సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యంలో పురుగులు, బూజు ఉంటుండటంతో వాటిని తీసుకొని మేమేం చేయాలని లబ్ధిదారులు వాపోతున్నారు. ఉచిత బియ్యం పనికిరానివిగా తయారయ్యాయి. దీంతో వండుకొని ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తమకు పురుగులు పట్టిన బియ్యం పంపిణీ చేస్తున్నారని మండిపడుతున్నారు.
నవంబర్ కోటా కింద మెజారిటీ చౌకధరల దుకాణాలకు నాసిరకం బియ్యం పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. అధికంగా నాసిరకం బియ్యమే వచ్చాయని డీలర్లు పేర్కొంటున్నారు. గోదాముల్లో నిల్వ ఉన్న స్టాక్ పంపిస్తుండటంతో బియ్యం పురుగులు, తుట్టెల మయంగా మారింది. సంబందిత అదికారుల పర్యవేక్షణ లోపంతోనే నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు.
డీలర్లతో లబ్ధిదారుల గొడవ
ఉచిత పంపిణీ ప్రక్రియతో సన్న బియ్యం కాస్త దొడ్డుగా మారినట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. వాస్తవంగా పాఠశాలలకు సరఫరా చేసే బియ్యాన్ని స్టాకు ఉన్నంత వరకు రేన్ షాపులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా...అమలు మాత్రం మునాళ్ల ముచ్చటగా మారింది. ప్రస్తుతం దొడ్డుబియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు డీలర్లతో వాగ్వివాదానికి దిగడం సర్వసాధారణమైంది. సన్నబియ్యం అమ్ముకుని తమకు నాసిరకమైన దొడ్డుబియ్యాన్ని అంటగడుతున్నారని వాదనకు దిగుతున్నారు.
బియ్యం అంతా పురుగులు పట్టి తుట్టెలు కట్టి ఉండడంతో తమకు వద్దని, నాణ్యమైన బియ్యం అందించాలని మరికొందరు అక్కడే ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం, అధికారులు చొరవ చూపి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
వసతి గృహాల్లో సైతం..
వసతిగృహాల విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కయింది. వేసవి సెలవులకు ముందొచ్చిన బియ్యాన్ని వసతిగృహాల్లో నిల్వ ఉంచగా పురుగులు పట్టాయి. వాటినే వండి పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసతిగృహాల్లో బియ్యం పురుగు పడుతున్నాయి. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వసతి గృహాలు మూత పడి బియ్యం నిల్వ ఉండడంతో పురుగులు పడినట్లు తెలుస్తోంది.
తాజాగా వసతి గృహాలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు నిల్వ బియ్యాన్నే వార్డెన్లు వండి పెడుతున్నారు. పురుగులు పట్టిన బియ్యాన్ని పౌర సరఫరాల గోదాముకు అప్పగించి వాటి స్థానంలో కొత్త బియ్యాన్ని తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉన్న నిల్వ బియ్యాన్నే వండి పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment