించాలని గొల్లకురుమ యాదవులను మంత్రి హరీశ్‌రావు కోరారు.
గొల్లకురుమలను హేళన చేశారు
శాసనసభలో కాంగ్రెస్ నాయకులు గొల్లకురు మలను హేళన చేసేలా మాట్లాడారని పశుసంవర్థక, పాడిపరిశ్రమశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు గొల్లకురు మల సంక్షేమాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ దయామ యుడని, గొల్లకురుమల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. çసబ్బండవర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్ మినహా రాష్ట్రంలో ఇక ఏ పార్టీ అధికారంలోకి రాదని మంత్రి జోస్యం చెప్పారు.
విజయ డెయిరీ ద్వారా సేకరించే పాలకు వెనువెంటనే ప్రోత్సాహక డబ్బులు రూ.4 అందజేయనున్నట్లు తెలి పారు. కార్య క్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్, బాబూ మోహన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సమాఖ్య చైర్మన్ రాజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.