వారం రోజుల్లోగా సబ్సిడీ రుణాల మంజూరు
ఎస్సీ కార్పోరేషన్‌లో 2016–17 సంవత్సరానికి సంబంధించి సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారందరికీ నిధులు మంజూరు కానున్నాయని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు.
ఇందూరు : ఎస్సీ కార్పోరేషన్‌లో 2016–17 సంవత్సరానికి సంబంధించి సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారందరికీ నిధులు మంజూరు కానున్నాయని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన హరితహారంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలోని ప్రగతి భవన్ ముందు మొక్కలు నాటారు. అనంతరం ఎస్సీ కార్పోరేషన్‌లో అధికారులతో సమీక్షించి, విలేకరులతో మాట్లాడారు. రాష్రంలో 20,411మంది సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, ఇందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. అర్హులందరికీ రుణాలకు ఇవ్వడానికి ప్రభుత్వం కావాల్సినన్ని నిధులు కేటాయించిందని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌కు నోచుకోని ఒకటి, రెండు ఐదు లక్షలపైన రుణాలను కూడా త్వరలో ఆన్‌లైన్ తెరిపించి రుణాలు మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో ఇప్పటి వరకు 1300 ఎకరాలు పంపిణీ చేశామని, మరో 500 ఎకరాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రూ. 341కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఎకరాలు కొనుగోలు చేసి, 3228 మందికి భూపంపిణీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సీ కార్పోరేషన్ ఇన్‌చార్జి అధికారి విమలాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.