మీసేవకో దణ్ణం..! | railway department failures and complaints | Sakshi
Sakshi News home page

మీసేవకో దణ్ణం..!

Published Sun, Jul 10 2016 4:17 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

మీసేవకో దణ్ణం..!

మీసేవకో దణ్ణం..!

నాణ్యతలేని ఆహారం..బోగీల్లో బొద్దింకలు
బెర్తుల కేటాయింపుల్లో చేతివాటం సిబ్బంది దురుసు ప్రవర్తన..
రైల్వే సదుపాయాలపై ఫిర్యాదుల వెల్లువ
‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి

 సాక్షి,సిటీబ్యూరో : రోజుకు 10 లక్షల మంది ప్రయాణం.. నిత్యం 800 రైళ్లు వేల కిలోమీటర్ల రాకపోకలు.. అందుబాటులో వేల మంది సిబ్బంది.. వెరసి దక్షిణమధ్య రైల్వే. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ వ్యవస్థ లాభాల బాటలో పయనిస్తున్నా.. ఆదరిస్తున్న ప్రయాణికులకు మాత్రం సమస్యలను బోనస్‌గా ఇస్తోంది. బోగీల్లో ఎలుకలు, బొద్దింకల పరుగులు.. నాణ్యత లేని ఆహారం, చెల్లిస్తున్న ధరకు అనుగుణంగా తూకం ఉండని ప్యాకెట్లు.. సిబ్బంది దురుసు ప్రవర్తన.. వీటిపై వస్తున్న ఫిర్యాదుల  లిస్టు చాంతాడులా పెరుగుతోంది.  గత ఏడాది 18,662 ఫిర్యాదులు అందితే, ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 3 వేల ఫిర్యాదులు అందాయి. రైల్వే సదుపాయాలు, మెరుగైన రవాణా సదుపాయంపై పదే పదే ఊదరగొట్టే అధికారుల ప్రకటల్లోని డొల్లతనానికి ఈ ఫిర్యాదులే నిదర్శనం. అధికారులు చెబుతున్నదానికి.. వాస్తవ పరిస్థితులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

బాబోయ్ ఇదేం ఫుడ్డు..!
సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణమధ్య రైల్వేలో వివిధ ప్రాంతాల మధ్య ప్రతి రోజు 10 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. సుమారు 800 రైళ్లు సేవలు  అందిస్తున్నాయి. అన్ని ప్రధాన రైళ్లలో ఆహార పదార్థాలు అందజేసేందుకు ప్యాంట్రి కార్ల ఉన్నాయి. స్టేషన్లలోనూ రెస్టారెంట్‌లు, క్యాంటిన్లు ఏర్పాటు చేశారు. ఐఆర్‌సీటీసీ, ప్రైవేట్ కేటరింగ్ సంస్థలు, హోటళ్లు ఆహార సేవలు అందిస్తున్నాయి. అయితే, ప్యాంట్రి కార్లలో పూర్తి అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. పదార్థాలు సప్లైచేసే సిబ్బంది సైతం శుభ్రత పాటించడం లేదు. చేతులకు గ్లౌజ్‌లు కూడా వేసుకోరు. మరోవైపు ఆహార పదార్థాల ధరలు ఎక్కువ, పరిమాణం తక్కువ. 100 గ్రాముల ఇడ్లీ ధర రూ.28. కానీ 80 గ్రాములే ఉంటుంది. 250 గ్రాముల పెసరట్టు ధర రూ.55. ప్రయాణికుడి చేతికి ఇచ్చేది 200 గ్రాములే. వాటర్ బాటిళ్లపై కూలింగ్ చార్జీల పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సమస్యలపై ఫిర్యాదు చేస్తే చర్యలు మాత్రం ఉండవు.

బెర్తుకు ‘చిల్లర’ బేరం
బోగీల్లో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, ఇతరులకు బెర్తులు, సీట్ల కేటాయింపుల్లో టీసీల చేతివాటం పైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత సమర్పించుకుంటే తప్ప బెర్తు లభించదు. పైగా లోయర్ బెర్తు, అప్పర్ బెర్తు పేరిట మరో బేరం. రైళ్లలోనూ, స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లలోనూ కమర్షియల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తారు. అడిగిందానికి సమాధానం ఇవ్వకుండా బెదిరిస్తారు. టిక్కెట్ ఇచ్చిన తరువాత చిల్లర డబ్బులు ఇవ్వడం లేదు. ట్రైన్ వెళ్లిపోతోందేమోననే ఆందోళనలో ఉన్న ప్రయాణికులు రెలైక్కాక చూసుకుంటే రూ.వందో, రూ.యాభయ్యో తక్కువ ఉంటాయి.

‘తత్కాల్’ దందా..
రిజర్వేషన్ కేంద్రాల్లో దళారుల నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. ముఖ్యంగా తత్కాల్ కోటాను దళారులే ఎగురేసుకుపోతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రయాణికులు లైన్‌లో నిలుచుని ఉండగానే క్షణాల్లో టిక్కెట్లు అయిపోయి కౌంటర్‌లు మూసేస్తారు. మరోవైపు పార్శిల్ సెక్షన్‌లోనూ సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ ప్రయాణికులను వేధిస్తున్నారు. ఇలాంటి సేవల్లోనూ ప్రయాణికులు తమ ఇబ్బందులను తెలియజేస్తూనే ఉన్నారు.

ఏసీ బోగీల్లో సేవలు శూన్యం..
వేలకు వేలు చెల్లించి ఏసీ బోగీల్లో వెళ్లే ప్రయాణికులకు కూడా తగిన సేవలు లభించడం లేదు. ఫస్ట్ ఏసీ బోగీల్లోనే నీళ్లు రావడం లేదని, ఆన్‌బోర్డు సిబ్బందిని విచారిస్తే సమాధానం చెప్పకుండా వెళ్తారని ప్రయాణికులు చెబుతున్నారు. చాలా సార్లు ఏసీలు పనిచేయవు. ఫ్యాన్లు తిరగవు. ఎలక్ట్రికల్ సిబ్బంది అందుబాటులో ఉండరు. ఉన్నా ఫిర్యాదును పెడచెవిన పెడతారు. టాయిలెట్లు కంపు.. రాత్రి వేళ ల్లో నీళ్లు రావు. ఆ సమయంలో ఫిర్యాదు చేసినా స్పందించే నాధుడు ఉండడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ఫిర్యాదు చేసే మార్గాలు ఇవీ..
సెంట్రలైజ్‌డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టం (సీపీజీఆర్‌ఏఎంఎస్)
కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఓఎంఎస్) వెబ్ పోర్టల్
టోల్‌ఫ్రీ నెంబర్: 8121281212 కు ఎస్సెమ్మెస్
ఆల్ ఇండియా హెల్ప్‌లైన్ నెంబర్: 138
దక్షిణమధ్య రైల్వేలోని ప్రధాన కార్యాలయం,
డీఆర్‌ఎం, ఇతర ఉన్నతాధికారులకు నేరుగా అందజేసే ఫిర్యాదులు.
ప్రయాణికులకు అందజేసే సేవలు, సదుపాయాలు, భద్రత వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని 10 విభాగాలుగా ఫిర్యాదులను విభజించారు. ఆయా విభాగాల్లో ఫిర్యాదుల శాతం ఇలా ఉంది...

1.   ఆహార పదార్థాల్లో నాణ్యత, కొరవడిన రుచి, చిరుతిళ్ల అమ్మకాల్లో అధిక ధరలు: 29.49
2.  కమర్షియల్ సిబ్బంది దురుసు ప్రవర్తన: 17.98
3.  రిజర్వేషన్లలో ఎదురయ్యే ఇబ్బందులు, ఏజెంట్ల జోక్యం: 10.86
4.  వస్తువుల పార్శిల్ బుకింగ్‌లో ఎదురయ్యే సమస్యలపై: 8.45
5.  సిబ్బంది లంచాలు, అవినీతిపై: 8.34
6.  సీట్లు,బెర్తుల కేటాయింపుల్లో అక్రమాలు: 7.41
7.  బుకింగ్ కౌంటర్ల ఎదురయ్యే సమస్యలు: 6.52
8.  ఆన్‌బోర్డింగ్ హౌస్‌కీపింగ్ సిబ్బంది అమర్యాద ప్రవర్తన: 3.73
9. రైల్వేయేతర అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పనితీరుపై: 3.73
10.విచారణ కేంద్రాల్లో ప్రయాణికులకు కావలసిన సమాచారం ఇవ్వకపోవడంపై: 3.49

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement