తెలంగాణలో ఏ పార్టీ మిగలదు
టీఆర్‌ఎస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఖాళీ లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇక ఏ రాజకీయ పార్టీ మిగలదని, వచ్చేసారి కూడా అధికారం టీఆర్‌ఎస్ పార్టీదేనని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన బుధవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో అన్ని పార్టీల పని అయిపోయింది. వచ్చేసారి కూడా ప్రభుత్వం మాదే. 16 ఎంపీ స్థానాలూ గెలుచుకుంటాం. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి పోదు. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నిలదొక్కుకుంటుందేమో కానీ, టీడీపీకి మాత్రం ఆ అవకాశమే లేదు. మా పార్టీలో చేరడానికి రెండేళ్లుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎదురు చూస్తున్నారు.. ఏడాది కిందటే దరఖాస్తు చేసుకున్నారు.
అయితే పార్టీలో వారికి బెర్తు లేదు. సభ్యత్వ పుస్తకాలు కూడా ఎప్పుడో అయిపోయాయి. వారి అవసరం మాకేం ఉంది?... పీసీసీ చీఫ్ పదవి కోసం వారు లాబీయింగ్ చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ కల్లా రాజగోపాల్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అవుతాడేమో.. ’ అని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా సరఫరా చే స్తున్నామని, హైదరాబాద్ వంటి నగరాల్లో అప్పుడప్పుడు అంతరాయం జరుగుతున్నా అది కేవలం లైన్ల మార్పిడి పనుల కోసమేనని వివరించారు.