గాంధీనగర్ కళాశాల, పాఠశాలలో కూరగాయల నాణ్యతపై ఆరా తీస్తున్న ఏసీబీ డీఎస్పీ రమేశ్
నాసిరకం ఆహార పదార్థాలే విద్యార్థులకు వడ్డింపు
సంక్షేమ హాస్టళ్లలో దారుణ పరిస్థితులు
ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి
రాష్ట్రవ్యాప్తంగా 10 హాస్టళ్లలో ఏకకాలంలో సోదాలు
పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్న వసతిగృహాలు
అధ్వానంగా మరుగుదొడ్లు, బాత్ రూంలు.. వంటగదులదీ అదే పరిస్థితి
రికార్డుల్లో అవకతవకలు..విద్యార్థుల సంఖ్యలో వ్యత్యాసాలు
మెనూకు మంగళం.. అరటిపండ్లు, గుడ్లకు కోత
మొక్కుబడిగా వచ్చిపోతున్న వార్డెన్లు
తూనికలు, కొలతల అధికారులు శానిటరీ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో జాయింట్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లు దారుణమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వారికి మంచి అల్పాహారం కాని, భోజనం కాని అందడం లేదు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో వండిన ఆహార పదార్థాలనే వడ్డిస్తున్నారు. మెనూ పాటించడం లేదు. రోజూ ఇవ్వాల్సిన అరటిపండ్లు, గుడ్లు లాంటివి ఇవ్వడం లేదు.
వసతి గృహాల్లో పారిశుధ్యం ఆనవాళ్లే లేవు. మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు వంటశాలల్లోనూ అపరిశుభ్ర వాతావరణం కొనసాగుతోంది. కొన్నిచోట్ల విద్యార్థులతోనే గదులు, ఆవరణ శుభ్రం చేయిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు. మొత్తం విద్యార్థుల సంఖ్యకు, హాజరు పట్టీలో నమోదు చేసిన సంఖ్యకు, వాస్తవంగా తర గతి గదిలో ఉన్నవారి సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. కొన్నిచోట్ల వార్డెన్లు అందుబాటులో లేరు. వారు ఇష్టారాజ్యంగా వచ్చి వెళుతున్నారు.
మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరికి వారు అందినంత దండుకునే వ్యవహారంగానే హాస్టళ్ల పనితీరు ఉన్న ట్లు ఈ సోదాల్లో బయటపడింది. డీజీ సీవీ ఆనంద్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు, స్థానిక తూనికలు, కొలతల అధికారులు, శానిటరీ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఆడిటర్లతో కూడిన 10 బృందాలు.. రాష్ట్రంలోని 10 సంక్షేమ హాస్టళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి.
అత్యంత అధ్వాన పరిస్థితుల మధ్య విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నట్టు గుర్తించాయి. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. ఈ సోదాలపై ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ జాంబాగ్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని బీసీ బాలుర హాస్టల్, మహబూబ్‌నగర్ జిల్లా కోయల్‌కొండలోని బీసీ బాలుర వసతిగృహం, నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల వసతి గృహం, మంచిర్యాల జిల్లా వెమ్మనపల్లిలోని ఎస్టీ బాలుర హాస్టల్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పలపల్లిలోని ఎస్సీ బాలుర హాస్టల్, జనగామలోని ఎస్సీ బాలికల హాస్టల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండలంలోని ఎస్టీ బాలుర హాస్టల్, సిద్దిపేటలోని బీసీ బాలుర వసతిగృహం, నిజామాబాద్ కొత్తగల్లీలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో తనిఖీలు జరిగాయి.
మెనూకు చెల్లు చీటీ..
ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం గాందీనగర్ గిరిజన జూనియర్ కళాశాల, గురుకుల విద్యాలయం నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రహరీగోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు, వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మెనూ కూడా పాటించడం లేదు. మంగళవారం ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాలేదు.
నాణ్యత లేని భోజనం..
నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల హాస్టల్ మొత్తం అపరిశుభ్ర వాతావరణంలోనే ఉంది. మరుగుదొడ్లే కాదు.. వంట గది పరిస్థితీ దారుణంగా ఉంది. నాణ్యత లేని టిఫిన్, భోజనం పెడుతున్నారు. తాగునీరు కూడా బాగా లేదు. వసతి గృహంలో 52 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా 23 మందే ఉన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదు.
ఖర్చుల వివరాల్లేవు..
సిద్దిపేట పట్టణంలోని బీసీ విద్యార్థుల వసతి గృహంలో రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదు. విద్యార్థుల హాజరుకు సంబంధించిన పూర్తి వివరాలు లేవు. విద్యార్థులు గైర్హాజరు అయితే కేవలం చుక్క మాత్రమే పెడుతున్నారు. జూన్, జూలై నెలలకు సంబంధించిన ఖర్చు, తదితర వివరాలను రికార్డుల్లో పొందుపరచలేదు.
రేకుల షెడ్డులో కిచెన్..
సిరిసిల్ల మున్సిపల్ పరిధి ఇప్పలపల్లి గ్రామ శివారులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులం కిచెన్ తాత్కాలిక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. విద్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా లేవు. మౌలిక సదుపాయాల లోపం కూడా ఉంది.
ఆహార పదార్థాలు సీజ్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులకు పెట్టే భోజనం సక్రమంగా లేదు. మంగళవారం తనిఖీల సందర్భంగా నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను సీజ్ చేసి, ల్యాబ్‌కు తరలించారు. మూత్రశాలల నిర్వహణ సరిగా లేదు.
కోడిగుడ్లు, అరటిపండ్లకు ఎగనామం
జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ఎస్సీ బాలికల ప్రీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో తనిఖీల సమయంలో వార్డెన్ కవిత విధుల్లో లేరు. వసతి గృహంలో రికార్డుల పరంగా 110 మంది విద్యార్థులుంటే 73 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో 60 మంది మాత్రమే ఉన్నారు. మెనూ ప్రకారం కోడిగుడ్లు, అరటిపండ్లు ఇవ్వడం లేదు. భోజనంలో నాణ్యత లోపించింది. టాయిలెట్లు, మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. విద్యార్థుల హెల్త్ చెకప్‌కు సంబంధించిన ప్రొఫైల్ కార్డులు నిర్వహించడం లేదు.
త్వరలో ప్రభుత్వానికి వేర్వేరు నివేదికలు!
అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన మరికొన్ని కీలక అంశాలు పరిశీలిస్తే..విద్యార్థుల గదులకు సరైన గాలి, వెలుతురు రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆహార పదార్థాల పట్టిక పాటించడం లేదు. బాలికల హాస్టళ్లల్లో బాత్‌రూంల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. మొత్తం 18 రకాల రికార్డులు అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. అయినా ఏ ఒక్కటీ సరిగా పాటించడం లేదు.
వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండాలి. కానీ వారానికి ఒకరోజు లేదంటే నెలకు ఒకరోజు వచ్చి, పోతున్నారు. రిజిస్టర్లలో రాసిన దానికి అందుబాటులో ఉన్న సరుకుల పరిమాణానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఎక్కువ హాస్టళ్లలో కాలం చెల్లిన ఆహారపదార్థాలను వాడుతున్నారు. ఈ అంశాలతో పాటు ప్రభుత్వ నిధుల దురి్వనియోగంపై, హాస్టళ్ల సిబ్బందిపై తీసుకోవాల్సిన చర్యలు, హాస్టళ్లలోని ప్రస్తుత పరిస్థితులను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వేర్వేరుగా త్వరలో ప్రభుత్వానికి నివేదికలు సమరి్పంచనున్నట్టు ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment