poor food
-
నాణ్యత లేకుంటే జైలే!: సీఎం రేవంత్
ఓటు హక్కుకు అర్హత 21 ఏళ్లుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేది. ఇప్పుడు ఓటుహక్కుకు అర్హత 18 ఏళ్లకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాలి. అప్పుడే ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి వస్తారు. – మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలకు నాసిరకం బియ్యం, కూరగాయలు సరఫరా చేస్తే కాంట్రాక్టర్లతో ఊచలు లెక్కబెట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కలుషిత ఆహారం సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో నాసిరకం భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు పెంచామని తెలిపారు. విద్యార్థి నులకు కాస్మెటిక్ చార్జీలు సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి అయినా, విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గ్రీన్ చానల్ ద్వారా సకాలంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే వారికి భవిష్యత్ ప్రయోజనాల్లో ప్రాధాన్యత ఇవ్వబోమని చెప్పారు. ప్రజా ప్రతినిధులు కూడా స్కూళ్లకు వెళ్లాలన్నారు. కుల గణనపై కొంతమంది కుట్ర చేస్తున్నారని, దీన్ని విద్యార్థి లోకం సమర్థవంతంగా తిప్పికొట్టాలని కోరారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లాల నుంచి వచ్చిన బాలలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లపై విశ్వాసం పెంచాలి ‘ప్రభుత్వ స్కూళ్ల ప్రతిష్ట దెబ్బతింటోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో 26 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతుంటే, 36 లక్షల మంది ప్రైవేటు స్కూళ్ళకు వెళ్తున్నారు. అన్ని సౌకర్యాలున్నా, అర్హులైన టీచర్లు ఉన్నా ఈ పరిస్థితి ఎందుకుందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. కలెక్టర్లు, ఎస్పీలు స్కూళ్లకు వెళ్లాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళాలి. విద్యార్థుల్లో విశ్వాసం కల్పించాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యంతో అన్నం పెట్టాలి. అందుకే రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యా రంగానికి పెద్దపీట ‘విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 20 వేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 35 వేలమంది టీచర్ల బదిలీలు పూర్తి చేశాం. 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. వర్సిటీలకు వీసీలను నియమించాం. త్వరలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. గత సీఎం మనవడి కుక్క చనిపోతే డాక్టర్‌ను జైల్లో పెట్టారు. విద్యార్థులు చనిపోతే కనీసం కన్నీరు కూడా పెట్టలేదు..’అని రేవంత్ అన్నారు. ‘తెలంగాణకు విద్యార్థులే పునాదులని, తమ ప్రభుత్వం చేకూర్చే ప్రయోజనాలను అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి వ్యసనాలకు బానిసలం కాబోమని, ఉన్నత విద్యలో రాణిస్తామని ప్రమాణం చేయాలని బాలలను సీఎం కోరారు. చదువులోనే కాదు.. క్రీడల్లో రాణించినా ఉద్యోగాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. కుల గణన మెగా హెల్త్ చెకప్ లాంటిది ‘కులగణనను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇది సమాజానికి మెగా ఆరోగ్య పరీక్ష వంటిది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలకు పెరగాలన్నా, నిధుల కేటాయింపు జరగాలన్నా కుల గణనే కీలకం. కులగణన ఆధారంగా భవిష్యత్తులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అందుబాటులోకి తేవాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దీనిద్వారా ఎవరి ఆస్తులూ లాక్కోవడం జరగదు. సంక్షేమ పథకాలు అందకుండా పోవడం అంటూ ఉండదు. విద్యార్థులు కూడా కులగణన వివరాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి..’అని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ చిన్నారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా డైరెక్టర్ నర్సింహారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పుస్తకాన్ని, తెలంగాణ విద్యా ప్రగతి సూచించే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు పారితోషికం అందజేశారు ‘21 ఏళ్ళకే పోటీ చేసే హక్కు’తీర్మానం చేయండి ఎస్సీఈఆర్టీలో గురువారం జరిగిన అండర్ 18 విద్యార్థుల నమూన అసెంబ్లీ సమావేశ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో పోటీ చేసే వయసును 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకు తగ్గించాలని, ఈ విధంగా చేసిన మాక్ అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపాలని సూచించారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. ఓటు హక్కుకు అర్హత 21 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేదని, ఇప్పుడు ఓటు హక్కుకు అర్హత 18 ఏళ్ళకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్ళకు తగ్గిస్తే ఎక్కువమంది యువత రాజకీయాల్లోకి వస్తారని సీఎం పేర్కొన్నారు. -
మురికి కూపం.. పురుగుల బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లు దారుణమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వారికి మంచి అల్పాహారం కాని, భోజనం కాని అందడం లేదు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో వండిన ఆహార పదార్థాలనే వడ్డిస్తున్నారు. మెనూ పాటించడం లేదు. రోజూ ఇవ్వాల్సిన అరటిపండ్లు, గుడ్లు లాంటివి ఇవ్వడం లేదు. వసతి గృహాల్లో పారిశుధ్యం ఆనవాళ్లే లేవు. మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు వంటశాలల్లోనూ అపరిశుభ్ర వాతావరణం కొనసాగుతోంది. కొన్నిచోట్ల విద్యార్థులతోనే గదులు, ఆవరణ శుభ్రం చేయిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు. మొత్తం విద్యార్థుల సంఖ్యకు, హాజరు పట్టీలో నమోదు చేసిన సంఖ్యకు, వాస్తవంగా తర గతి గదిలో ఉన్నవారి సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. కొన్నిచోట్ల వార్డెన్లు అందుబాటులో లేరు. వారు ఇష్టారాజ్యంగా వచ్చి వెళుతున్నారు. మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరికి వారు అందినంత దండుకునే వ్యవహారంగానే హాస్టళ్ల పనితీరు ఉన్న ట్లు ఈ సోదాల్లో బయటపడింది. డీజీ సీవీ ఆనంద్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు, స్థానిక తూనికలు, కొలతల అధికారులు, శానిటరీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆడిటర్లతో కూడిన 10 బృందాలు.. రాష్ట్రంలోని 10 సంక్షేమ హాస్టళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. అత్యంత అధ్వాన పరిస్థితుల మధ్య విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నట్టు గుర్తించాయి. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. ఈ సోదాలపై ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ జాంబాగ్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని బీసీ బాలుర హాస్టల్, మహబూబ్‌నగర్ జిల్లా కోయల్కొండలోని బీసీ బాలుర వసతిగృహం, నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల వసతి గృహం, మంచిర్యాల జిల్లా వెమ్మనపల్లిలోని ఎస్టీ బాలుర హాస్టల్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పలపల్లిలోని ఎస్సీ బాలుర హాస్టల్, జనగామలోని ఎస్సీ బాలికల హాస్టల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండలంలోని ఎస్టీ బాలుర హాస్టల్, సిద్దిపేటలోని బీసీ బాలుర వసతిగృహం, నిజామాబాద్ కొత్తగల్లీలోని ఎస్సీ బాలికల హాస్టల్లో తనిఖీలు జరిగాయి. మెనూకు చెల్లు చీటీ.. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం గాందీనగర్ గిరిజన జూనియర్ కళాశాల, గురుకుల విద్యాలయం నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రహరీగోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు, వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మెనూ కూడా పాటించడం లేదు. మంగళవారం ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాలేదు. నాణ్యత లేని భోజనం.. నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల హాస్టల్ మొత్తం అపరిశుభ్ర వాతావరణంలోనే ఉంది. మరుగుదొడ్లే కాదు.. వంట గది పరిస్థితీ దారుణంగా ఉంది. నాణ్యత లేని టిఫిన్, భోజనం పెడుతున్నారు. తాగునీరు కూడా బాగా లేదు. వసతి గృహంలో 52 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా 23 మందే ఉన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదు. ఖర్చుల వివరాల్లేవు.. సిద్దిపేట పట్టణంలోని బీసీ విద్యార్థుల వసతి గృహంలో రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదు. విద్యార్థుల హాజరుకు సంబంధించిన పూర్తి వివరాలు లేవు. విద్యార్థులు గైర్హాజరు అయితే కేవలం చుక్క మాత్రమే పెడుతున్నారు. జూన్, జూలై నెలలకు సంబంధించిన ఖర్చు, తదితర వివరాలను రికార్డుల్లో పొందుపరచలేదు. రేకుల షెడ్డులో కిచెన్.. సిరిసిల్ల మున్సిపల్ పరిధి ఇప్పలపల్లి గ్రామ శివారులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులం కిచెన్ తాత్కాలిక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. విద్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా లేవు. మౌలిక సదుపాయాల లోపం కూడా ఉంది. ఆహార పదార్థాలు సీజ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే భోజనం సక్రమంగా లేదు. మంగళవారం తనిఖీల సందర్భంగా నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను సీజ్ చేసి, ల్యాబ్‌కు తరలించారు. మూత్రశాలల నిర్వహణ సరిగా లేదు. కోడిగుడ్లు, అరటిపండ్లకు ఎగనామం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ఎస్సీ బాలికల ప్రీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో తనిఖీల సమయంలో వార్డెన్ కవిత విధుల్లో లేరు. వసతి గృహంలో రికార్డుల పరంగా 110 మంది విద్యార్థులుంటే 73 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో 60 మంది మాత్రమే ఉన్నారు. మెనూ ప్రకారం కోడిగుడ్లు, అరటిపండ్లు ఇవ్వడం లేదు. భోజనంలో నాణ్యత లోపించింది. టాయిలెట్లు, మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. విద్యార్థుల హెల్త్ చెకప్‌కు సంబంధించిన ప్రొఫైల్ కార్డులు నిర్వహించడం లేదు. త్వరలో ప్రభుత్వానికి వేర్వేరు నివేదికలు! అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన మరికొన్ని కీలక అంశాలు పరిశీలిస్తే..విద్యార్థుల గదులకు సరైన గాలి, వెలుతురు రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆహార పదార్థాల పట్టిక పాటించడం లేదు. బాలికల హాస్టళ్లల్లో బాత్రూంల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. మొత్తం 18 రకాల రికార్డులు అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. అయినా ఏ ఒక్కటీ సరిగా పాటించడం లేదు. వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండాలి. కానీ వారానికి ఒకరోజు లేదంటే నెలకు ఒకరోజు వచ్చి, పోతున్నారు. రిజిస్టర్లలో రాసిన దానికి అందుబాటులో ఉన్న సరుకుల పరిమాణానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఎక్కువ హాస్టళ్లలో కాలం చెల్లిన ఆహారపదార్థాలను వాడుతున్నారు. ఈ అంశాలతో పాటు ప్రభుత్వ నిధుల దురి్వనియోగంపై, హాస్టళ్ల సిబ్బందిపై తీసుకోవాల్సిన చర్యలు, హాస్టళ్లలోని ప్రస్తుత పరిస్థితులను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వేర్వేరుగా త్వరలో ప్రభుత్వానికి నివేదికలు సమరి్పంచనున్నట్టు ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
విద్యార్థినుల జీవితాలతో ఆటలా?
తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా): ఎస్వీ యూనివర్సిటీ హాస్టళ్లలో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారని వర్సిటీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ఎస్వీయూ పరిపాలన భవనం వద్ద హాస్టల్ సమస్యలపై పీజీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ హాస్టల్ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు.బుధవారం రాత్రి పాచిపోయి వాసన వస్తున్న చికెన్ విద్యార్థినులకు వడ్డించారని మండిపడ్డారు. నాసిరకం కూరగాయలతో ప్రతినిత్యం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, వాష్‌రూమ్స్ వంటి మౌలిక సదుపాయాలు సరిగాలేకపోవడంతో విద్యార్థినులు సతమతమవుతున్నారన్నారు. ఒక్కోవిద్యార్థినీ నుంచి నెలకు రూ.3వేలకు పైగా మెస్ బిల్లు వసూలు చేస్తూ రోజూ పప్పునీళ్లే వడ్డిస్తున్నారని ఇన్చార్జి రిజిస్ట్రార్ చంద్రయ్యను నిలదీశారు. సమస్యను పరిష్కరిస్తామంటూ రిజిస్ట్రార్ విద్యార్థినులకు హామీ ఇచ్చారు. -
మీసేవకో దణ్ణం..!
♦ నాణ్యతలేని ఆహారం..బోగీల్లో బొద్దింకలు ♦ బెర్తుల కేటాయింపుల్లో చేతివాటం సిబ్బంది దురుసు ప్రవర్తన.. ♦ రైల్వే సదుపాయాలపై ఫిర్యాదుల వెల్లువ ♦ ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి సాక్షి,సిటీబ్యూరో : రోజుకు 10 లక్షల మంది ప్రయాణం.. నిత్యం 800 రైళ్లు వేల కిలోమీటర్ల రాకపోకలు.. అందుబాటులో వేల మంది సిబ్బంది.. వెరసి దక్షిణమధ్య రైల్వే. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ వ్యవస్థ లాభాల బాటలో పయనిస్తున్నా.. ఆదరిస్తున్న ప్రయాణికులకు మాత్రం సమస్యలను బోనస్‌గా ఇస్తోంది. బోగీల్లో ఎలుకలు, బొద్దింకల పరుగులు.. నాణ్యత లేని ఆహారం, చెల్లిస్తున్న ధరకు అనుగుణంగా తూకం ఉండని ప్యాకెట్లు.. సిబ్బంది దురుసు ప్రవర్తన.. వీటిపై వస్తున్న ఫిర్యాదుల లిస్టు చాంతాడులా పెరుగుతోంది. గత ఏడాది 18,662 ఫిర్యాదులు అందితే, ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 3 వేల ఫిర్యాదులు అందాయి. రైల్వే సదుపాయాలు, మెరుగైన రవాణా సదుపాయంపై పదే పదే ఊదరగొట్టే అధికారుల ప్రకటల్లోని డొల్లతనానికి ఈ ఫిర్యాదులే నిదర్శనం. అధికారులు చెబుతున్నదానికి.. వాస్తవ పరిస్థితులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. బాబోయ్ ఇదేం ఫుడ్డు..! సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణమధ్య రైల్వేలో వివిధ ప్రాంతాల మధ్య ప్రతి రోజు 10 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. సుమారు 800 రైళ్లు సేవలు అందిస్తున్నాయి. అన్ని ప్రధాన రైళ్లలో ఆహార పదార్థాలు అందజేసేందుకు ప్యాంట్రి కార్ల ఉన్నాయి. స్టేషన్లలోనూ రెస్టారెంట్లు, క్యాంటిన్లు ఏర్పాటు చేశారు. ఐఆర్సీటీసీ, ప్రైవేట్ కేటరింగ్ సంస్థలు, హోటళ్లు ఆహార సేవలు అందిస్తున్నాయి. అయితే, ప్యాంట్రి కార్లలో పూర్తి అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. పదార్థాలు సప్లైచేసే సిబ్బంది సైతం శుభ్రత పాటించడం లేదు. చేతులకు గ్లౌజ్‌లు కూడా వేసుకోరు. మరోవైపు ఆహార పదార్థాల ధరలు ఎక్కువ, పరిమాణం తక్కువ. 100 గ్రాముల ఇడ్లీ ధర రూ.28. కానీ 80 గ్రాములే ఉంటుంది. 250 గ్రాముల పెసరట్టు ధర రూ.55. ప్రయాణికుడి చేతికి ఇచ్చేది 200 గ్రాములే. వాటర్ బాటిళ్లపై కూలింగ్ చార్జీల పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సమస్యలపై ఫిర్యాదు చేస్తే చర్యలు మాత్రం ఉండవు. బెర్తుకు ‘చిల్లర’ బేరం బోగీల్లో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, ఇతరులకు బెర్తులు, సీట్ల కేటాయింపుల్లో టీసీల చేతివాటం పైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత సమర్పించుకుంటే తప్ప బెర్తు లభించదు. పైగా లోయర్ బెర్తు, అప్పర్ బెర్తు పేరిట మరో బేరం. రైళ్లలోనూ, స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లలోనూ కమర్షియల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తారు. అడిగిందానికి సమాధానం ఇవ్వకుండా బెదిరిస్తారు. టిక్కెట్ ఇచ్చిన తరువాత చిల్లర డబ్బులు ఇవ్వడం లేదు. ట్రైన్ వెళ్లిపోతోందేమోననే ఆందోళనలో ఉన్న ప్రయాణికులు రెలైక్కాక చూసుకుంటే రూ.వందో, రూ.యాభయ్యో తక్కువ ఉంటాయి. ‘తత్కాల్’ దందా.. రిజర్వేషన్ కేంద్రాల్లో దళారుల నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. ముఖ్యంగా తత్కాల్ కోటాను దళారులే ఎగురేసుకుపోతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రయాణికులు లైన్లో నిలుచుని ఉండగానే క్షణాల్లో టిక్కెట్లు అయిపోయి కౌంటర్లు మూసేస్తారు. మరోవైపు పార్శిల్ సెక్షన్‌లోనూ సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ ప్రయాణికులను వేధిస్తున్నారు. ఇలాంటి సేవల్లోనూ ప్రయాణికులు తమ ఇబ్బందులను తెలియజేస్తూనే ఉన్నారు. ఏసీ బోగీల్లో సేవలు శూన్యం.. వేలకు వేలు చెల్లించి ఏసీ బోగీల్లో వెళ్లే ప్రయాణికులకు కూడా తగిన సేవలు లభించడం లేదు. ఫస్ట్ ఏసీ బోగీల్లోనే నీళ్లు రావడం లేదని, ఆన్‌బోర్డు సిబ్బందిని విచారిస్తే సమాధానం చెప్పకుండా వెళ్తారని ప్రయాణికులు చెబుతున్నారు. చాలా సార్లు ఏసీలు పనిచేయవు. ఫ్యాన్లు తిరగవు. ఎలక్ట్రికల్ సిబ్బంది అందుబాటులో ఉండరు. ఉన్నా ఫిర్యాదును పెడచెవిన పెడతారు. టాయిలెట్లు కంపు.. రాత్రి వేళ ల్లో నీళ్లు రావు. ఆ సమయంలో ఫిర్యాదు చేసినా స్పందించే నాధుడు ఉండడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఫిర్యాదు చేసే మార్గాలు ఇవీ.. ⇔ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టం (సీపీజీఆర్ఏఎంఎస్) ⇔ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఓఎంఎస్) వెబ్ పోర్టల్ ⇔ టోల్‌ఫ్రీ నెంబర్: 8121281212 కు ఎస్సెమ్మెస్ ⇔ ఆల్ ఇండియా హెల్ప్‌లైన్ నెంబర్: 138 ⇔ దక్షిణమధ్య రైల్వేలోని ప్రధాన కార్యాలయం, ⇔ డీఆర్ఎం, ఇతర ఉన్నతాధికారులకు నేరుగా అందజేసే ఫిర్యాదులు. ⇔ ప్రయాణికులకు అందజేసే సేవలు, సదుపాయాలు, భద్రత వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని 10 విభాగాలుగా ఫిర్యాదులను విభజించారు. ఆయా విభాగాల్లో ఫిర్యాదుల శాతం ఇలా ఉంది... 1. ఆహార పదార్థాల్లో నాణ్యత, కొరవడిన రుచి, చిరుతిళ్ల అమ్మకాల్లో అధిక ధరలు: 29.49 2. కమర్షియల్ సిబ్బంది దురుసు ప్రవర్తన: 17.98 3. రిజర్వేషన్లలో ఎదురయ్యే ఇబ్బందులు, ఏజెంట్ల జోక్యం: 10.86 4. వస్తువుల పార్శిల్ బుకింగ్‌లో ఎదురయ్యే సమస్యలపై: 8.45 5. సిబ్బంది లంచాలు, అవినీతిపై: 8.34 6. సీట్లు,బెర్తుల కేటాయింపుల్లో అక్రమాలు: 7.41 7. బుకింగ్ కౌంటర్ల ఎదురయ్యే సమస్యలు: 6.52 8. ఆన్‌బోర్డింగ్ హౌస్‌కీపింగ్ సిబ్బంది అమర్యాద ప్రవర్తన: 3.73 9. రైల్వేయేతర అవుట్సోర్సింగ్ సిబ్బంది పనితీరుపై: 3.73 10.విచారణ కేంద్రాల్లో ప్రయాణికులకు కావలసిన సమాచారం ఇవ్వకపోవడంపై: 3.49