స్కిల్‌ @ హాస్టల్‌ | Hostels as professional development centers | Sakshi
Sakshi News home page

స్కిల్‌ @ హాస్టల్‌

Published Mon, Dec 9 2019 3:44 AM | Last Updated on Mon, Dec 9 2019 3:44 AM

Hostels as professional development centers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ వసతి గృహాలు ఇకపై నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారనున్నాయి. ఇప్పటివరకు హాస్టళ్లంటే కేవలం విద్యార్థులకు వసతితో పాటు రెండు పూటలా భోజన సౌకర్యాన్ని కల్పించేవనే మనకు తెలుసు. తాజాగా ఈ కేంద్రాల్లో వసతి పొందే విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ముందుగా కళాశాల వసతి గృహాల్లో (కాలేజీ హాస్టల్స్‌) ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు కాలేజీ తరగతులు పూర్తికాగానే సంక్షేమ వసతిగృహానికి చేరుకోవడం, కాలేజీల్లో జరిగిన పాఠశాలను పునశ్చరణ చేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో కేవలం సబ్జెక్టుపరంగా వారికి కొంత అవగాహన పెరుగుతున్నప్పటికీ ఇతర అంశాల్లో పరిజ్ఞానం మాత్రం అంతంతమాత్రం గానే ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా తొలుత నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని వసతి గృహాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. 

ఇంగ్లిష్‌లో మాట్లాడేలా..
వసతి గృహాల్లోని విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచడంతో పాటు కంప్యూటర్స్‌లో ప్రాథమికాంశాలపై (బేసిక్స్‌) అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు నిర్వహించబోతోంది. హాస్టల్‌లో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఇంగ్లిష్‌ వాడకాన్ని వృద్ధిచేస్తే భాషపై పట్టు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులతో పాటు కొంతసేపు కరెంట్‌ అఫైర్స్‌ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ తరగతుల బోధనకు క్షేత్రస్థాయిలో నిపుణులైన ట్యూటర్లను ఎంగేజ్‌ చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమనే భావన ఉంది.

ఈ నేపథ్యంలో కంప్యూటర్స్‌ బేసిక్స్‌పైనా అవగాహన కల్పించి సర్టిఫికెట్‌ కూడా ఇచ్చేలా మరో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తోంది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేకంగా నిధులను ఖర్చు చేయనుంది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు చేసి కంప్యూటర్లను కొనుగోలు చేసింది. ఒక కంప్యూటర్‌పై పది మంది విద్యార్థులు ప్రాక్టీస్‌ చేసేలా టైమ్‌షెడ్యూల్‌ను సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారి రూపొందిస్తారు. త్వరలో నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఈ కార్యక్రమాలను ప్రారంభించేలా అధికారులు చర్యలు వేగిరం చేశారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ... వచ్చే ఏడాది నుంచి అన్ని వసతిగృహాల్లో అమలుచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్‌ ‘సాక్షి’తో అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement