
టీడీపీకి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ
నెల్లూరు, సిటీ: తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండు క ళ్లు అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నగరంలోని స్టౌన్‌హౌస్‌పేటలోని ఎస్‌బీఎస్ కల్యాణ మండపంలో టీడీపీ నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. రైతు రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. రూ.50వేలు లోపు రుణాలను ఒకే దఫా, లక్షలోపు రుణాలను ఐదు విడతలుగా మాఫీ చేస్తున్నట్లు వివరించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు బడ్జెట్‌లో రూ.8వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
నెల్లూరు నగరానికి రూ.42.5కోట్లు కేటాయించామన్నారు. గోదావరి నీరు 3వేల టీఎంసీలు వృథాగా సముద్రం పాలవుతున్నాయన్నారు. 950 టీఎంసీలను వినియోగించుకుంటే రాష్ట్రం సస్యశామలం అవుతుందన్నారు. అందుకే నధుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమం అమల్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ కన్నా ఏపీ తలసరి ఆదాయం తక్కువగా ఉందన్నారు.
అభివృద్ధితోనే తలసరి ఆదాయం పెరుగుతుందని, అందుకు పరిశ్రమలు రావాలన్నారు. ఈ నెల 23న జిల్లా మినీ మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. మేయర్ అబ్దుల్ అజీజ్, నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, చాట్ల నరసింహారావు, రమేష్‌రెడ్డి, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.