ప్రాజెక్టులను అడ్డుకునేవారిని రానీయొద్దు
ముంపు గ్రామాలప్రజలకు హరీశ్ పిలుపు
కామారెడ్డి: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని, పచ్చని పంటలు పండాలనే ఆకాంక్షతో గోదావరి జలాలను తీసుకురావడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్, టీడీపీ, జేఏసీ నేతలు అడ్డుతగులుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు అడ్డు తగులుతున్న శిఖండులను గ్రామాలకు రానీయొద్దని, వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం పర్యటించిన హరీశ్‌రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూరులో వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో నిర్మించిన స్వాగత తోరణాన్ని, జంగంపల్లి చెరువులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు.
బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్‌లో రూ.4.5 కోట్లతో నిర్మిం చిన 7,500 మెట్రిక్ టన్నుల గోదాంను, బస్సాపూర్‌లో రూ. 6 కోట్లతో నిర్మించే బస్సాపూర్ లిఫ్ట్ పనులకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో హరీశ్‌రావు మాట్లాడారు. గోదావరి నీటిని కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ ద్వారా, అక్కడి నుంచి కూడవెళ్లి వాగులోకి, ఎగువ మానేరును నింపి ఎత్తిపోతల ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లివ్వడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అధికారంలో ఉండగా ఎకరానికి 1.80 లక్షల పరిహారం ఇవ్వని కాంగ్రెస్, టీడీపీలు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు అడ్డుకునేందుకు ప్రయత్నిం చడం ‘షబ్బీర్ అలీ నీకు తగునా’... అంటూ ప్రశ్నించారు. కరువుతో తల్లడిల్లుతున్న నిజామాబాద్ ైరె తాంగానికి నీరును అందించే మల్లన్నసాగర్‌ను అడ్డుకుంటున్న షబ్బీర్ అలీకి ఈ జిల్లా రైతులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నాలుగు గ్రామాలతో రాజకీయాలు చేస్తే నాలుగు వేల గ్రామాలతో తిప్పి కొట్టి మల్లన్న సాగర్ పూర్తి చేస్తామన్నారు.
మంత్రి హరీశ్ ఆరడుగుల బుల్లెట్...
మోర్తాడ్: భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఆరడుగుల బుల్లెట్ అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చమత్కరించారు. మంత్రి నీటిపారుదల శాఖ పనులకు వెంట నే మంజూరు ఇస్తున్నారని అన్నారు. బుల్లెట్ బయటకు వచ్చిందంటే వేగంగా దూసుకుపోతుందని, ఫైళ్లపై సంతకాలను చేయడంలో మంత్రి చురుకుగా పని చేస్తున్నారని అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని గుమ్మిర్యాల్‌లో రూ.11.40 లక్షలతో చేపట్టనున్న గోదావరి నది ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ కవిత మాట్లాడారు.