సంక్షేమానికి పెద్దపీట
బడ్జెట్‌లో రూ.30,592.46 కోట్లు
గతేడాదితో పోల్చితే 39 శాతం పెరిగిన కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ, మహిళాశిశు సంక్షేమ శాఖలకు కలిపి ఏకంగా రూ.30,592.46 కోట్లు కేటాయించింది. ఈ శాఖలకు గత బడ్జెట్ కేటాయింపులు రూ.21,949.64 కోట్లు కాగా.. తాజాగా 8,642.82 కోట్లు (39.37 శాతం) అదనంగా ఇచ్చారు.
కొత్తగా ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి
బడ్జెట్‌లో మార్పుల నేపథ్యంలో షెడ్యుల్డ్ కులాల (ఎస్సీ) సబ్‌ప్లాన్ స్థానంలో.. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీఎస్‌డీఎఫ్) విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సమగ్ర అభివృద్ధి చర్యల్లో భాగంగా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, దీనికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తామని.. నిధులు మిగిలితే వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేస్తామని స్పష్టం చేసింది. తాజా బడ్జెట్‌లో ఎస్సీల కోసం రూ.14,375.12 కోట్లు కేటాయించారు. 43 ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేసి ఎస్సీల సమగ్ర అభివృద్ధికి పాటుపడతామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రకటించారు. గతేడాది బడ్జెట్‌లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద కేటాయించినది రూ.10,483.96 కోట్లుకాగా.. ఈ సారి కేటాయింపులు రూ.3,891.16 కోట్లు అదనం.
గిరిజనాభివృద్ధికి పెరిగిన నిధులు
గిరిజన ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్) స్థానంలో కొత్తగా గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీఎస్‌డీఎఫ్)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం కొత్త పథకాల్ని ప్రవేశపెడతామని, వారికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తామని, మిగిలితే వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేస్తామని ప్రకటించింది. తాజా బడ్జెట్‌లో ఎస్టీఎస్‌డీఎఫ్‌కు రూ.8,165.87 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద రూ.1,766.16 కోట్లు అందుతాయని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రూ.5,579.5 కోట్లు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధికి రూ.9.28 కోట్లు కేటాయించింది. 2016–17 బడ్జెట్‌లో ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ప్రభుత్వం రూ. 6,171.15 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.1,994.72 కోట్లు అదనంగా ఇచ్చారు.
బీసీలకు నిధులు డబుల్
రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి నిధులను భారీగా పెంచింది. గతేడాది ఈ శాఖకు రూ. 2,537.51 కోట్లు మాత్రమే ఇవ్వగా.. తాజా బడ్జెట్‌లో అంతకు రెండింతలుగా రూ.5,070.36 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో కొత్తగా ఎంబీసీ (అత్యంత వెనుకబడిన కులాలు) కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ.. దానికి రూ.1,000 కోట్లు కేటాయించారు. కొత్తగా ప్రారంభం కానున్న బీసీ గురుకుల పాఠశాలల కోసం రూ. 161 కోట్లు ఇచ్చారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.753.31 కోట్లు, ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.252 కోట్లు కేటాయించారు.
మహిళా, శిశు అభివృద్ధికి కొంతే ఊరట
మహిళా, శిశు, వికలాంగ సంక్షేమ శాఖకు గతేడాది బడ్జెట్‌లో రూ.1,552.58 కోట్లు ఇవ్వగా.. ప్రస్తుతం రూ.1,731.50 కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ.881.77 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.849.72 కోట్లు కేటాయించారు. మహిళల సామాజిక భద్రత, సంక్షేమం కోసం రూ.106.36 కోట్లు, పౌష్టికాహార పంపిణీకి రూ.675.02 కోట్లు ఇచ్చారు. ఐసీడీఎస్ పథకానికి రూ.12 కోట్లు, గర్ల్ చైల్డ్ పరిరక్షణ పథకానికి రూ.10 కోట్లు కేటాయించారు.
మైనార్టీలకు అంతంతే!
మైనారిటీ సంక్షేమ శాఖకు గతేడాది రూ. 1,204.44 కోట్లు ఇవ్వగా.. తాజాగా రూ. 1,249.66 కోట్లు కేటాయించారు. తాజా కేటాయిం పుల్లో మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.180 కోట్లు, బ్యాంకుల ద్వారా ఇచ్చే రాయితీ రుణాలకు రూ.150 కోట్లు, ఉర్దూ అకాడమీకి రూ.23 కోట్లు, వక్ఫ్ బోర్డుకు రూ.50 కోట్లు కేటాయించారు. మైనారిటీ గురుకులాల కోసం రూ.425 కోట్లు, దావత్ ఏ ఇఫ్తార్, క్రిస్‌మస్‌కు రూ.30 కోట్లు, ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రూ.40 కోట్లు కేటాయించారు.