‘బయోమెట్రిక్’కు మంగళం
-
పని చేయని సర్వర్లు
-
96 ఎస్సీ హాస్టళ్లలో నిలిచిన సేవలు
-
మాన్యువల్‌గానే విద్యార్థుల హాజరు
వీణవంక : సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత విద్యా సంవత్సరం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానానికి ఏడాదికే మంగళం పలికారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పాత పద్ధతిలోనే(మాన్యువల్‌గా) విద్యార్థుల హాజరు శాతం చూపుతున్నారు. జిల్లాలో 96 ఎస్సీ హాస్టళ్లు ఉండగా, 4,200 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతీ రోజు విద్యార్థులు, సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా వేలు ముద్రలను స్కాన్ చేసి హాజరు శాతాన్ని ఇంటర్‌నెట్ ద్వారా నమోదు చేయాలి. ఈ విధానంతో అక్రమాలకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావించింది. కానీ సర్వర్లు పని చేయకపోవడం, సాంకేతిక సమస్యల కారణంగా ఏడాదికే అటకెక్కింది. ఈ క్రమంలో ఎస్టీ, బీసీ హాస్టళ్లలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.
పనిచేయని సర్వర్లు..
హాస్టళ్లలో విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు చిత్రీకరించి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో బయోమెట్రిక్ విధానం 2015 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇందుకు ప్రభుత్వం ల్యాప్‌టాప్, ఇంటర్‌నెట్ సౌకర్యం, వేలిముద్రల స్కానర్‌ను ప్రతీ హాస్టల్‌కు సమకూర్చింది. ప్రతీ నెల ఇంటర్‌నెట్ బిల్లు రూ.1200 చొప్పున చెల్లించింది. అయితే విద్యార్థుల వేలిముద్రలు సక్రమంగా స్కానింగ్ చేకపోవడం, గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్‌నెట్ సమస్య ఉండడంతో అతి కష్టంగా గత విద్యాసంవత్సరం కొనసాగించారు. ఈ విద్యా సంవత్సరం పకడ్బందీగా అమలవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావించగా సర్వర్లు పని చేయక మొత్తానికే మూలనపడింది. జిల్లాలోని అన్ని హాస్టళ్లలో సేవలు నిలిచిపోయాయి. విద్యార్థులు, సిబ్బంది హాజరును మాన్యువల్‌గానే నమోదు చేస్తున్నారు. బయోమెట్రిక్ లేకుంటే మళ్లీ అక్రమాలు జరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు త్వరగా బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని కోరుతున్నారు.