విద్యానిధి.. ప్రతిభకు పెన్నిధి | Good results with 'Ambedkar overseas' scheme | Sakshi
Sakshi News home page

విద్యానిధి.. ప్రతిభకు పెన్నిధి

Published Fri, Aug 24 2018 1:40 AM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

Good results with 'Ambedkar overseas' scheme - Sakshi

20 లక్షలు - ఏఓవీఎన్‌ కింద పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు..
465 మంది - నాలుగేళ్లలో లబ్ధిపొందిన విద్యార్థులు
81.10 కోట్లు - మొత్తం అయిన ఖర్చు

సాక్షి, హైదరాబాద్‌: సంపన్నులకే సాధ్యమయ్యే విదేశీ చదువు సామాన్యుడి చెంతకు చేరింది. తెలంగాణ ప్రభు త్వం తలపెట్టిన అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి (ఏఓవీఎన్‌) పథకంతో వందలాది దళిత ప్రతిభావంతులు విదేశాల్లో పట్టభద్రులయ్యారు. అంతేకాదు, అక్కడున్న బహుళజాతీయ సంస్థల్లో ఉన్నత కొలువులు సంపాదించి తోటివారికిమార్గదర్శకులయ్యారు.

నాలుగేళ్లలో ఏకంగా 465 మంది తెలంగాణ బిడ్డలు అమె రికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకంతో లబ్ధిపొందిన వారి పరిస్థితి ఎలా ఉందనే కోణంలో ఆ శాఖ ఇటీవల పరిశీలన చేపట్టింది. ఎంపిక చేసిన జాబితా ఆధారంగా దాదాపు 65 మందితో మాట్లాడారు. ఇందులో దాదాపు 50 మంది అభ్యర్థులు కోర్సు పూర్తి చేసి బహుళజాతి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తుండటంతో అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రెట్టింపు సాయంతో...
2013–14 విద్యా సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ఏఓవీఎన్‌ కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసేవారు. విదేశీ విద్యకు ఆ మొత్తం సరిపోయేది కాదు. దీంతో సింగిల్‌ డిజిట్‌లోనే అభ్యర్థులు లబ్ధిపొందేవారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచింది. దీంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

తాజాగా ఎస్సీ, బీసీ, ఈబీసీలకు వేర్వేరు పేర్లతో విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నారు. తొలుత ఎస్సీలకు ఈ పథకాన్ని అమలుచేసిన క్రమంలో వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని భావించిన ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్, క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏఓవీఎన్‌ పథకం కింద 465 మంది ఎంపిక కాగా, రూ.81.10 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సాయం రూపంలో అందించింది.

లక్ష్యాన్ని సాధించా...
హైదరాబాద్‌లో మాది మధ్యతరగతి కుటుంబం. అమెరికాలో పీజీ చదవాలనేది నా కోరిక. బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి కింద దరఖాస్తు చేశా. డల్లాస్‌లోని బాప్టిస్ట్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశా. తొలి ప్రయత్నంలోనే డెల్‌ కంపెనీలో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఉద్యోగం వచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందకుంటే విదేశీ విద్య అభ్యసించేదాన్ని కాదు. – కొల్లాబత్తుల సింధూజ  

ఉత్తమమైన పథకం ఇది..
ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యానిధి పథకం ఎస్సీలకు వరమే. ఈ పథకం కింద రూ.20లక్షల ఆర్థిక సాయం అందుతుంది. వీసా ఖర్చు, యూనివర్సిటీలో ప్రవేశం, ట్యూషన్‌ ఫీజు, ఫ్లైట్‌ చార్జీలు సైతం ఈ నిధుల నుంచే వినియోగించుకున్నా. ప్రతిభగల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఈ పథకం ఉత్తమమైనది. నా కుటుంబం ఎప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. – నీరటి భాస్కర్‌

పథకంతో దశ తిరిగింది..
నాన్న అరకొర వేతనంతో మా జీవితం అంతంతమాత్రంగానే ఉండేది. డిగ్రీ వరకు ఎలా గోలా నెట్టుకొచ్చినా ఎమ్మెస్‌ చేయలేనని భావించా. అప్పుడే ఈ పథకం గురించి తెలిసింది. దరఖాస్తు ప్రక్రియంతా పారదర్శకంగా జరిగింది. ప్రభుత్వ కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలో పాల్గొన్నా. మంచి మార్కులు రావడంతో అమెరికాలోని బ్రిడ్జిపోర్ట్‌ యూనివర్సిటీలో కంప్యూ టర్‌ సైన్స్‌లో ఎంఎస్‌లో చేరా. డిస్టింక్షన్‌లో పాసై అబ్వీ అండ్‌ ఇన్ఫినిటీ ఫార్మాస్యూటికల్స్‌ అనే కంపెనీలో ఐటీ అనలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించా.  – వూట్ల దివ్యశాంతి

అపరిమిత సంఖ్యలో ఎంపిక..
ఏఓవీఎన్‌ పథకానికి ప్రస్తుతం ఎలాంటి సీలింగ్‌ లేదు. అర్హులు ఎంత మంది ఉన్నా వారికి ఆర్థిక సాయం అందిస్తాం. యూనివర్సిటీ ప్రవేశాలు, ఫీజుల ఆధారంగా ఒక్కో లబ్ధిదారుకు గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇస్తున్నాం. అర్హత సాధించిన అనంతరం యూనివర్సిటీలో ప్రవేశం తీసుకున్నట్లు అడ్మిట్‌ కార్డును ఆన్‌లైన్లో అప్‌డేట్‌ చేసిన వెంటనే రెండు వాయిదాల్లో ఫీజులు చెల్లిస్తున్నాం. వందశాతంపారదర్శకంగా నిర్వహిస్తున్నాం.     – పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement