ఎస్సీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!
2016-17 బడ్జెట్ వివరణలో పొందుపరిచిన ఎస్సీ శాఖ
రాష్ర్టంలో కొత్తగా 40 సమీకృత సంక్షేమ భవనాలు
హైదరాబాద్: ఎస్సీ సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా నిధులు కేటాయించే అంశాన్ని బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపర్చింది. విద్యా, సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన లను ప్రాధాన్యాలుగా నిర్దేశించింది. ప్రధానంగా స్కూళ్ళు, హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర భవనాల నిర్మాణాలను అధికారులు చేపట్టనున్నారు. ఆయా భవనాల నిర్మాణం కోసం కోట్లాది రూపాయలను బడ్జెట్‌లో కేటాయించారు. శాసనసభకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సమర్పించిన 2016-17 బడ్జెట్ ఫలితాల వివరణలో ఆయా అంశాలను పొందుపరిచారు.
ఆయా భవనాల నిర్మాణాలకు నిధులు: ఇందులో ప్రీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, స్టడీ సర్కిళ్ల ఇతర గృహాల నిర్మాణానికి రూ.180 కోట్ల మేర అవసరమని బడ్జెట్ ప్రతిపాదనల్లో సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఎస్సీ ఉద్యోగినులకు రూ.2 కోట్లతో హైదరాబాద్‌లో రెండు వసతి గృహాల నిర్మాణానికి గత బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రభుత్వ కళాశాల భవనాల నిర్మాణానికి 2013-14లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 88 భవనాలకు రూ.228 కోట్లు మంజూరు చేశారు. వీటిల్లో చాలావరకు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులకే కాకుండా ప్రతి జిల్లాకు నాలుగు చొప్పున రాష్ర్టంలో మొత్తం 40 కొత్త సమీకృత సంక్షేమ భవనాల నిర్మాణానికి 2016-17లో రూ.120 కోట్లు ప్రతిపాదించినట్లు ఎస్సీ శాఖ బడ్జెట్ వివరణలో తెలిపింది. బాలికల కోసం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రూ.3.35 కోట్లతో నిర్మిస్తున్న స్టడీసర్కిల్ నిర్మాణం పూర్తి కావొచ్చిందని ఎస్సీ శాఖ తెలిపింది. అలాగే లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ భవనాన్ని పున ర్నిర్మించి లైబ్రరీ, మినీ సమావేశ మందిరాలు, ఆడిటోరియమ్ వంటి సదుపాయాల కల్పనకు 2016-17లో ప్రతిపాదించినట్లు, దీనికి రూ.20.50 కోట్లు ప్రతిపాదించినట్లు బడ్జెట్ ఫలితాల వివరణలో ఎస్సీ శాఖ వివరించింది.