సాక్షి, ఖమ్మం : సాంఘిక సంక్షేమ శాఖ ఆన్‌లైన్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. వసతి గృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల లెక్క పక్కాగా ఉంచడంతోపాటు.. వారి వివరాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు పూనుకుంది. వసతి గృహంలో చేరిన ప్రతి విద్యార్థి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా గత ఏడాది నుంచి చర్యలు చేపట్టింది. అయితే కొత్త విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలంటే ఆధార్ కార్డుతోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉంటే.. వాటిని సంక్షేమాధికారులు ఎస్సీ సంక్షేమ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. ఆ ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి సమకూరే సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే కొత్త విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధానం ఒక్క ఎస్సీ సంక్షేమ శాఖలోనే ఉండడం, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో ఇలాంటి విధానం లేకపోవడంతో ఆ శాఖల్లో విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు.
జిల్లాలో 39 ప్రీ మెట్రిక్(పాఠశాలల విద్యార్థుల) వసతి గృహాలు ఉండగా.. వాటిలో మొత్తం 3,699 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా 3వ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారే. గత ఏడాది నుంచి ఆయా వసతి గృహాల్లో రెన్యూవల్ అయిన విద్యార్థులు 2,420 మంది ఉండగా.. కొత్తగా 1,279 మంది విద్యార్థులు వసతి గృహాల్లో చేరారు. అయితే పాత విద్యార్థుల వివరాలను రెన్యూవల్ చేయడమే కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. కొత్తగా చేరిన విద్యార్థుల విషయంలోనే సమస్యలు తలెత్తుతున్నాయి.
పత్రాల కోసం ఎదురుచూపులు..
ఎస్సీ వసతి గృహాల్లో చేరిన ప్రతి విద్యార్థి తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. పాఠశాల, కళాశాల విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకుంటేనే వసతి గృహంలో డైట్, సోప్, ఆయిల్ బిల్లులు విద్యార్థులవారీగా విడుదలవుతాయి. కొత్తగా వసతి గృహాల్లో చేరిన విద్యార్థులకు స్టడీ, కండక్ట్‌తోపాటు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అయితే విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం వారి ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. రెవెన్యూ అధికారులు వాటిని జారీ చేయడంలో జాప్యం చేస్తున్నారు.
దీంతో విద్యార్థులు తమ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వసతి గృహాల సంక్షేమాధికారులకు అందజేయలేకపోతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా అవి ఇంతవరకు జారీ కాకపోవడంతో వసతి గృహాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న రశీదు చూపించి చేరుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో విద్యార్థుల వివరాల నమోదు కోసం ధ్రువీకరణ పత్రాలు తప్పక అవసరం ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రెండు నెలలుగా నిలిచిన బిల్లులు..
ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు జూన్ 12వ తేదీన ప్రారంభం కాగా.. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే విద్యార్థులు చేరారు. గత ఏడాది వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల వివరాలు రెన్యూవల్ కావడంతో వారికి ప్రభుత్వం నుంచి డైట్, సోప్ అండ్ ఆయిల్ బిల్లులు మంజూరవుతున్నాయి. అయితే కొత్త విద్యార్థుల వివరా లు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో రెండు నెలలుగా వారికి విడుదల కావాల్సిన డైట్, సోప్, ఆయిల్ బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో వసతి గృహ సంక్షేమాధికారులు అప్పు తెచ్చి మరి వారికి డైట్‌ను అందించడంతోపాటు పలు వసతి గృహాల్లో సోప్, ఆయిల్ బిల్లులను చెల్లిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి డైట్ కింద నెలకు రూ.950, సబ్బులు, ఆయిల్ కింద రూ.75 చొప్పున అందించాలి. విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదైతేనే వారికి బిల్లులు విడుదల కానుండడంతో వసతి గృహ సంక్షేమాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు అప్పు తెచ్చి డైట్‌ను నిర్వహించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి..
ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చేరిన ప్రతి విద్యార్థి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో నమోదైన విద్యార్థికే డైట్, ఇతర బిల్లులు చెల్లిస్తారు. కొత్తగా చేరిన విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక విద్యార్థులు వివరాలు నమోదు కావడం లేదని సంక్షేమాధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాగానే సదరు విద్యార్థులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తాం.
– కస్తాల సత్యనారాయణ, ఎస్సీ వెల్ఫేర్ డీడీ
సడలింపు ఇవ్వాలి..
ఎస్సీ వసతి గృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్ చేస్తేనే బిల్లులు చెల్లిస్తారు. పలు కారణాలతో వసతి గృహాల్లో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. కొంత సడలింపు ఇచ్చి వివరాలు నమోదయ్యేలా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నిబంధనను తొలగించి, బిల్లులను విడుదల చేసి ఇబ్బందులను తొలగించాలి. అవసరమైన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలి.
– తుమ్మలపల్లి రామారావు, తెలంగాణ వసతి గృహాల సంక్షేమాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment